Tomato grand challenge hackathon: టమాటాల ధరను తగ్గించే ఐడియాలివ్వండి.. ప్రైజ్ గెల్చుకోండి: కేంద్రం ప్రకటన
టమాటాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితుల్లో.. కేంద్ర ప్రభుత్వం వినూత్న ప్రకటన చేసింది. టమాటాల ధరలను తగ్గించేందుకు, అదే సమయంలో రైతులకు గిట్టుబాటు ధర లభించడానికి వీలుగా ఐడియాలు ఇవ్వాలని ఒక హ్యాకథాన్ ను ప్రకటించింది.
దేశవ్యాప్తంగా టమాటాల ధరలు మండిపోతున్నాయి. కేజీ టమాట రూ. 100 దాటేసింది. సామాన్యులు టమాటా ను కొనుక్కోలేని స్థాయికి వాటి ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. టమాటాల ధరలను తగ్గించేందుకు, అదే సమయంలో రైతులకు గిట్టుబాటు ధర లభించడానికి వీలుగా ఐడియాలు ఇవ్వాలని ఒక పోటీని ప్రకటించింది. టొమాటో గ్రాండ్ చాలెంజ్ హ్యాకథాన్ (Tomato Grand Challenge hackathon) పేరుతో ఈ పోటీని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఆసక్తి ఉన్నవారు ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ https://doca.gov.in/gtc/index.php ద్వారా తమ ఎంట్రీలను పంపించవచ్చు.
సృజనాత్మక ఐడియాలు ఇవ్వండి
పండించిన రైతు వద్ద నుంచి వినియోగదారుడికి చేరే క్రమంలోని వివిధ స్థాయిల్లో.. టమాటాల ధరలు తగ్గుముఖం పట్టేలా, అదే సమయంలో రైతు నష్టపోకుండా ఉండేలా, వినూత్నమైన, సృజనాత్మక ఐడియాలు ఇవ్వాలని ఈ ప్రకటనలో కేంద్రం కోరింది. కేంద్ర ప్రభుత్వంలోని వినియోగదారుల వ్యవహారాల విభాగం, విద్యా శాఖలోని ఇన్నోవేషన్ సెల్ సంయుక్తంగా ఈ హ్యాకథాన్ ను నిర్వహిస్తున్నాయి. పంట సాగు ఖర్చు తగ్గించే మార్గాలు, ట్రాన్స్ పోర్టేషన్ సమస్యలకు పరిష్కారాలు, ఎక్కువ రోజులు తాజాగా ఉండే ప్రణాళికలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఐడియాలు.. రైతులు, వినియోగదారులకు మధ్య నేరుగా అనుసంధానానికి వీలు కల్పించే ప్లాన్స్.. వంటి ఐడియాలను ఈ పోటీకి పంపించవచ్చు.
ఆచరణయోగ్యంగా ఉండాలి..
టొమాటో గ్రాండ్ చాలెంజ్ హ్యాకథాన్ (Tomato Grand Challenge hackathon) కు మీరు పంపించే ఐడియా సమగ్రంగా, ఆచరణయోగ్యంగా ఉండాలి. ఈ పోటీకి విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్ట్ అప్ లను ప్రారంభించే ఆలోచన ఉన్నవారు.. తమ ఐడియాలను పంపించవచ్చు. గడువులోని వచ్చిన అన్ని ఎంట్రీలను నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది. ఆసక్తి ఉన్నవారు ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ https://doca.gov.in/gtc/index.php ద్వారా తమ ఎంట్రీలను పంపించవచ్చు.
చుక్కలనంటుతున్న టమాటా ధరలు
టమాటా ధరలు చుక్కలనంటుతున్నాయి. కేజీ టమాట ధర రూ. 100 దాటేసింది. సకాలానికి వర్షాలు పడకపోవడం, కొన్ని చోట్లు అధిక వర్షపాతం, హీట్ వేవ్స్ వంటి వాటి వల్ల టమాటాల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దాంతో పాటు సప్లై చైన్ లో లోపాలు వంటివాటి వల్ల టమాట ధరలు విపరీతంగా పెరిగాయి. దిగుబడి పెరగడం వల్ల రెండు వారాల తరువాత టమాట ధరలు తగ్గుముఖం పడ్తాయని అధికారులు చెబుతున్నారు.