టోల్ ఛార్జీల విషయంలో వాహనదారులకు బిగ్ రిలీఫ్! సొరంగ మార్గాలు, వంతెనలు, ఫ్లైఓవర్లు లేదా ఎలివేటెడ్ స్ట్రెచ్‌లు వంటి నిర్మాణాలను కలిగి ఉన్న జాతీయ రహదారుల్లో టోల్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం మోటార్‌సైకిల్ ప్రయాణికుల ప్రయాణ ఖర్చులను తగ్గిస్తుంది. జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజులను ఎన్‌హెచ్ ఫీజు రూల్స్ 2008 ప్రకారం వసూలు చేస్తారు. ఇక ఇప్పుడు రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2008 నిబంధనలకు సవరణలు చేసింది. భారతదేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను లెక్కించడానికి ఒక కొత్త పద్ధతి లేదా ఫార్ములాను నోటిఫై చేసింది.
ఇటీవలే విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం.. "ఒక నిర్మాణం లేదా నిర్మాణాలను కలిగి ఉన్న జాతీయ రహదారి విభాగం వినియోగానికి సంబంధించిన రుసుము రేటును లెక్కించేటప్పుడు, నిర్మాణాల పొడవును మినహాయించి, జాతీయ రహదారి విభాగం పొడవుకు నిర్మాణాల పొడవును పది రెట్లు లేదా జాతీయ రహదారి విభాగం మొత్తం పొడవును ఐదు రెట్లు, ఈ రెండిటిలో ఏది తక్కువైతే దానిని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది." ఈ "నిర్మాణాలు" అంటే వంతెన, సొరంగం లేదా ఫ్లైఓవర్ లేదా ఎలివేటెడ్ హైవే అని అర్థం"
కొత్త టోల్ ఛార్జీలను వివరించడానికి, మంత్రిత్వ శాఖ ఉదాహరణలను ఉటంకించింది. ఒక ఉదాహరణలో, ఒక జాతీయ రహదారి విభాగం మొత్తం 40 కిలోమీటర్ల పొడవు ఉండి, అది కేవలం నిర్మాణం మాత్రమే అయితే, కనిష్ట పొడవును ఇలా లెక్కిస్తారు:
'10 x 40 (నిర్మాణం పొడవుకు పది రెట్లు) = 400 కిలోమీటర్లు లేదా జాతీయ రహదారి విభాగం మొత్తం పొడవుకు ఐదు రెట్లు = 5 x 40 = 200 కిలోమీటర్లు'. వినియోగదారుడు తక్కువ పొడవుపై అంటే 200 కిలోమీటర్లకు మాత్రమే యూజర్ ఫీజు చెల్లిస్తారు, 400 కిలోమీటర్లకు కాదు. ఈ సందర్భంలో, వినియోగదారు ఛార్జ్ రహదారి పొడవులో సగం మాత్రమే ఉంటుంది!
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. నిర్మాణ పొడవుకు సంబంధించి సాధారణం కంటే పది రెట్లు ఎక్కువ టోల్ని వినియోగదారులు కడుతున్నారు. అటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన అధిక నిర్మాణ వ్యయాలను భర్తీ చేయడానికి ప్రస్తుతం ఉన్న టోల్ లెక్కింపు పద్ధతిని అనుసరించారు. ఇప్పుడు చేసిన సవరణల ద్వారా ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుంది.
సంబంధిత కథనం