సెర్చ్ దిగ్గజం 'గూగుల్' నేడు (సెప్టెంబర్ 27తో) 27వ పుట్టినరోజును జరుపుకుంటోంది! ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. అమెరికా మెన్లో పార్క్‌లోని ఒక చిన్న గ్యారేజీలో పురుడు పోసుకున్న ఒక ఆలోచన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు ఉపయోగించే అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ఇంజిన్‌గా మారింది.
ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న దాదాపు ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ గూగుల్‌ను ఉపయోగిస్తారు. నిజానికి, మీరు ఈ ఆర్టికల్‌ను గూగుల్ ద్వారానే చదవగలుగుతున్నారు! అయితే, 'గూగుల్' అంటే నిజంగా అర్థం ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
గూగుల్ అనేది గణితంలో ఉపయోగించే పదం 'గూగోల్' (Googol) పై చేసిన ఒక తెలివైన పద ప్రయోగం. 'గూగోల్' అంటే 1 తర్వాత వంద సున్నాలు ఉన్న సంఖ్యను లేదా 10 పవర్ 100ను సూచించే గణిత పదం.
ఈ 'గూగోల్' పదాన్ని గణిత శాస్త్రజ్ఞుడు ఎడ్వర్డ్ కాస్నర్ మేనల్లుడు మిల్టన్ సిరోట్టా సృష్టించారు.
అందువల్ల, గూగుల్ పేరు ద్వారా తమ సెర్చ్ ఇంజిన్ అపారమైన సమాచారాన్ని చూపించాలనే సెర్గీ బ్రిన్, లారీ పేజ్ ఆశయాన్ని ప్రతిబింబించడానికి ఉద్దేశించారు.
ఈ సెర్చ్ ఇంజిన్ పేరు మొదట్లో గూగుల్ కాదు! స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ విద్యార్థులైన సెర్గీ బ్రిన్, లారీ పేజ్ సెర్చ్ ఇంజిన్ సామర్థ్యాన్ని గుర్తించి, దానిని ప్రారంభించాలనే ఆలోచన చేసినప్పుడు, వారి మనసులో అసలు గూగుల్ అనే పేరే లేదు!
గూగుల్‌కు మొదట్లో 'బ్యాక్‌రబ్' (BackRub) అని పేరు పెట్టారు.
అయితే 1997లో, ఒకరోజు లారీ పేజ్ సహోద్యోగి, ఆ గణిత పదం 'గూగోల్'ను తప్పుగా 'గూగుల్' (Google) అని ఉచ్చరించారు. అది అందరికి నచ్చింది. పైగా ఆ పేరుతో డొమైన్ అందుబాటులో ఉందని తెలుసుకున్నారు. ఇంకేముంది, కొన్ని గంటల్లోనే google.com వెబ్‌సైట్‌గా రిజిస్టర్ అయ్యింది.
అంటే, గూగుల్ అనేది ఒక గణిత పదాన్ని తప్పుగా పలకడం ద్వారా వచ్చిన పేరు! ఈ పేరు సంవత్సరాలుగా పెను మార్పులను (సునామీలను) సృష్టిస్తూ వస్తోంది.
గూగుల్‌ను 1998లో స్టాన్‌ఫోర్డ్ పీహెచ్‌డీ విద్యార్థులు సెర్గీ బ్రిన్, లారీ పేజ్ ప్రారంభించారు. కంపెనీ సెప్టెంబర్ 4, 1998న ప్రారంభమైంది.
అయితే గూగుల్ తమ అంతర్గత మైలురాళ్లను గుర్తు చేసుకుంటూ సెప్టెంబర్ 27న తమ పుట్టినరోజును జరుపుకుంటుంది.
గ్యారేజీ నుంచి సెర్చ్ ఇంజిన్‌గా ప్రారంభమైన సంస్థ, ఇప్పుడు 2015లో స్థాపించిన హోల్డింగ్ కంపెనీ ఆల్ఫాబెట్ ఇంక్. పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థగా మారింది.
ప్రస్తుతం సుందర్ పిచాయ్ గూగుల్, ఆల్ఫాబెట్‌లకు సీఈఓగా ఉన్నారు.