Investments : 2025లో పెట్టుబడులు పెట్టడానికి ఏ రంగాలు బెటర్? వీటిపై ఓ కన్నేసి ఉంచండి!
Investment Tips : కొత్త ఏడాది నుంచి ఏమైనా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే ఎలాంటి రంగాల్లో పెడితే రాబడులు ఉంటాయో పరిశీలించాలి. అప్పుడు మీ పెట్టుబడికి ఫలితం ఉంటుంది. నిపుణుల ప్రకారం 2025లో కొన్ని రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది.
ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచి రాబడులు రావాలని కోరుకుంటారు. అయితే ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నామనేది కూడా ఇక్కడ ముఖ్యం. అభివృద్ధి చెందని రంగంలో పెట్టుబడి పెడితే లాస్ తప్ప ప్రయోజనం ఉండదు. 2025లో భారత ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధిని నమోదు చేస్తుందని పలు సంస్థలు ఇప్పటికే చెప్పాయి. అనేక పరిశ్రమలు అద్భుతమైన పెట్టుబడి అవకాశాల గురించి చెప్పుకొచ్చాయి. ఇక పెట్టుబడిదారులు కూడా 2025లో ఎందులో ఇన్వెస్ట్ చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఇన్వెస్టర్లకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం గ్రీన్ ఎనర్జీ, రియల్ ఎస్టేట్, ఎలక్ట్రిక్ వాహనాలు, టెక్నాలజీ వంటి అధిక రంగాల ద్వారా రాబడిని ఆశించవచ్చు.
రియల్ ఎస్టేట్
రాబోయే రోజుల్లో భారతదేశంలో పట్టణ విస్తరణ కూడా వేగంగా విస్తరిస్తోంది. దీని ఫలితంగా రియల్ ఎస్టేట్ పరిశ్రమ వేగంగా పెరుగుతుంది. ఉదాహరణకు హైదరాబాద్ లాంటి నగర శివారులను చూస్తే అర్థమవుతోంది. రియల్ ఎస్టేట్ వేగంగా వృద్ధి చెందుతోంది. నగరాలు రియల్ ఎస్టేట్‌లో మరింత వృద్ధిని చూస్తాయి. భూమి మీద పెట్టుబడి పెడితే లాభమే కానీ నష్టం ఉండదనే నమ్మకంతో చాలా మంది రియల్ ఎస్టేట్ వైపు చూస్తున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలు
ప్రపంచంలోని చాలా దేశాలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. భారత్‌లోనూ వీటికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతుంది. ఇంధన ఖర్చులతోపాటుగా నిర్వహణ ఎక్కువగా ఉండదు. మరోవైపు ప్రభుత్వ సబ్సిడీలు, పెరుగుతున్న డిమాండ్, బ్యాటరీ సాంకేతికతలో మెరుగుదలలు ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ వృద్ధికి దోహదం చేస్తున్నాయి. ఈ కారణంగానే ఈవీ అమ్మకాలు ప్రస్తుతం ఎక్కువగా ఉన్నాయి. ఈవీలు భవిష్యత్తులో ఎక్కువగా మార్కెట్‌లోకి వస్తాయి. ప్రస్తుతం ఈవీ రంగంలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. దీనిలో లాభాల మార్జిన్ కూడా ఎక్కువగానే ఉంటుంది.
టెక్నాలజీ
బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)లో పురోగతి కూడా పెట్టుబడిపై ఎక్కువ రాబడి కోసం కొత్త మార్గాలను చూపిస్తుంది. ముఖ్యంగా టెక్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్నందున సంబంధిత ప్రాజెక్ట్‌లలో పెట్టుబడి పెట్టడం మరింత లాభదాయకంగా ఉంటుంది.
గ్రీన్ ఎనర్జీ
భారతదేశంలోని ప్రభుత్వ నిబంధనలు పునరుత్పాదక శక్తిలో పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి. సబ్సిడీని అందిస్తాయి. భవిష్యత్తులో పవన, సౌర, జల శక్తి వంటి గ్రీన్ ఎనర్జీ బాగా ప్రాచుర్యం పొందుతోంది. భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం అక్టోబర్ 2024 నాటికి 201.45 GWకి చేరుకుంది. గ్రీన్ ఎనర్జీకి భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతుంది. ఇలాంటి రంగంలోనూ పెట్టుబడి పెట్టవచ్చని నిపుణుల అభిప్రాయం.