Gold vs Bitcoin: గోల్డ్ వర్సెస్ బిట్‌కాయిన్.. ఈ దీపావళికి కలిసొచ్చేదేంటి?-gold vs bitcoin which haven is a better investment this diwali ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold Vs Bitcoin Which Haven Is A Better Investment This Diwali

Gold vs Bitcoin: గోల్డ్ వర్సెస్ బిట్‌కాయిన్.. ఈ దీపావళికి కలిసొచ్చేదేంటి?

HT Telugu Desk HT Telugu
Oct 22, 2022 08:28 PM IST

Gold vs Bitcoin: అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల మధ్య రిస్కీ టైమ్‌లో సురక్షిత పెట్టుబడిగా బంగారానికి పేరుంది. అయితే ప్రస్తుతం ఈ కోవలో గోల్డ్ ఒక్కటేనా? ఇంకా ఏవైనా మార్గాలు ఉన్నాయా?

క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్, ఇథేరియం, డాష్
క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్, ఇథేరియం, డాష్ (REUTERS)

Gold vs Bitcoin: ధనత్రయోదశితో దీపావళి సందడి మొదలైంది. ఈరోజు గోల్డ్‌కు బాగా డిమాండ్ ఉండడం చాలా ఏళ్లుగా కనిపిస్తున్న పరిణామం. సంపదకు, భద్రతకు చిహ్నంగా ఎక్కువ మంది భావిస్తున్నందున ధన త్రయోదశి రోజు బంగారం కొనడం సెంటిమెంట్‌గా మారింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ ఒక్కటే పెట్టుబడులకు స్వర్గధామం కాదని, బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ కూడా డిజిటల్ గోల్డ్‌గా మారిందని కొందరు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతంలో బిట్‌కాయిన్‌ను గోల్డ్‌కు ప్రత్యామ్నాయ స్వర్గధామంగా భావించేవారు. మరి ఈ రెండింటిలో దీపావళికి ఏది సురక్షితమైన పెట్టబడి మార్గమో చూద్దాం.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

కుంజీ పోర్టల్‌లో పని చేసే ఇన్వెస్ట్‌మెంట్ అనలిస్ట్ పలాష్ ఉధ్వానీ ఈ రెండింటిని విశ్లేషించారు.

బిట్‌కాయిన్‌ను డిజిటల్ గోల్డ్‌గా అభివర్ణించే ఉధ్వానీ బిట్‌కాయిన్‌కు గోల్డ్‌కు సారూప్యత ఉందని చెబుతున్నారు. అంతర్జాతీయంగా లభ్యత, అధిక డిమాండ్ కలిగి ఉండడం, సప్లై తక్కువగా ఉండడం వల్ల బిట్‌కాయిన్ కూడా గోల్డ్‌తో పోల్చవచ్చని చెబుతున్నారు. బీటీసీ సరఫరాను, ఉద్గారాలను ఆల్టారిథమ్ సహాయంతో ప్రోగ్రామ్ చేసినందున వాటిని మార్చలేమని, ఇది బీటీసీ విలువ పెరగడానికి దోహదపడుతుందని విశ్లేషించారు.

దేశంలోనే తొలి క్రిప్టో అసెట్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌గా పేరున్న కుంజీ డేటా ప్రకారం గడిచిన ఐదేళ్లలో దీపావళి సీజన్‌లో బిట్‌కాయిన్ మంచి పనితీరు కనబరిచింది.

2017 అక్టోబరు 19న వచ్చిన దీపావళి సీజన్‌లో బిట్‌కాయిన్ 312.5 శాతం లాభాలను ఇచ్చింది. బంగారం 29.5 శాతం లాభాలు తెచ్చిపెట్టంది. 2018 నవంబరు 6న వచ్చిన దీపావళి బిట్‌కాయిన్ ద్వారా 196.3 శాతం లాభాలను తెచ్చిపెట్టగా, బంగారం ద్వారా 36.1 శాతం లాభాలు వచ్చాయి. 2019 అక్టోబరు 27న వచ్చిన దీపావళి బిట్‌కాయిన్ ద్వారా 99.9 శాతం లాభాలు ఇవ్వగా, బంగారం ద్వారా 11 శాతం లాభాలను ఇచ్చింది.

2020 నవంబరు 14న దీపావళి సందర్భంగా బిట్‌కాయిన్ 18.7 శాతం లాభాలను, బంగారం 11.6 శాతం లాభాలను ఇచ్చాయి. ఇక 2021 నవంబరు 4న వచ్చిన దీపావళి సమయంలో మాత్రం బిట్‌కాయిన్ 68.9 శాతం నష్టపోగా, గోల్డ్ విలువ మాత్రం 6.7 శాాతం మాత్రమే పడిపోయింది. అంటే ఈ ఒక్క ఏడాది గోల్డ్ మంచి పనితీరు కనబరిచింది. అయితే ఐదేళ్లలో చూస్తే బిట్‌కాయిన్ మంచి లాభాలు ఇచ్చింది.

ఐదేళ్లలో సగటున గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌పై 11 శాతం లాభం రాగా బీటీసీపై 111.7 శాతం రాబడి వచ్చింది. 2017 నుంచి మొదలుకొని ఏటా దీపావళి రోజున రూ. 50 వేల చొప్పున బంగారం కొనుగోలు చేసి ఉంటే పెట్టుబడుల విలువ రూ. 2,50,000 రాబడితో కలిపి ఇప్పుడు 2,79,150గా ఉండేది. ఇదే కాలంలో అంతేమొత్తంలో బిట్‌కాయిన్‌పై పెట్టుబడి పెట్టి ఉంటే రాబడితో కలిపి మీ పెట్టుబడి రూ. 5,29,250గా ఉండేదని ఉధ్వానీ తెలిపారు.

బిట్‌కాయిన్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ.. క్రిప్టోకరెన్సీ మార్కెట్ ఇంకా ఎక్కువ అవకాశాలు కల్పిస్తోందని ఉధ్వానీ సూచించారు. బిట్‌కాయిన్‌లో కొంత పెట్టుబడి పెడుతూనే ఇతర ముఖ్యమైన ఆల్ట్‌కాయిన్స్‌లో కొంత మొత్తం పెట్టుబడి పెడితే లాభాలు ఆర్జించే అవకాశం ఉందని విశ్లేషించారు.

గత ఐదు దీపావళి సీజన్లలో రూ. 50 వేల చొప్పున ఆల్ట్‌కాయిన్లు, బిట్‌కాయిన్ కాంబినేషన్‌లో పెట్టుబడి పెట్టి ఉండే 659.62 శాతం రాబడి వచ్చి ఉండేదని, అలాగే కేవలం ఆల్ట్‌కాయిన్స్‌లో మాత్రమే పెట్టుబడి పెడితే అది 1207 శాతం రాబడి ఇచ్చి ఉండేదని విశ్లేషించారు. ఆయన ఇచ్చిన గణాంకాల్లో వాడిన ఆల్ట్‌కాయిన్స్ ఈథర్, బీఎన్‌బీ, ఎల్టీసీ, ఎక్స్‌ఆర్పీ, ఏడీఏ, లింక్ ఉన్నాయి.

దశాబ్దకాలంగా మార్కెట్ చరిత్ర కలిగిన బిట్‌కాయిన్.. ఇతర అనేక వికేంద్రీకరణ ప్రాజెక్టులు, ప్రోటోకాల్స్‌కు స్ఫూర్తినిచ్చింది. ఇవి తగిన వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టి, రిస్క్ మేనేజ్‌మెంట్ అనుసరిస్తే మంచి లాభాలు ఇస్తాయని విశ్లేషించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ గరిష్ట స్థాయిని సాధించే వరకు బంగారం, వెండి, ప్లాటినం వంటి ఇతర సెమీ-ఇన్వెస్ట్‌మెంట్ లోహాలపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని అన్నారు. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ పెట్టుబడిదారులు రిస్క్ తక్కువగా ఉండి పటిష్టంగా ఉన్న డాలర్‌ వైపే మొగ్గు చూపుతూ క్రిప్టో, బంగారం నుంచి దూరంగా ఉన్నారు. గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం పెరగడంతో బిట్‌కాయిన్ విలువ భారీగా తగ్గింది. ఒక దశలో 18 వేల డాలర్లకు పడిపోయింది. డాలర్ బలంగా ఉండడం, బాండ్ రాబడులు పెరగడం వల్ల పెట్టుబడిదారులు క్రిప్టో, బంగారం వైపు అంతగా చూడడం లేదని చెప్పారు. శనివారం బిట్‌కాయిన్ విలువ 19,200 డాలర్లుగా ఉండగా, 10 గ్రాముల బంగారం (24 కారెట్లు) ధర రూ. 51,280గా ఉంది.

(నోట్: ఇది పెట్టుబడి సలహా కాదు. నిపుణుల విశ్లేషణ మాత్రమే.)

WhatsApp channel