H-1B registration: మార్చి 7 నుంచి హెచ్-1బీ వీసాల రిజిస్ట్రేషన్ ప్రారంభం; భారీగా ఫీజు పెంపు
H-1B registration: 2025-26 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసాల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని మార్చి 7వ తేదీ నుంచి యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ప్రారంభించనుంది. 85 వేలకు పైగా హెచ్-1బీ వీసాలకు రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.

H-1B registration: 2025-26 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ పీరియడ్ మార్చి 7న ప్రారంభమై మార్చి 24న ముగియనుంది. ఈ ఏడాది హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులను స్పాన్సర్ చేసే యజమానులు ఈ-రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం అధిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
భారీగా వీసా ఛార్జీల పెంపు
ఈ సంవత్సరం నుంచి ప్రతీ హెచ్-1బీ వీసా అప్లికేషన్ కు 125 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది గత సంవత్సరం వరకు ఉన్న ఫీజు అయిన 10 డాలర్ల కంటే చాలా ఎక్కువ. బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా, హెచ్-1బీ వీసా దరఖాస్తుదారుల రిజిస్ట్రేషన్ ఖర్చులు భారీగా పెరిగాయి. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ సమగ్రతను పెంచేందుకు గత అమెరికా ప్రభుత్వం ఈ మార్పులను ప్రవేశపెట్టింది.
హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక మార్పులు?
గత సంవత్సరం నుంచి బెనిఫిషియరీ సెంట్రిక్ సిస్టమ్ ను ప్రారంభించారు. అదే విధానాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నారు. ఈ విధానంలో ప్రతి దరఖాస్తుదారుడి తరఫున ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసినా ఒక్కసారి మాత్రమే అతడి పేరును లాటరీలో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ ప్రతి దరఖాస్తుదారుని పాస్ పోర్ట్ సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇది ప్రత్యేక ఐడెంటిఫైయర్ గా పనిచేస్తుంది. లాటరీ ప్రయత్నాల సంఖ్యను ట్రాక్ చేస్తుంది. ఒకే వ్యక్తికి బహుళ ఎంట్రీలను నివారించడానికి ఈ సిస్టమ్ ను తీసుకువచ్చారు.
హెచ్-1బీ రిజిస్ట్రేషన్, లాటరీ ప్రక్రియ అంటే ఏమిటి?
ఈ సంవత్సరం కూడా వార్షిక పరిమితి అయిన 85,000 (ఇందులో 20 వేలు విదేశీ విద్యార్థులకు రిజర్వ్డ్) హెచ్-1బీ వీసాల కన్నా ఎక్కువ హెచ్-1బీ రిజిస్ట్రేషన్లు వస్తాయని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) భావిస్తోంది. రిజిస్ట్రేషన్ కు గడువు ముగిసిన తరువాత, హెచ్ 1 బీ వీసా లబ్ధిదారులను ఎంపిక చేయడానికి యుఎస్సీఐఎస్ లాటరీ నిర్వహిస్తుంది. లాటరీ ద్వారా వార్షిక పరిమితి అయిన 65,000 వీసాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది.