2025 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ నిర్ణయించిన వడ్డీ రేటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం; వడ్డీ రేటు ఎంతంటే?-govt ratifies interest rate at 8 25 percent on employees pf for fy25 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2025 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ నిర్ణయించిన వడ్డీ రేటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం; వడ్డీ రేటు ఎంతంటే?

2025 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ నిర్ణయించిన వడ్డీ రేటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం; వడ్డీ రేటు ఎంతంటే?

Sudarshan V HT Telugu

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) డిపాజిట్లపై 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించిన వడ్డీరేటుకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది. ఈపీఎఫ్ఓ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించాలని ఈపీఎఫ్ఓ ఈ ఏడాది ప్రారంభంలో నిర్ణయించింది.

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు

ఉద్యోగుల భవిష్య నిధిపై వడ్డీ రేటును 2025 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతంగా ఈపీఎఫ్ఓ నిర్ధారించింది. ఈపీఎఫ్ఓ ప్రతిపాదనకు శనివారం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రిటైర్మెంట్ ఫండ్ బాడీ అయిన ఈపీఎఫ్ఓకు 7 కోట్లకు పైగా చందాదారులున్నారు. వారి ఖాతాల్లో ఈ వార్షిక వడ్డీరేటుతో వడ్డీని జమ చేయనున్నారు.

ఫిబ్రవరిలో నిర్ణయం

2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించాలని ఫిబ్రవరి 28న ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఫిబ్రవరి 28న ఢిల్లీలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 237వ సమావేశంలో వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకున్నారు. అనంతరం, 2024-25 సంవత్సరానికి ఆమోదం పొందిన ఆ ఆ ప్రతిపాదిత వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ సమ్మతి కోసం పంపారు.

వడ్డీ రేటు 8.25 శాతం

2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ పై 8.25 శాతం వడ్డీ రేటుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపిందని, దీనికి సంబంధించిన సమాచారాన్ని కార్మిక మంత్రిత్వ శాఖ గురువారం ఈపీఎఫ్ఓకు పంపిందని కార్మిక మంత్రిత్వ శాఖ అధికారి శనివారం వెల్లడించారు. ఇప్పుడు 2025 ఆర్థిక సంవత్సరానికి ఆమోదించిన రేటు ప్రకారం వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్ఓ లోని ఏడు కోట్లకు పైగా చందాదారుల ఖాతాలలో జమ చేస్తారు. అనేక స్థిర ఆదాయ సాధనాలతో పోలిస్తే ఈపీఎఫ్ సాపేక్షంగా అధిక, స్థిరమైన రాబడిని అందిస్తుంది. పదవీ విరమణ అనంతర పొదుపుపై స్థిరమైన వృద్ధిని నిర్ధారిస్తుంది.

2022-23లో 8.15 శాతం

2022-23 లో ఈపీఎఫ్ పై వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. దీనిని 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతానికి పెంచారు. అంతకుముందు, 2020-21 లో 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2021-22 సంవత్సరానికి గానూ 8.1 శాతానికి తగ్గించారు. ఇది గత నాలుగు దశాబ్దాలలో అత్యంత కనిష్టం. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం, అంటే 1977-78 లో ఈపీఎఫ్ వడ్డీ రేటు 8 శాతంగా ఉంది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం