Google Photos: ఏఐ ఎడిటెడ్ ఇమేజెస్ పై వాటర్ మార్క్ ను యాడ్ చేస్తున్న గూగుల్ ఫొటోస్; ఎందుకంటే..?
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇప్పుడు అన్ని రంగాల్లోకి వ్యాప్తి చెందింది. ఏఐ ద్వారా మార్చిన కంటెంట్ ఏదో? ఒరిజినల్ కంటెంట్ ఏదో? గుర్తించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఏఐ ద్వారా మార్చిన కంటెంట్ ను గుర్తించడం కోసం ఏఐ ఫొటోలపై ఒక కనిపించని వాటర్ మార్క్ ను జోడించాలని గూగుల్ ఫొటోస్ నిర్ణయించింది.

Google Photos: గూగుల్ తన సింథ్ ఐడి టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా గూగుల్ ఫోటోస్ లో ఏఐ డిటెక్షన్ సామర్థ్యాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ వారం నుండి, మ్యాజిక్ ఎడిటర్ లోని రీమాజిన్ ఫీచర్ ఉపయోగించి ఎడిట్ చేసిన ఫొటోల్లో కంటికి కనిపించని వాటర్ మార్క్ ఉంటుంది. ఇది ఏఐ తో మార్చిన ఫొటోలను గుర్తించడంలో సహాయపడుతుంది.
ఏఐ టూల్స్..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇమేజ్ ఎడిటింగ్ టూల్స్ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ఒరిజినల్ ఫోటోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మార్చిన ఫోటోల మధ్య తేడాను గుర్తించడం మరింత సవాలుగా మారింది. అందువల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మార్చిన ఫొటోలను సులభంగా గుర్తించడానికి వీలుగా గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.
సింథ్ ఐడి అంటే ఏమిటి?
సింథ్ ఐడి అనేది గూగుల్ డీప్ మైండ్ చే అభివృద్ధి చేయబడిన వాటర్ మార్కింగ్ సాధనం. ఇది దాని నాణ్యతను మార్చకుండా చిత్రాలు, వీడియో, ఆడియో, టెక్స్ట్ వంటి AI-జనరేటెడ్ కంటెంట్ లో కంటికి కనిపించని మార్కర్ ను పొందుపరుస్తుంది. ఏఐ ఇమేజెస్ లో రీసైజింగ్, క్రాపింగ్ లేదా కంప్రెషన్ వంటి సాధారణ ఇమేజ్ మార్పుల తర్వాత కూడా వాటర్ మార్క్ ను గుర్తించవచ్చు.
గూగుల్ ఫోటోస్ లో అమలు
గూగుల్ మొదట్లో సింథ్ ఐడిని తన ఏఐ ఆధారిత టెక్స్ట్-టు-ఇమేజ్ మోడల్స్ ఇమేజెన్ 2, ఇమేజెన్ 3 లలో ఇంటిగ్రేట్ చేసింది. ఆ తర్వాత ఏఐ జనరేటెడ్ ఇమేజ్ ల కోసం ఇమేజ్ఎఫ్ఎక్స్ కు, వీడియో జనరేషన్ కోసం వీవోకు ఈ టెక్నాలజీని విస్తరించింది. ఇప్పుడు, గూగుల్ ఫొటోస్ లోని మ్యాజిక్ ఎడిటర్ రీమేజిన్ ఫీచర్ తో ఎడిట్ చేసిన చిత్రాలకు కూడా విస్తరించింది. గూగుల్ సెర్చ్, క్రోమ్ లో అందుబాటులో ఉన్న "ఎబౌట్ దిస్ ఇమేజ్" టూల్ ఉపయోగించి ఒక ఇమేజ్ లో ఏఐ జనరేటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో యూజర్లు ధృవీకరించవచ్చు. ఈ ఫీచర్ ఆ ఇమేజ్ వెబ్ ఉనికి, మెటాడేటా, సింథ్ ఐడి డిటెక్షన్ స్థితిపై వివరాలను అందిస్తుంది.
వాటర్ మార్క్ పరిమితులు
సింథ్ ఐడీ ఏఐ పారదర్శకతను పెంచుతుంది. అయితే ఇది ఏఐ ద్వారా జరిగిన అన్ని మార్పులను గుర్తించలేదు. ఉదాహరణకు, ఒక చిన్న వస్తువు రంగును మార్చడం వంటి చిన్న, చిన్న మార్పులను గుర్తించలేదు. అయినప్పటికీ, ఒరిజినల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఎడిటెడ్ కంటెంట్ మధ్య వ్యత్యాసాన్ని గుర్తించే ప్రయత్నాలను ఈ సాంకేతికత బలోపేతం చేస్తుంది.