Google Digi Kavach: ఈ మధ్యకాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. ఆన్లైన్ పేమెంట్స్ కే అంతా ప్రాధాన్యత ఇస్తున్నారు. డబ్బు క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా పేమెంట్స్ జరుగుతున్నాయి. అదే సమయంలో ఆన్లైన్ మోసాలు కూడా విపరీతంగా పెరిగాయి. వివిధ వినూత్న, సృజనాత్మక పద్ధతుల్లో స్కామర్స్ మోసాలు చేసి ప్రజల నుంచి డబ్బులు లాగేస్తున్నారు.
ఆన్లైన్ మోసాల నుంచి భారతీయులను కాపాడే ఉద్దేశంతో ‘డిజి కవచ్ (Digi Kavach)’ పేరుతో గూగుల్ ఒక ప్రోడక్ట్ ను రూపొందించింది. ‘‘గూగుల్ ఫర్ ఇండియా 2023’’ కార్యక్రమంలో గూగుల్ (Google) ఈ విషయాన్ని ప్రకటించింది. ‘గూగుల్ ఫర్ ఇండియా 2023’ కార్యక్రమం గురువారం న్యూఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో గూగుల్ సంస్థకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ తమ లేటెస్ట్ ప్రొడక్ట్స్ ని, వాటి ఉపయోగాలను వివరించారు. అందులో ప్రధానంగాఈ డిజి కవచ్ గురించి తెలిపారు. ఆన్లైన్ మోసాల నుంచి డిజి కవచ్ భారతీయ యూజర్స్ ను ఎలా కాపాడుతుందో వారు వివరించారు. ప్రస్తుతానికి భారత్ లో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. త్వరలో వేరే దేశాలకు కూడా విస్తరిస్తామని గూగుల్ ప్రతినిధులు చెప్పారు.
దాదాపు 100 కోట్లకు పైగా ఉన్న భారతీయులు ఆన్లైన్ మోసాల బారిన పడకుండా కాపాడాలన్న ఉద్దేశంతో ‘డిజి కవచ్’ ను రూపొందించామని గూగుల్ హెడ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ వైస్ ప్రెసిడెంట్ సైకత్ మిత్రా తెలిపారు. సామాన్యులు కూడా సులువుగా ఉపయోగించేలా ఈ టూల్ ని రూపొందించామని తెలిపారు. కృత్రిమ మేథ, మిషన్ లెర్నింగ్ సహాయంతో డిజి కవచ్ పనిచేస్తుందని వివరించారు. స్కామర్స్ లేదా ఆన్లైన్ మోసగాళ్లు ఎలా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారనే విషయంపై సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత డిజి కవచ్ ను రూపొందించామని తెలిపారు.
ఆన్లైన్ మోసగాళ్లు ఎలా ఆలోచిస్తారో, ఏ విధంగా మోసం చేస్తారో, భవిష్యత్తులో ఏ తరహా మోసాలకు పాల్పడే అవకాశం ఉందో ముందుగా అధ్యయనం చేశామని గూగుల్ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతానికి ఈ డిజి కవచ్ ను ప్రధానంగా ఆర్థికపరమైన మోసాల నుంచి తప్పించే లక్ష్యంతో రూపొందించారు. ఆర్.బి.ఐ (RBI) తో, ఎన్పీసీఐ (NPCI) తో చర్చలు జరుగుతున్నాయని, వారి భాగస్వామ్యంతో డిజి కవచ్ ను అమలు చేస్తామని గూగుల్ ప్రతినిధులు తెలిపారు. ఈ టూల్ ను ప్రయోగాత్మకంగా వాడి సాధించిన విజయాలను కూడా వారు వివరించారు. గూగుల్ పే (Google Pay)- యాప్ పై ఈ డిజి కవచ్ ను ఉపయోగించడం ద్వారా దాదాపు 12 వేల కోట్ల రూపాయలను స్కామర్స్ బారిన పడకుండా కాపాడమన్నారు. అయితే, ఈ డిజి కవచ్ ను ఎప్పుడు లాంచ్ చేస్తారో గూగుల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.