Nirmala Sitharaman : జీరో ట్యాక్స్ తీసుకురావాలని అనుకుంటా.. కానీ.. పన్నులపై ఆర్థిక మంత్రి నిర్మలా కామెంట్స్
Nirmala Sitharaman On Tax : పన్నుల వ్యవస్థపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీద చాలా రోజులు సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. మధ్య తరగతివారిపై భారం మోపారని విమర్శలు వస్తున్నాయి. అయితే తాజా వీటన్నింటిపై ఆమె స్పందించారు. పన్నులు ఎందుకు పెంచాల్సి వస్తుందో వివరించారు.
పన్నుల వ్యవస్థపై ట్రోల్స్‌కు గురైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పుడు స్పందించారు. పన్నును సున్నాకు తగ్గించాలని తాను కోరుకుంటున్నానని, అయితే భారతదేశం ముందు అనేక సవాళ్లు ఉన్నాయని ఆర్థిక మంత్రి అన్నారు. కొన్నిసార్లు ఆర్థిక మంత్రిగా మన పన్నులు ఎందుకు ఇలా ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలి. అంతకంటే తక్కువకు ఎందుకు వెళ్లలేమని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. దాదాపు సున్నాకు తీసుకురావాలని అనుకుంటున్నానని, కానీ భారత్ సవాళ్లు తీవ్రంగా ఉన్నాయని, వాటిని అధిగమించాల్సి ఉందన్నారు నిర్మలా.
'ప్రభుత్వం కేవలం మాట్లాడటం కాదు. ఆర్ అండ్ డీ (రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ )లో పెట్టుబడులు పెడుతోంది. పన్నుల ద్వారా వచ్చే డబ్బు ఇది. ఇది నా పని, కాబట్టి నేను మీకు చెబుతాను. ఆదాయం సంపాదించడమే నా పని. ప్రజలను ఇబ్బంది పెట్టడం నా పని కాదు.' అని నిర్మాలా సీతారామన్ మాట్లాడారు.
2047 నాటికి ఇంధన రంగంలో దేశాన్ని స్వయం సమృద్ధి సాధించడమే తమ లక్ష్యమని నిర్మలా సీతారామన్ తెలిపారు. శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, నిల్వ కోసం పరిశోధనలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని మంత్రి నొక్కి చెప్పారు. ఈ దిశగా భారత ప్రభుత్వం ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోందన్నారు.
ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ కు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఇందుకోసం రూ.10,300 కోట్లు కూడా కేటాయించినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రంగా భారత్ ను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నామన్నారు.
భారతదేశం సెమీ కండక్టర్ మిషన్-2021 లో ప్రారంభమైందని నిర్మలా సీతారామన్ చెప్పారు. భారత్ లో ఈ ప్రాంతంలో ఇప్పటికే మూడు యూనిట్లను ఏర్పాటు చేశారన్నారు. అంతరిక్ష రంగాన్ని ప్రయివేటు రంగానికి తెరవడం ఒక పెద్ద చొరవ అని పేర్కొన్నారు. ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ను ప్రోత్సహించడం తన బాధ్యతగా ప్రభుత్వం భావిస్తోందని నిర్మలా సీతారామన్ చెప్పారు.