మార్కెట్ పతనంలోనూ దూసుకెళ్లిన సిమెంట్ కంపెనీ షేర్లు.. ఇప్పుడు మరో న్యూస్!
Heidelberg cement Share : హైడెల్ బర్గ్ సిమెంట్ ఇండియా షేర్లు నేడు పెరిగాయి. స్టాక్ మార్కెట్ కష్టాల్లో ఉండగా హైడెల్ బర్గ్ సిమెంట్ ఇండియా లిమిటెడ్ షేర్లు 10 శాతం వరకు పైకి వెళ్లాయి.
స్టాక్ మార్కెట్ కష్టాల్లో నడుస్తుండగా హైడెల్ బర్గ్ సిమెంట్ ఇండియా షేర్లు మాత్రం పెరిగి ఆశ్చర్యపరిచాయి. సోమవారం కంపెనీ షేర్ల క్రయవిక్రయాలు భారీగా జరిగాయి. బీఎస్‌ఈలో కంపెనీ షేరు రూ.219.20 స్థాయిలో ప్రారంభమైంది. ఇంట్రాడేలో కంపెనీ షేరు రూ.242 వద్ద గరిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో కంపెనీకి చెందిన 4.62 మిలియన్లకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. ఇది ఫ్రీ ఫ్లోట్ ఈక్విటీలో 6.7 శాతానికి సమానం. మూడో త్రైమాసికం ముగిసేనాటికి కంపెనీలో మొత్తం ప్రమోటర్ల వాటా 69.39 శాతంగా ఉంది.
2024 అక్టోబర్ 7న బీఎస్ఈలో ఈ సిమెంట్ కంపెనీ షేరు ధర రూ.257.85 స్థాయికి చేరుకుంది. అంబుజా సిమెంట్ కంపెనీ ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ చర్చలను కంపెనీ అప్పట్లో ఖండించింది. ఇప్పుడు మరోసారి ఈ జర్మన్ కంపెనీకి చెందిన ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు అల్ట్రాటెక్ సిమెంట్ చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఇరు కంపెనీల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
జనవరి 30న కంపెనీ బోర్డు సమావేశం జరగనుంది. అదే రోజు కంపెనీ త్రైమాసిక ఫలితాలపై నిర్ణయం తీసుకోనుంది. అంతకుముందు సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ పనితీరు బాగా లేదు. కంపెనీ విలువ 15 శాతం పడిపోయింది.
కంపెనీ డిసెంబర్ 2024లో స్టార్ సిమెంట్‌లో 8.69 శాతం వాటాను రూ. 851 కోట్లకు కొనుగోలు చేసింది. మైసూర్ సిమెంట్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా హైడెల్‌బర్గ్ మెటీరియల్స్ గ్రూప్ 2006లో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. 2009 నాటికి కంపెనీ దాని సామర్థ్యాన్ని సంవత్సరానికి 5.4 మిలియన్ టన్నులకు(MTPA) విస్తరించగలిగింది. మీడియా నివేదికల ప్రకారం ప్రస్తుతం 14 మిలియన్ టన్స్ సామర్థ్యం ఉంది.
అల్ట్రాటెక్ కొనుగోలు చేస్తుందా?
కొన్ని మీడియా కథనాల ప్రకారం.. భారతదేశపు అగ్రశ్రేణి సిమెంట్ ఉత్పత్తిదారు అయిన అల్ట్రాటెక్ సిమెంట్.. భారతదేశ హైడెల్‌బర్గ్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది. అల్ట్రాటెక్ మాతృ సంస్థ అయిన ఆదిత్య బిర్లా గ్రూప్‌లోని ఎగ్జిక్యూటివ్‌లు హైడెల్‌బర్గ్ సిమెంట్ ఇండియా కొనుగోలుపై చర్చించేందుకు హైడెల్‌బర్గ్ మేనేజ్‌మెంట్‌ను కలిశారని అంటున్నారు.
గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించండి.