HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ IPO: నేడే మార్కెట్‌లోకి.. అరంగేట్రంపై బలమైన అంచనాలు-hdb financial services ipo listing date today gmp experts signal strong debut ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hdb ఫైనాన్షియల్ సర్వీసెస్ Ipo: నేడే మార్కెట్‌లోకి.. అరంగేట్రంపై బలమైన అంచనాలు

HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ IPO: నేడే మార్కెట్‌లోకి.. అరంగేట్రంపై బలమైన అంచనాలు

HT Telugu Desk HT Telugu

హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ (HDB Financial Services) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) నేడు మార్కెట్‌లోకి రాబోతోంది. ఐపీఓకు వచ్చిన బలమైన స్పందన, గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) సంకేతాలను బట్టి చూస్తే, ఈ షేర్లు భారత స్టాక్ మార్కెట్లో మంచి లాభాలతో అడుగుపెట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ (HDB Financial Services) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) నేడు మార్కెట్‌లోకి రాబోతోంది. (Photo: Company Website)

హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ (HDB Financial Services) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) నేడు మార్కెట్‌లోకి రాబోతోంది. ఐపీఓకు వచ్చిన బలమైన స్పందన, గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) సంకేతాలను బట్టి చూస్తే, ఈ షేర్లు భారత స్టాక్ మార్కెట్లో మంచి లాభాలతో అడుగుపెట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

నేడు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ జూన్ 27న ముగిసింది. ఈ ఐపీఓ ఏకంగా 27 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యిందంటేనే ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కంపెనీ ఈక్విటీ షేర్లు నేడు అంటే 2025, జూలై 2న బీఎస్‌ఈ (BSE), ఎన్‌ఎస్‌ఈ (NSE)లలో లిస్ట్ కానున్నాయి.

బీఎస్‌ఈ విడుదల చేసిన నోటీసు ప్రకారం "2025 జూలై 2, బుధవారం నుండి హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఈక్విటీ షేర్లు 'బి' గ్రూప్ సెక్యూరిటీల జాబితాలో చేరి, ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి" అని చెప్పింది.

హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు ఈరోజు (జూలై 2, బుధవారం) ప్రత్యేక ప్రీ-ఓపెన్ సెషన్ (SPOS) లో భాగమవుతాయి. ఉదయం 10:00 గంటల నుండి షేర్లు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయని కూడా నోటీసులో ఉంది.

గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ఏం సూచిస్తోంది?

ఐపీఓ లిస్టింగ్‌కు ముందు గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ట్రెండ్‌లు, స్టాక్ మార్కెట్ నిపుణుల అంచనాలను బట్టి చూస్తే, షేర్లు మంచి లాభాలతోనే మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ నిపుణులు చెప్పిన దాని ప్రకారం, హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ జీఎంపీ ప్రస్తుతం షేరుకు రూ. 75గా ఉంది. అంటే, ఇష్యూ ధర రూ. 740తో పోలిస్తే, గ్రే మార్కెట్లో ఈ షేర్లు రూ. 75 ఎక్కువ ధరకు అమ్ముడవుతున్నాయని అర్థం.

ఈ లెక్కన హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ల అంచనా లిస్టింగ్ ధర షేరుకు రూ. 815 వరకు ఉండొచ్చని జీఎంపీ సూచిస్తోంది. ఇది ఐపీఓ ధర కంటే 10.14% ఎక్కువ. విశ్లేషకులు కూడా ఇష్యూ ధర కంటే 7% నుండి 10% వరకు ప్రీమియంతో హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ లిస్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

నిపుణులు ఏమంటున్నారు?

మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రశాంత్ తప్సే మాట్లాడుతూ, "హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ చివరకు భారత స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. తొలి అంచనాల ప్రకారం, 8-10% లిస్టింగ్ లాభం రావచ్చని తెలుస్తోంది. ఇది పెట్టుబడిదారుల నుంచి ఉన్న బలమైన ఆసక్తిని తెలియజేస్తోంది. ఈ ఐపీఓకు ఏకంగా రూ. 1.61 లక్షల కోట్లకు పైగా బిడ్లు వచ్చాయి. సంస్థాగత, రిటైల్ పెట్టుబడిదారులు భారీగా ఆసక్తి చూపారు. హెచ్‌డిబి వ్యాపార విధానం, హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ సంస్థ కావడం, ఎన్‌బిఎఫ్‌సి రంగంలో దీర్ఘకాలికంగా వృద్ధి చెందే అవకాశం వంటి అంశాలపై మార్కెట్‌కు గట్టి నమ్మకం ఉందని దీని ద్వారా స్పష్టమవుతోంది" అని అన్నారు.

హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ అంచనాలను నిజం చేస్తే, నాణ్యమైన ఆర్థిక సేవల సంస్థల పట్ల, ముఖ్యంగా విశ్వసనీయ సంస్థల మద్దతు ఉన్న వాటి పట్ల పెట్టుబడిదారుల ఆసక్తి ఎంత ఉందో మరోసారి రుజువు అవుతుందని తప్సే అభిప్రాయపడ్డారు.

ఐఎన్‌విఅసెట్ పిఎంఎస్ బిజినెస్ హెడ్ భావిక్ జోషి మాట్లాడుతూ, హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ జీఎంపీ 9%-11% లిస్టింగ్ లాభాన్ని సూచిస్తుందని తెలిపారు. "లిస్టింగ్ తర్వాత కంపెనీ పనితీరు అనేది నిలకడైన ఆదాయం, క్రెడిట్ ఖర్చుల నియంత్రణ, వడ్డీ రేట్లు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్‌బిఎఫ్‌సి రంగం ఎలా ఉంటుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. పెట్టుబడిదారులు ఈరోజు లిస్టింగ్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న క్రెడిట్ వ్యవస్థలో దీర్ఘకాలికంగా పాల్గొనడానికి ఇది ఒక అవకాశం" అని జోషి సూచించారు.

ఐపీఓ సబ్‌స్క్రిప్షన్, ఇతర వివరాలు:

హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ జూన్ 25, బుధవారం మొదలై, జూన్ 27, శుక్రవారం ముగిసింది. కంపెనీ షేరుకు రూ. 740 స్థిర ధర వద్ద ఈ ఐపీఓ ద్వారా రూ. 12,500 కోట్లు సమీకరించింది.

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ డేటా ప్రకారం, హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ మొత్తం 16.69 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో 5.72 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIBs) విభాగంలో ఏకంగా 55.47 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (NII) విభాగంలో 9.99 రెట్లు సబ్‌స్క్రిప్షన్ నమోదైంది.

(ముఖ్య గమనిక: పైన పేర్కొన్న అభిప్రాయాలు, సిఫార్సులు కేవలం వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ సంస్థలవి మాత్రమే, హిందుస్తాన్ టైమ్స్ వి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు, ఆధీకృత నిపుణులను సంప్రదించాలని మేం పెట్టుబడిదారులకు సూచిస్తున్నాం.)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.