కొన్నిసార్లు రద్దీగా ఉండే సమయంలోనూ ఓలా, ఉబర్‌వంటి సంస్థల క్యాబ్ రేట్లు తక్కువగానే ఉండటం చూసి ఉంటాం. మరికొన్ని సార్లు ఎక్కువగా కూడా కనిపిస్తాయి. ఇప్పుడు అలాంటి సమయం గురించి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. రద్దీగా ఉండే సమయంలో రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. మోటర్ వెహికల్ అగ్రిగ్రేటర్ గైడ్‌లైన్స్‌ను కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది.
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన మోటార్ వెహికల్స్ అగ్రిగేటర్ మార్గదర్శకాల ప్రకారం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో క్యాబ్ అగ్రిగేటర్లు ఇప్పుడు బేస్ ఫేర్‌లో సగం సర్‌ఛార్జీ కింద పెంచుకునే అవకాశం కల్పించింది. రద్దీ విపరీతంగా ఉంటే 200 శాతం పెంచుకునే అవకాశం ఉంది. అంతుముందు ఇది 150 శాతం. అయితే మూడు కిలో మీటర్ల లోపు ప్రయాణానికి ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకూడదు. రాబోయే మూడు నెలల్లో కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం.
మరోవైపు యాప్‌లో ప్రయాణాన్ని అంగీకరించిన తర్వాత డ్రైవర్ బుకింగ్‌ను రద్దు చేస్తే.., నిర్దిష్ట కారణం లేకుండా రైడ్ రద్దు అయితే.. ఛార్జీలో 10 శాతం జరిమానా రూ. 100 పరిమితితో విధిస్తారు. ఈ ఫైన్‌ను డ్రైవర్, యాప్ సంస్థ(ఓలా, ఉబర్, ర్యాపిడో లాంటివి) కలిపి సమానంగా చెల్లించాలి. అదేవిధంగా యాప్‌లో ప్రయాణికుడు బుకింగ్‌ను రద్దు చేసినప్పుడు ఇలాంటి రుసుము వసూలు అవుతుంది.
డ్రైవర్లకు కనీసం రూ. 5 లక్షలు మరియు రూ. 10 లక్షల ఆరోగ్య బీమా ఉండేలా అగ్రిగేటర్లు చూసుకోవాలి. కొత్త మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో-రిక్షాలు, బైక్ టాక్సీలు సహా వివిధ వర్గాల వాహనాలకు బేస్ ఫేర్‌ను నోటిఫై చేస్తాయి. వీటిని పాలసీ పరిధిలోకి తీసుకువచ్చారు.
యాప్ సంస్థలు వార్షిక రిఫ్రెషర్ శిక్షణను కూడా నిర్వహించాలి. అది ఎలా అంటే.. డ్రైవర్లకు ఐదు శాతం కంటే తక్కువ రేటింగ్ ఉంటే డ్రైవర్లు ప్రతి త్రైమాసికంలో తప్పనిసరిగా రిఫ్రెషర్ శిక్షణ పొందాలని మార్గదర్శకాలు పేర్కొన్నాయి. డ్రైవర్లు అలా చేయడంలో విఫలమైతే.. అగ్రిగేటర్ ద్వారా కొనసాగడానికి అనుమతి ఉండదు.