Flipkart: కొత్త పేమెంట్స్ యాప్ ‘‘సూపర్.మనీ’’ ని ప్రారంభించిన ఫ్లిప్ కార్ట్-flipkart groups new payments app super money eyes first time borrowers ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Flipkart: కొత్త పేమెంట్స్ యాప్ ‘‘సూపర్.మనీ’’ ని ప్రారంభించిన ఫ్లిప్ కార్ట్

Flipkart: కొత్త పేమెంట్స్ యాప్ ‘‘సూపర్.మనీ’’ ని ప్రారంభించిన ఫ్లిప్ కార్ట్

HT Telugu Desk HT Telugu
Aug 21, 2024 10:20 PM IST

వాల్ మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్ కార్ట్ గ్రూప్ కొత్తగా ఒక పేమెంట్ యాప్ ను ప్రారంభించింది. ‘సూపర్ మనీ’ పేరుతో ప్రారంభించిన ఈ పేమెంట్ యాప్ తో లావాదేవీలు చేసే కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్స్ ను అందించనుంది.ఫ్లిప్ కార్ట్ డిసెంబర్ 2022 లో మరో పేమెంట్ యాప్ ఫోన్ పే నుండి విడిపోయింది.

ఫ్లిప్ కార్ట్ కొత్త పేమెంట్స్ యాప్ ‘‘సూపర్.మనీ’’
ఫ్లిప్ కార్ట్ కొత్త పేమెంట్స్ యాప్ ‘‘సూపర్.మనీ’’

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లింపులు జరిపేందుకు, క్యాష్ బ్యాక్ పొందేందుకు వీలుగా ఫ్లిప్ కార్ట్ సూపర్ మనీ అనే కొత్త పేమెంట్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, ట్రావెల్ బుకింగ్ సంస్థ క్లియర్ ట్రిప్, ఫ్యాషన్ బ్రాండ్ మింత్రాల యాజమాన్య సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ గ్రూప్. ఈ సంస్థ మరో పేమెంట్ యాప్ ఫోన్ పే తో 2022 లో పూర్తిగా విడిపోయింది. ఇప్పుడు రెండున్నర సంవత్సరాల తరువాత, సొంతంగా పేమెంట్ యాప్ ను ప్రారంభించింది.

10 లక్షల డౌన్ లోడ్ లు..

ఫ్లిప్ కార్ట్ తన సూపర్ మనీ యాప్ ను జూన్ లో బీటా లేదా టెస్ట్ మోడ్ లో ప్రారంభించింది, అప్పటి నుండి 10 మిలియన్ లావాదేవీలు, 1 మిలియన్ డౌన్ లోడ్ లను నిర్వహించింది. మింత్రా, ఫ్లిప్ కార్ట్ వంటి భాగస్వామ్య ప్లాట్ ఫామ్ లలో జరిగే లావాదేవీలపై ప్రతి మర్చంట్ లావాదేవీపై 5% వరకు క్యాష్ బ్యాక్ తో పాటు ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంది.

ఎన్పీసీఐ యూపీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో..

కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో భాగస్వామ్యం ద్వారా యూపీఐ ఆఫర్ పై క్రెడిట్ ను ప్రారంభించాలని ఫ్లిప్ కార్ట్ (flipkart) సంస్థ యోచిస్తోంది. యూపీఐపై క్రెడిట్ ఇవ్వడంతో వ్యక్తుల రుణ అవకాశాలు పెరుగుతాయని భావిస్తోంది. ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుండి రుణగ్రహీతలు అధికారిక క్రెడిట్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.

ఫస్ట్ టైమ్ రుణ గ్రహీతలు లక్ష్యంగా..

క్రెడిట్ కార్డులతో సహా ఇప్పటివరకు ఏ విధమైన రుణాన్ని పొందని వినియోగదారులు లక్ష్యంగా, మొదటి సారి రుణాలను తీసుకునేవారిని ఆకర్షించడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని సూపర్ మనీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రకాశ్ సికారియా చెప్పారు. ‘‘మేం అనుసరిస్తున్న టీజీ (టార్గెట్ గ్రూప్)కు ఎప్పుడూ అన్ సెక్యూర్డ్ కార్డు రాలేదు. వీరికి వీసా, మాస్టర్ కార్డ్, రూపే కార్డులు లేవు. అలాంటి వ్యక్తికి ఒక కార్డ్ ను ఇస్తే, వారు ఉత్సాహంగా ఆ కార్డును ఉపయోగిస్తారు’’ అని సికారియా చెప్పారు.

డిసెంబర్ నాటికి టాప్ 5 లో..

సాధారణంగా, వివిధ సంస్థలు, బ్యాంక్ లు జారీ చేసిన ప్రతి కార్డుకు సగటున నలుగురు దరఖాస్తుదారులు తిరస్కరించబడతారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సూపర్.మనీ టార్గెట్ గ్రూప్ ను నిర్ణయించుకుందని సికారియా చెప్పారు. డిసెంబర్ నాటికి టాప్ 5 యూపీఐ ప్లేయర్లలో ఒకటిగా నిలవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

2016 నుంచి ఫోన్ పే తో..

వినియోగదారుల చెల్లింపులను సులభం చేయడానికి ఫ్లిప్ కార్ట్ గ్రూప్ 2016 లో ఫోన్ పే ను కొనుగోలు చేసింది. ఇప్పుడు తాజాగా, మార్చిలో తన సొంత యూపీఐ హ్యాండిల్ ను ప్రారంభించి చెల్లింపులపై 5% వరకు క్యాష్ బ్యాక్ ను అందిస్తుంది. అయితే సూపర్ మనీ స్వతంత్రంగా పనిచేస్తుందని, ఫ్లిప్ కార్ట్ యూపీఐ ఆఫర్ ను పోటీగా చూడటం లేదని సికారియా పేర్కొంది. సూపర్ మనీ పలు ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఆర్థిక సేవలు అందిస్తోంది. ప్రస్తుతం గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో అందుబాటులో ఉన్న ఈ యాప్ త్వరలోనే ఆపిల్ ఐఓఎస్ లో అందుబాటులోకి రానుంది.