Adani Group Stocks : హిండెన్‌బర్గ్ రీసెర్చ్ దుకాణం బంద్.. అదానీ షేర్లలో భారీగా పెరుగుదల!
Adani Group Stocks : స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌లు వరుసగా మూడో రోజు గురువారం కూడా ఊపందుకున్నాయి. అయితే గౌతమ్ అదానీ కంపెనీల షేర్లు ప్రారంభమైన వెంటనే వేగంగా దూసుకెళ్లాయి. దీనికి కారణం అమెరికన్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్క్ మూసివేత ప్రకటన.
గురువారం భారత స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ వేగంగా ప్రారంభమైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభం కాగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ మెుదలుపెట్టింది. మరోవైపు అమెరికా నుంచి వచ్చిన వార్త ప్రభావం గౌతమ్ అదానీకి కలిసి వచ్చింది. అదానీ కంపెనీల షేర్లపై కనిపిస్తోంది. అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో అదానీ స్టాక్స్ రాకెట్‌లో దూసుకుపోతున్నాయి.
ప్రారంభంలోనే పైపైకి
స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన అదానీ గ్రూప్‌నకు చెందిన 9 కంపెనీల షేర్లు గురువారం భారీ వృద్ధితో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు ప్రారంభమైన నిమిషాల్లోనే 4.35 శాతం పెరిగి రూ.2,492.15కి చేరుకున్నాయి. ఇది కాకుండా ఇతర షేర్లు కూడా మంచి వేగంతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ట్రెడింగ్ ప్రారంభంలో పెరుగుదల చూసుకుంటే..
షేర్లు పెరుగుదల
అదానీ పవర్ షేర్ 5.37 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు 5.59 శాతం, అదానీ పోర్ట్స్ 3.45 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 2.59 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 4.04 శాతం, అంబుజా సిమెంట్స్ 4.31 శాతం, ఏసీసీ లిమిటెడ్ 3.64 శాతం, NDTV షేర్ 4.56 శాతం వరకు పెరిగింది.
హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్
గౌతమ్ అదానీ షేర్లు పెరుగుదల వెనక హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ మూసివేత కారణంగా కనిపిస్తోంది. అమెరికాకు చెందిన ఈ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ గతంలో అదానీ కంపెనీని కుదిపేసింది. 2023 సంవత్సరం ప్రారంభంలో హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్‌పై ఒక పరిశోధన నివేదికను ప్రచురించింది. ఆ తర్వాత గౌతమ్ అదానీ భారీ నష్టాలను చూడాల్సి వచ్చింది. దాని నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. స్టాక్ మార్కెట్‌లో అదానీ సంస్థ చాలా నష్టాన్ని ఎదుర్కొంది. 2024లోనూ హిండెన్‌బర్గ్ మరోసారి అదానీ గ్రూప్‌ను టార్గెట్ చేస్తూ నివేదిక విడుదల చేసింది. దాని ప్రభావం ఎక్కువగా లేదు.
హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ తన కంపెనీని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత వెంటనే అదానీ షేర్లలో పెరుగుదల కనిపించింది.
గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. కేవలం సమాచారం మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది. పైన చెప్పిన షేర్ల పెరుగుదలలో వెంటవెంటనే మార్పులు ఉండవచ్చు.