Claim Settlement: బీమా పాలసీలను సెటిల్ చేస్తున్నారా, ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి…
Claim Settlement: బీమా పాలసీలను తీసుకునేదే ముందస్తు రక్షణ కోసం, జరగరానిది ఏమైనా జరిగితే మనపై ఆధారపడిన వారికి ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతోనేబీమా పాలసీలతో రక్షణ పొందుతారు. బీమా సొమ్ము ద్వారా ఆర్థిక రక్షణ లభిస్తుందనే ప్రీమియం చెల్లిస్తాం. బీమా పరిహారాన్ని పొందడంలో ఈ జాగ్రత్తలు మరువకండి.
Claim Settlement: బీమా పాలసీలను విక్రయించే సమయంలో చెప్పే మాటలు చాలా సందర్భాల్లో బీమా కంపెనీలు నిలబెట్టుకోవడంలో విఫలం అవుతుంటాయి. ఏదో ఒక కొర్రీలు వేసి బీమా సొమ్ము ఎగవేసే ప్రయత్నాలు చేస్తుంటాయి. మన పాలసీ మొత్తాన్ని బీమా కంపెనీ సక్రమంగా చెల్లిస్తుందా, సాకులు చెప్పి ఎగ్గొడుతుందా, బీమా క్లెయిం పొందడానికి పాటించాల్సిన కనీస జాగ్రత్తలు ఏమిటనే దానిపై చాలామందికి అవగాహన ఉండదు. బీమా కంపెనీలు వేర్వేరుగా ఉన్నా చాలా వరకు నిబంధనలు ఒకే రకంగా ఉంటాయి.
సెటిల్‌మెంట్లలో రకాలు..
సాధారణంగా మూడు రకాల బీమా పాలసీ క్లెయిమ్‌లు ఉంటాయి. వీటిలో మొదటిది పాలసీ గడువు పూర్తైన తర్వాత అందుకునే మెచ్యురిటీ క్లెయిమ్, రెండోది ఆకస్మిక, సాధారణ మరణం సంభవించినపుడు చెల్లించే మెచ్యురిటీ క్లెయిమ్, మూడోది పాలసీ గడువు మధ్యలో సర్వైవల్ బెనిఫిట్స్ ఉంటాయి. పాలసీ గడువు పూర్తైన తర్వాత పాలసీదారుడికి ఒప్పందం మేరకు బీమా మొత్తాన్ని చెల్లించడంలో సాధారణంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
బీమా పాలసీ అమలులో ఉండగా పాలసదారు మరణిస్తే డెత్ క్లెయిం చెల్లిస్తారు. పాలసీదారు చనిపోతే రెండు రకాలుగా బీమా పరిహారం చెల్లిస్తారు. పాలసీ దారు ముందస్తు మరణం, నాన్ ఎర్లీ డెత్ క్లెయిమ్‌లుగా వీటిని సెటిల్ చేస్తారు.
ముందస్తు మరణం కేసుల్లో పాలసీ అమల్లో ఉండగా, పాలసీ జారీ చేసిన రెండేళ్లలోపు లేదా పాలసీని పునరుద్ధరించిన తేదీ నుంచి రెండేళ్లలోపు పాలసీదారు మరణిస్తే వాటిని ఎర్లీ డెత్ క్లెయిమ్ అంటారు. ఎర్లీ డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు క్లెయిమ్‌ఫామ్ ఏ,బి, బి1, సి, ఇలతో పాటు డెత్ సర్టిఫికెట్, పాలసీదారుడి వయసును నిర్థారించే పత్రాలను బీమా కంపెనీకి అందించాలి
ఎర్లీ డెత్ పాలసీ క్లెయిమ్ చేసేటపుడు పాలసీదారు మరణిస్తే బీమాలో పేర్కొన్న నామినీలు లేదా వారసులు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వారసత్వ ధృవీకరణ కూడా అవసరం అవుతుంది. ఈ దరఖాస్తులో బీమా పరిహారం కోరుతున్న వ్యక్తి, బీమాదారుడితో బంధుత్వం, వయసు, పాలసీదారు మరణానికి కారణం వంటి వివరాలను అందించాల్సి ఉంటుంది.
క్లెయిమ్ దరఖాస్తుతో పాటు పాలసాదారుడు ఆస్పత్రిలో మరణిలో చివరి సారి వైద్యం చేసిన వైద్యుడి వాంగ్మూలం కూడా అవసరం అవుతుంది. పాలసీదారు మరణానికి ముందు ఆస్పత్రిలో చేరితో వైద్యులు ధృవీకరణ అందించాలి. ఫారం సిలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశంలో ఇచ్చే ధృవీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఫారం ఇలో పాలసీదారుడు పనిచేసే సంస్థ నుంచి ఇచ్చే ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికెట్, పాలసీదారుడి సెలవుల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఎర్లీ డెత్ క్లెయిమ్‌లలో ప్రమాద బీమా ప్రయోజనం అందుకోవాలంటే పాలసీదారుడు పాలసీలో ప్రమాదబీమా కోసం నిర్ణీత మొత్తం అదనంగా బీమా కంపెనీకి చెల్లించి ఉండాలి. ప్రమాద బీమా చెల్లించడానికి గాయాల వల్ల మరణం లేదా శాశ్వత వైకల్యం ఏర్పడి ఉండాల్సి ఉంటుంది. వైకల్యం శాశ్వతంగా ఉంటే అంతకు ముందు చేసే పనిని కొనసాగించలేని స్థితిలో పాలసీదారుడు ఉంటే ప్రమాద బీమా వర్తిస్తుంది. పూర్తిగా కంటి చూపు కోల్పోవడం, చేతులు తెగిపడటం, కాళ్లను కోల్పోవడాన్ని శాశ్వత అంగ వైకల్యంగా పరిగణిస్తారు. ప్రమాదం జరిగిన 180రోజుల్లోగా ఈ అంగ వైకల్యం ఏర్పడి ఉండాల్సి ఉంటుంది.
పాలసీ గడువు మధ్యలో ప్రయోజనాలు అందుకోవాలంటే...
మనీ బ్యాక్ పాలసీల్లో నిర్ణీత కాల వ్యవధి తర్వాత కొంత మొత్తాన్ని అందుకోడానికి అనుమతిస్తారు. పరిమితి మేరకు ఈ మొత్తాన్ని పాలసీదారుడికి చెల్లిస్తారు. సర్వైకల్ బెనిఫిట్స్ అందుకోడానికి ప్రీమియం మొత్తాన్ని పాలసీదారుడు చెల్లించి ఉండాలి. ఆరునెలల ముందు వరకు బీమా కంపెనీకి బాకీ లేకుండా ఉండాలి. మధ్యలో ఆర్థిక ప్రయోజనాలు అందుకోవాలంటే పాలసీ పట్టాతో పాటు డిశ్చార్జ్ ఫారం, పాలసీపై ఎలాంటి అప్పులు లేవని నిర్ధారించే ధృవీకరణ, శాలరీ సేవింగ్స్‌లో బీమా ప్రీమియం చెల్లించే వారు ఎలాంటి బకాయి లేదని నిర్ధారించే ధృవీకర అందించాల్సి ఉంటుంది. జీతం చెల్లించే సంస్థలు ఈ ధృవీకరణ అందిస్తాయి.
పాలసీపై అప్పు ఉంటే బీమా మొత్తం నుంచి పాలసీ మీద ఉన్న అప్పు,దానిపై వడ్డీ మినహాయించి మిగిలిన మొత్తాన్ని పాలసీదారుడికి చెల్లిస్తారు. అన్ని చెల్లింపులు ఆన్‌లైన్ లో మాత్రమే చేస్తారు. పాలసీదారులు తమ పాలసీతో పాటు అకౌంట్ వివరాలను పాలసీలలో నమోదు చేయాల్సి ఉంటుంది. రూ.2లక్షల్లోపు సర్వైకల్ బెనిఫిట్స్‌కు పాలసీ పట్టా, డిశ్చార్జిఫారం లేకుండానే చెల్లిస్తారు. 2010కు ముందు జారీ చేసిన పట్టాల్లో రూ.60వేల కంటే ఎక్కువ మొత్తం ఉపసంహరించుకుంటే పాలసీ పట్టా, డిశ్చార్జి ఫారం అప్పగించాల్సి ఉంటుంది.