Gujarat Titans : ఐపీఎల్​లోకి అదానీ ఎంట్రీ! గుజరాత్​ టైటాన్స్​లో భారీ ధరకు వాటా కొనుగోలు?-gautam adani and torrent to buy stake in gujarat titans ipl team ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gujarat Titans : ఐపీఎల్​లోకి అదానీ ఎంట్రీ! గుజరాత్​ టైటాన్స్​లో భారీ ధరకు వాటా కొనుగోలు?

Gujarat Titans : ఐపీఎల్​లోకి అదానీ ఎంట్రీ! గుజరాత్​ టైటాన్స్​లో భారీ ధరకు వాటా కొనుగోలు?

Sharath Chitturi HT Telugu
Published Jul 19, 2024 01:07 PM IST

Gujarat Titans Adani : ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్​లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి అదానీ గ్రూప్, టొరెంట్ గ్రూప్ సీవీసీ క్యాపిటల్ పార్ట్​నర్స్​తో చర్చలు జరుపుతున్నాయి. సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ మైనారిటీ హోల్డింగ్​ను నిలుపుకోవచ్చు.

ఐపీఎల్​లోకి అదానీ ఎంట్రీ!
ఐపీఎల్​లోకి అదానీ ఎంట్రీ!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో జట్టు దక్కించుకోవాలన్న గౌతమ్​ అదానీ కల నెరవేరబోతున్నట్టు తెలుస్తోంది!  గుజరాత్ టైటాన్స్​ నియంత్రణ వాటాను కొనుగోలు చేయడానికి అదానీ గ్రూప్, టొరెంట్ గ్రూప్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్ పార్ట్​నర్స్​తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ ఐపీఎల్ జట్టులో మెజారిటీ వాటాను విక్రయించి మైనారిటీ హోల్డింగ్​ని నిలుపుకోవాలని చూస్తున్నట్టు ఎకనామిక్ టైమ్స్ నివేదిక తెలిపింది.

కొత్త జట్లు వాటాలు విక్రయించకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిరోధించే లాక్-ఇన్ పీరియడ్ 2025 ఫిబ్రవరితో ముగియనుంది. ఈ నేపథ్యంలో గుజరాత్​ టైటాన్స్​పై అదానీ గ్రూప్​ ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు బయటకి వచ్చాయి.

గుజరాత్ టైటాన్స్ విలువ 1 బిలియన్ డాలర్ల నుంచి 1.5 బిలియన్ డాలర్ల మధ్య ఉండవచ్చు. సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్ 2021లో ఈ ఫ్రాంచైజీని రూ.5,625 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ జట్టుకు మూడేళ్లు పూర్తవుతాయి.

“2021లో ఐపీఎల్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సొంతం చేసుకునే అవకాశాన్ని కోల్పోయిన అదానీ, టొరెంట్ రెండూ.. గుజరాత్ టైటాన్స్​లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి తీవ్రంగా పోటీ పడుతున్నాయి. సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ ఫ్రాంచైజీలో తన వాటాను మానిటైజ్ చేసుకునేందుకు ఇదొక మంచి అవకాశం,” అని ఓ అధికారిని ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.

ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయని, ఈ లీగ్ బలమైన నగదు ప్రవాహంతో ఆకర్షణీయమైన అసెట్​గా స్థిరపడిందని మరో అధికారి చెప్పినట్టు నివేదిక పేర్కొంది.

క్రికెట్​లో ఇన్​వెస్ట్​మెంట్​ అనేది అదానీకి కొత్తేమీ కాదు! గతంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్), యూఏఈ ఇంటర్నేషనల్ లీగ్ టీ20ల్లో జట్లను కొనుగోలు చేయడం ద్వారా అదానీ క్రికెట్లో పెట్టుబడులు పెట్టారు. జనవరి 25, 2023న మింట్ నివేదిక ప్రకారం, అదానీ 2023 లో డబ్ల్యూపీఎల్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ .1,289 కోట్ల టాప్ బిడ్​తో దక్కించుకున్నారు.

ఐపీఎల్ టీమ్ గుజరాత్ టైటాన్స్, హాస్పిటల్ చైన్ హెల్త్కేర్ గ్లోబల్, ఇండస్ట్రియల్ కెమికల్స్ తయారీదారు సజ్జన్ ఇండియా, డేటా అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ యునైటెడ్ లెక్స్ వంటి కంపెనీల్లో సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్ పెట్టుబడులు పెట్టింది.

హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్​లో సీవీసీ క్యాపిటల్ పార్ట్​నర్స్ మెజారిటీ వాటా 60.4% కోసం సింగపూర్​కు చెందిన టెమాసెక్ హోల్డింగ్స్ బిడ్ వేయవచ్చని మే 3 న మింట్ నివేదించింది. టీపీజీ, బెయిన్ క్యాపిటల్, వీపీఎస్ హెల్త్కేర్ (బుర్జీల్ హోల్డింగ్స్) బిడ్​లో ఇన్వెస్టర్లుగా ఉన్నారు.

ఇక గుజరాత్​ టైటాన్స్​ మూడు ఐపీఎల్​ సీజన్స్​లో ఆడింది. మొదటి సీజన్​లోనే టైటిల్​ గెలిచేసింది. రెండో సీజన్​లో ఫైనల్​కి చేరింది. కానీ మూడో సీజన్​లో జట్టు మెరుగైైన ప్రదర్శన చేయలేకపోయింది.

Whats_app_banner

సంబంధిత కథనం