GST revenue: 2024 ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు; 2 లక్షల కోట్లను దాటేశాయి..-gst revenue collection for april 2024 highest ever at rs 2 1 lakh crore ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gst Revenue: 2024 ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు; 2 లక్షల కోట్లను దాటేశాయి..

GST revenue: 2024 ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు; 2 లక్షల కోట్లను దాటేశాయి..

HT Telugu Desk HT Telugu
May 01, 2024 01:35 PM IST

GST revenue collection: గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ వసూళ్లు ప్రతీనెల రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ ఎప్రిల్ నెలలో ఈ వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్లకు పెరిగాయి.

ఏప్రిల్ లో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు
ఏప్రిల్ లో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు

వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు ఈ ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్లకు పెరిగాయి. జీఎస్టీ వసూళ్లు 12.4 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దేశీయ లావాదేవీలు 13.4 శాతం పెరగడం, దిగుమతులు 8.3 శాతం పెరగడం ఈ వృద్ధికి కారణమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

రీఫండ్స్ అనంతరం..

రీఫండ్ల లెక్కింపు తర్వాత 2024 ఏప్రిల్ నెలలో నికర జీఎస్టీ (GST) ఆదాయం రూ .1.92 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 17.1 శాతం వృద్ధిని చూపించింది. ఏప్రిల్ 2024 కలెక్షన్లు వివిధ విభాగాల్లో సానుకూల పనితీరును వెల్లడిస్తుంది. 2024 లో కేంద్ర వస్తు, సేవల పన్ను (CGST) రూ.43,846 కోట్లు, రాష్ట్ర వస్తు, సేవల పన్ను (SGST) వసూళ్లు రూ.53,538 కోట్లుగా నమోదయ్యాయి. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (IGST) వసూళ్లు మొత్తం రూ.99,623 కోట్లు కాగా, దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేసిన పన్ను రూ.37,826 కోట్లుగా ఉంది. అదనంగా సెస్ వసూళ్లు రూ.13,260 కోట్లకు చేరుకున్నాయి, ఇందులో దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేసిన సెస్ రూ.1,008 కోట్లుగా ఉంది.

ఇంటర్ గవర్నమెంట్ సెటిల్మెంట్

ఇంటర్ గవర్నమెంట్ సెటిల్మెంట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఐజీఎస్టీ నుంచి సీజీఎస్టీకి రూ.50,307 కోట్లు, ఎస్జీఎస్టీకి రూ.41,600 కోట్లు పంపిణీ చేసింది. దీంతో 2024 ఏప్రిల్లో సీజీఎస్టీకి రూ.94,153 కోట్లు, ఎస్జీఎస్టీకి రూ.95,138 కోట్ల ఆదాయం సమకూరింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం స్థూల జీఎస్టీ వసూళ్లు రూ .20.18 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11.7 శాతం పెరుగుదల. అంతేకాదు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ .20 లక్షల కోట్లు దాటింది. 2024 మార్చితో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరానికి సగటు నెలవారీ వసూళ్లు రూ .1.68 లక్షల కోట్లుగా ఉంది. అంతకుముందు సంవత్సరం సగటు రూ .1.5 లక్షల కోట్లు.

భారత ఆర్థిక వ్యవస్థ సానుకూల పంథా

జీఎస్టీ వసూళ్లలో కనిపిస్తున్న పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థలోని సానుకూల పంథాను ప్రతిబింబిస్తుంది. బలమైన దేశీయ వినియోగం, పెరుగుతున్న దిగుమతి కార్యకలాపాలను జీఎస్టీ వసూళ్లు నొక్కి చెప్తున్నాయి. ఈ గణాంకాలు దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకర ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రపంచ అనిశ్చితి పరిస్థితుల మధ్య కూడా భారత్ ఈ వసూళ్లు సాధించడం ప్రశంసనీయం. జూలై 1, 2017 నుండి దేశంలో వస్తు, సేవల పన్నును ప్రవేశపెట్టారు. జీఎస్టీ (రాష్ట్రాలకు పరిహారం) చట్టం, 2017 లోని నిబంధనల ప్రకారం జీఎస్టీ అమలు వల్ల తలెత్తే ఏదైనా ఆదాయ నష్టానికి రాష్ట్రాలకు ఐదేళ్ల కాలానికి పరిహారం లభిస్తుంది.

Whats_app_banner