బంగారం ధరలు ఈ ఏడాది ఇప్పటికేే విపరీతంగా పెరిగాయి. దేశీయ స్పాట్ గోల్డ్ ధరలు ఈ ఏడాది ఇప్పటివరకు 23 శాతం వృద్ధిచెందాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే పసిడి ధర 5 శాతం పెరిగింది. ఎంసీఎక్స్ గోల్డ్ జూన్ 5 కాంట్రాక్టు గత శుక్రవారం (ఏప్రిల్ 11) 10 గ్రాములకు రూ .93,940 వద్ద ఆల్- టైమ్ గరిష్టాన్ని తాకింది. చివరకు 10 గ్రాములకు 0.15 శాతం పెరిగి రూ.93,887 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ పసిడి ధరలు కూడా బలమైన లాభాలను చూశాయి. కామెక్స్ గోల్డ్ 2.44 శాతం పెరిగి 3,254.90 డాలర్ల వద్ద ముగిసింది. మరి నెక్ట్స్ ఏంటి? గోల్డ్ ప్రైజ్ పడుతుందా? లేక పెరుగుతుందాయ నిపుణులు ఏమంటున్నారంటే..
బంగారం ధరలు ఈ ఏడాది ఇంతలా పెరగడానికి బలమైన కారణాలు ఉన్నాయనే చెప్పుకోవాలి. వాటిల్లో అతిపెద్దది వాణిజ్య యుద్ధంపై ఆందోళనలు! ట్రేడ్ వార్ భయాలు బంగారం ధరలకు ఊతమిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న టారీఫ్ ప్రకటనలతో అనిశ్చితి పెరిగిపోయింది. చైనాపై సుంకాలను 145 శాతానికి పెంచారు. చైనా కూడా ప్రతీకారం తీర్చుకుని అమెరికా వస్తువులపై సుంకాలను 84 శాతం నుంచి 125 శాతానికి పెంచింది.
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వృద్ధి చుట్టూ అనిశ్చితిని పెంచాయి. ఫలితంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. సాంప్రదాయక సురక్షిత అసెట్‌గా పేరు తెచ్చుకోవడంతో బంగారం ధరలు ఈ పరిస్థితుల్లో పెరుగుతున్నాయి.
ట్రంప్ టారిఫ్ చర్యలు ఈ ఏడాది అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోతుందనే ఆందోళనలను రేకెత్తించాయి. సంభావ్య మందగమనం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడానికి ప్రేరేపించవచ్చు. ఇది సాధారణంగా బంగారం ధరలకు మద్దతు ఇస్తుంది.
డాలర్ ఇండెక్స్ క్షీణించడం కూడా బంగారం ధరలు పెరగడానికి మరో కీలక అంశం. యూఎస్ డాలర్ ఇండెక్స్ శుక్రవారం 100 దిగువకు పడిపోయి 99.78 వద్ద ముగిసింది.
అంతర్జాతీయంగా బంగారం ధరను డాలరులో చూస్తుండటంతో, ఆ దేశ కరెన్సీ బలహీనపడతున్నప్పుడు ఇతర కరెన్సీలలో బులియన్ చౌకగా మారుతుంది. డిమాండ్ పెరుగుతుంది.
వాణిజ్య యుద్ధం, డాలర్ క్షీణత, రేట్ల కోత అంచనాల కారణంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
"వాణిజ్య యుద్ధ సంబంధిత అనిశ్చితులు, పెరుగుతున్న మాంద్యం భయాలతో బంగారం ధరల ర్యాలీ కొనసాగవచ్చు. బలహీనమైన యూఎస్ డాలర్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతకు అవకాశం ఉండటంతో పసిడి పరుగుకు మరింత ఊతమిచ్చే అవకాశం ఉంది. 2025 చివరి నాటికి అంతర్జాతీయ బంగారం ధర ట్రాయ్ ఔన్స్‌కి 3,300-3,500 డాలర్లకు, దేశీయ బంగారం 10 గ్రాములకు రూ .97,000 కు చేరుకుంటుందని మేము ఆశిస్తున్నాము," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ అండ్ కరెన్సీ ప్రాడక్ట్స్ హెడ్ అనూజ్ గుప్తా అన్నారు.
ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది మాట్లాడుతూ.. “కొనుగోలుదారులకు అనుకూలంగా ఉన్న పరిస్థితులతో, బంగారం ఇప్పుడు రూ .94,500–రూ .95,000 వద్ద రెసిస్టెన్స్ జోన్‌ని టార్గెట్ చేసింది. రూ .92,000 ముఖ్యమైన సపోర్ట్ ఉంది,” అని పేర్కొన్నారు.
సంబంధిత కథనం