EV survey: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న ఆదరణ; ఈ సర్వేనే నిదర్శనం
EV survey: ఎలక్ట్రిక్ వాహనాలపై చాలా మందికి ఇంకా అనుమానాలున్నాయి. వాటి పని తీరు, లాంగ్ డ్రైవ్ ల్లో వాటి విశ్వసనీయతలపై భయాందోళనలు ఉన్నాయి. అయితే, వారి అనుమానాలను పటాపంచలు చేసే విషయాలను ఈ సర్వే వెలుగులోకి తెచ్చింది. 18 దేశాల్లోని 23,000 మందికి పైగా ఈవీ యజమానులు ఈ సర్వేలో పాల్గొన్నారు.
EV survey: ఒకవైపు, ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ పెరుగుతున్నప్పటికీ, మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాలపై ఇంకా చాలా మంది పూర్తి స్థాయిలో విశ్వసించలేకపోతున్నారు. ఎలక్ట్రిరక్ కార్ల పని తీరు, లాంగ్ డ్రైవ్ ల్లో వాటి విశ్వసనీయతలపై కస్టమర్లకు ఇంకా అనుమానాలున్నాయి. అయితే, ఈ అనుమానాలు, భయాందోళనలను పటాపంచలు చేసేలా పలు అంశాలను ఒక సర్వే వెల్లడించింది.
పెరుగుతున్న ప్రజాదరణ
ఎలక్ట్రిక్ వాహనాల (EV) పెరుగుదల, వ్యాప్తి ఇప్పుడు అనివార్యమయింది. ఈవీ మోడళ్లకు ప్రజాదరణ కూడా పెరుగుతోంది. చాలా మంది ఈవీ యజమానులు పెట్రోలు, లేదా డీజిల్ ఇంజిన్ తో నడిచే సాంప్రదాయ వాహనాలకు తిరిగి వెళ్లడానికి ఇష్టపడడం లేదని ఒక సర్వేలో తేలింది. భారత్ సహా 18 దేశాల్లోని 23,000 మంది ఈవీ (electric cars in india) యజమానులపై నిర్వహించిన సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి.
97 శాతం మంది హ్యాపీ
ఈ సర్వేలో 97 శాతం మంది తమ ఎలక్ట్రిక్ వాహనాలతో (electric cars) చాలా సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. ఈ సర్వేను గ్లోబల్ ఈవీ డ్రైవర్ సర్వే 2024 పేరుతో 64 జాతీయ ఎలక్ట్రిక్ వెహికల్ డ్రైవర్ అసోసియేషన్ ల నెట్ వర్క్ నిర్వహించింది. ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలను రీప్లేస్ చేస్తారా అన్న ప్రశ్నకు 92 శాతం మంది మరో ఈవీతో రీప్లేస్ చేస్తామని చెప్పారు. నాలుగు శాతం మంది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ కు వెళ్తామన్నారు. కేవలం ఒక శాతం మంది మాత్రమే తమ తదుపరి కారు పెట్రోల్ లేదా డీజిల్ తో నడిచే మోడల్ అని చెప్పారు.
ఈవీని ఎందుకు కొనాలి?
ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం ఈవీని కొనుగోలు చేయడానికి అతి పెద్ద కారణమని ఎక్కువ మంది చెప్పగా, ఇలాంటి వాహనాలు పర్యావరణానికి మంచివని కూడా చాలా మంది హైలైట్ చేశారు. కొత్త టెక్నాలజీపై ఆసక్తి, ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలు మొదలైనవి కూడా ఈవీ కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నాయని ఈ సర్వేలో తేలింది.
మీ ఈవీని ఎక్కడ ఛార్జ్ చేస్తారు?
మీ ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కడ చార్జ్ చేస్తారనే ప్రశ్నకు సర్వేలో పాల్గొన్న వారిలో 72 శాతం మంది తమ ఇంట్లోని ఛార్జింగ్ పాయింట్లను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. మరో 13 శాతం మంది ఫాస్ట్ ఛార్జర్లను ఉపయోగిస్తున్నామని, ఏడు శాతం మంది ఛార్జింగ్ ఆప్షన్స్ ఉన్న పబ్లిక్ పార్కింగ్ స్థలాలను ఉపయోగిస్తున్నామని చెప్పారు. మరో ఏడు శాతం మంది తమ ఆఫీస్ ల వద్ద ఉన్న ఛార్జింగ్ పాయింట్లను ఉపయోగిస్తున్నామని చెప్పారు.
ఈవితో సమస్యలు ఏమిటి?
ఈవీని సొంతం చేసుకోవడం, నడపడం వంటి రియల్ టైమ్ సవాళ్లపై కూడా ఈ సర్వే దృష్టి సారించింది. చాలా మంది ఈవీ తో ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. కొందరు ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లు ఎక్కువగా లేవన్నారు. మరి కొందరు ఛార్జింగ్ సమయం ఎక్కువగా ఉంటోందని ఫిర్యాదు చేశారు. సింగిల్ ఛార్జ్ తో వాహనం వెళ్లే దూరం తక్కువగా ఉంటోందని మరికొందరు చెప్పారు. ఛార్జింగ్ సమస్యలను పలువురు ఉదహరించారు.
భారత్ లోనే ఎక్కువ
మొత్తం 18 దేశాల్లో ఈ సర్వే నిర్వహించగా, రేంజ్ సమస్యలను భారత్ లోని వినియోగదారులే ఎక్కువగా లేవనెత్తారు. ఆ తరువాత స్థానాల్లో బ్రెజిల్, కోస్టారికా, పోర్చుగల్ నిలిచాయి. జర్మనీ, స్విట్జర్లాండ్ లలో ఉన్నవారు పరిధి గురించి అసలు పట్టించుకోలేదు. ఆస్ట్రియా, బ్రెజిల్, కెనడా, కోస్టారికా, ఫ్రాన్స్, జర్మనీ, హంగేరీ, ఇండియా, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, స్లోవేనియా, స్వీడన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ లోని ఈవీ యజమానులపై ఈ సర్వే నిర్వహించారు.