'అప్పు చేసి పప్పు కూడు' వద్దంటున్న యువత; వ్యక్తిగత రుణాలపై తగ్గిన ఆసక్తి-growing financial discipline among indian youth reluctance to take loans focus on investments ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  'అప్పు చేసి పప్పు కూడు' వద్దంటున్న యువత; వ్యక్తిగత రుణాలపై తగ్గిన ఆసక్తి

'అప్పు చేసి పప్పు కూడు' వద్దంటున్న యువత; వ్యక్తిగత రుణాలపై తగ్గిన ఆసక్తి

Sudarshan V HT Telugu

భారతదేశంలోని యువత ఆలోచనల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. చిన్న వయస్సులోనే ఆదాయం ప్రారంభమైనప్పటికీ, అనవసర ఖర్చులకు వారు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు, లగ్జరీల కోసం రుణాలు తీసుకునే అలవాటుకు కూడా దూరంగా ఉంటున్నారు.

ప్రతీకాత్మక చిత్రం

‘అప్పు చేసి పప్పు కూడు తినొద్దు' అనే సామెతను భారత యువతరం ఇప్పుడు నిజంగానే ఆచరిస్తోంది. గతంలో మాదిరిగా అనవసర ఖర్చులకు విచ్చలవిడిగా రుణాలు తీసుకోవడం లేదు., అవసరం ఉన్నా లేకున్నా వస్తువులు ఖరీదైన కొనడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

పొదుపు లేదా పెట్టుబడులు

తమ వద్ద ఉన్న డబ్బును పొదుపు చేయడానికి, లేదా వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తప్పనిసరి అయితేనే, అది కూడా స్థిరాస్తులు లేదా చరాస్తులు సమకూర్చుకోవడానికి మాత్రమే అప్పు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. రెండు మూడు క్రెడిట్ కార్డులున్నా, 'పొదుపు' మంత్రాన్ని పాటిస్తున్నారు. ప్రస్తుతం దేశీయంగా, అంతర్జాతీయంగా జాబ్ మార్కట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, పెద్ద పెద్ద కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగిస్తూ లే ఆఫ్ లు ప్రకటిస్తుండడం, ఎర్లీ రిటైర్మెంట్ గురించిన ఆలోచనలు పెరగడం.. తదితర కారణాల వల్ల ప్రస్తుత యువతలో అనవసర రుణాల జోలికి వెళ్లకూడదన్న ధోరణి పెరుగుతోంది.

ట్రాన్స్‌యూనియన్ సిబిల్ నివేదిక

ఈ పరిణామాల ఫలితంగా, 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 12 శాతంగా ఉన్న రిటైల్ రుణాల వృద్ధిరేటు, 2024-25 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఏకంగా ఐదు శాతానికి పడిపోయింది అని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ఒక నివేదికలో వెల్లడించింది. కన్స్యూమర్ డ్యూరబుల్ రుణాలు, క్రెడిట్ కార్డు రుణాల తగ్గుదల దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా పట్టణ, మెట్రో నగరాల్లో నివసిస్తున్న 35 ఏళ్ల లోపు యువత అప్పులు తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. హామీలేని రుణాలపై 2023 చివరిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విధించిన ఆంక్షలు కూడా ఈ ధోరణికి కారణమని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తెలిపింది.

నివేదికలోని ఇతర ప్రధానాంశాలు

ట్రాన్స్‌యూనియన్ సిబిల్ నివేదికలోని ముఖ్యాంశాలు

  • క్రెడిట్ కార్డు రుణాల వృద్ధిరేటు: జీరో నుండి మైనస్ 32 శాతానికి పడిపోయింది.
  • వ్యక్తిగత రుణాల వృద్ధి: 13 శాతం నుండి ఆరు శాతానికి తగ్గింది.
  • కన్స్యూమర్ డ్యూరబుల్స్ రుణాల వృద్ధిరేటు: 19 శాతం నుండి ఆరు శాతానికి తగ్గింది.
  • క్రెడిట్ యాక్టివ్ వినియోగదారులు: 15 శాతం నుండి ఎనిమిది శాతానికి తగ్గారు.
  • కొత్తగా రుణాలు తీసుకునే వారి వృద్ధిరేటు: 19 శాతం నుండి 16 శాతానికి తగ్గింది.
  • గృహ రుణాల వృద్ధిరేటు: ఐదు శాతం నుండి మైనస్ ఏడు శాతానికి పడిపోయింది.
  • రూ. కోటిపైగా రుణాలు: తొమ్మిది శాతం పెరిగాయి. ఇది సంపన్నులు, పెద్ద వ్యాపారాలు రుణాలు తీసుకోవడంలో పెరుగుదలను సూచిస్తుంది.
  • గ్రామీణ రుణాలు: 20 శాతం నుండి 22 శాతానికి పెరిగాయి.
  • సెమీ అర్బన్ ప్రాంత రుణాల వృద్ధి: 29 శాతం నుండి 30 శాతానికి పెరిగింది.

ఈ గణాంకాలు భారతదేశంలో వినియోగదారుల రుణ ప్రవర్తనలో ఒక స్పష్టమైన మార్పును సూచిస్తున్నాయి. యువతలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతున్నదని, అలాగే గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రుణ అవసరాలు పెరుగుతున్నాయని ఈ నివేదిక తెలియజేస్తుంది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం