ఆదాయపు పన్ను మినహాయింపు తరువాత, ఇప్పుడు సామాన్యుడికి మరో పెద్ద ఉపశమనం లభిస్తుంది. మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలకు శుభవార్త వస్తుంది. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)లో కోత రూపంలో ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. 12 శాతం జీఎస్టీ స్లాబ్‌ను పూర్తిగా రద్దు చేయడం లేదా 5 శాతం స్లాబులో చేర్చేలా మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపు తర్వాత ఇది పెద్ద ఉపశమనం కానుంది. జీఎస్టీ స్లాబును పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీటిలో మధ్యతరగతి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉపయోగించే వస్తువులు ఉంటాయి.
టూత్ పేస్ట్, టూత్ పౌడర్, గొడుగులు, కుట్టు మిషన్లు, ప్రెజర్ కుక్కర్లు, వంటింటి పాత్రలు, ఎలక్ట్రిక్ ఇస్త్రీ, గీజర్లు, స్మాల్ కెపాసిటీ వాషింగ్ మెషీన్లు, సైకిళ్లు, రూ.1,000 కంటే ఎక్కువ ధర కలిగిన రెడీమేడ్ దుస్తులు, రూ.500 నుంచి రూ.1,000 మధ్య ధర కలిగిన బూట్లు, స్టేషనరీ వస్తువులు, వ్యాక్సిన్లు, సిరామిక్ టైల్స్, వ్యవసాయ పరికరాలు మొదలైనవటి ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇదే జరిగితే భవిష్యత్తులో ఈ వస్తువులన్నీ చౌకగా లభిస్తాయి. ఇదే కాకుండా సరళమైన, సులభమైన జీఎస్టీ వ్యవస్థను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై రూ.40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల వరకు భారం పడుతుందని నివేదిక పేర్కొంది. అయితే చౌక వస్తువుల వల్ల వినియోగం పెరుగుతుందని, వినియోగం పెరిగినప్పుడు జీఎస్టీ వసూళ్లు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. తక్కువ ధరలు అధిక అమ్మకాలకు దారితీస్తాయని, ఇది అంతిమంగా పన్ను బేస్‌ను పెంచుతుందని, దీర్ఘకాలికంగా జీఎస్టీ వసూళ్లను పెంచుతుందని కేంద్రం భావిస్తోంది. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ఇంటర్వ్యూలో జీఎస్టీ రేట్లలో మార్పులను సూచిస్తూ నిత్యావసర వస్తువులపై మధ్యతరగతికి ఉపశమనం కలిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు.