ఒక ప్రకటనలో భర్తలను ‘బేవకూఫ్ పతి’ అని అవమానించిన ఫ్లిప్ కార్ట్; మండి పడ్తున్న పతిదేవుళ్లు
భర్తలను తెలివి తక్కువవారిగా చూపుతూ రూపొందించిన ఒక ప్రమోషనల్ వీడియోతో ఫ్లిప్ కార్ట్ ఇబ్బందుల్లో పడింది. ఆ వీడియోపై పురుషుల హక్కుల సంఘం నుంచి విమర్శలు రావడంతో ఆ వీడియోను తొలగించడంతో పాటు క్షమాపణలు చెప్పింది. భర్తలను పొరపాటున నెగెటివ్ గా చూపించామని వివరించింది.
ఇటీవల ఒక ప్రమోషనల్ వీడియో ఫ్లిప్ కార్ట్ ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేసింది. భర్తలను అవమానించేలా ఉన్న ఆ వీడియో వివాదాస్పదంగా మారింది. దానిపై పురుషులు, పురుష సంఘాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. దాంతో, ఆ వీడియోను ఫ్లిప్ కార్ట్ తొలగించింది. పొరపాటున ఆ వీడియోను పోస్ట్ చేశామని క్షమాపణలు చెప్పింది.
ఆ వీడియోలో ఏముంది.?
మహిళలు ఫ్లిప్ కార్ట్ నుంచి హ్యాండ్ బ్యాగులను ఆర్డర్ చేసి, వాటిని, భర్తలకు తెలియకుండా ఇంట్లో వివిధ ప్రదేశాల్లో దాచే సన్నివేశాన్ని ఈ వీడియోలో చిత్రీకరించారు. దీంట్లో పురుషులను తెలివితక్కువ వారిగా, అమాయకులుగా చిత్రించారు. వారిని ‘‘అల్సీ, కంబక్త్ , బేవాకోఫ్ పతి" అని అభివర్ణిచారు. దీనిపై ఒక పురుషుల హక్కుల సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వీడియోలో భర్తలను "అల్సీ, కంబక్త్ మరియు బేవాకోఫ్ పతి" అని అన్యాయంగా అభివర్ణించిందని నేషనల్ కౌన్సిల్ ఫర్ మెన్ అనే సంస్థ వాదించింది. ఈ విమర్శల నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ వెంటనే ఆ వీడియోను తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల నుంచి తొలగించింది.
అయినా కోపం తగ్గలేదు..
తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల నుంచి ఆ వీడియోను ఫ్లిప్ కార్ట్ తొలగించినప్పటికీ పురుష హక్కుల సంస్థలు తగ్గలేదు. ఫ్లిప్ కార్ట్ వెంటనే భర్తలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ మెన్ ఈ వీడియోను సోషల్ మీడియా (social media) ప్లాట్ఫామ్ ఎక్స్లో షేర్ చేసి తమ అభ్యంతరాలను ఎత్తిచూపింది. ఎన్సీఎంఇండియా కౌన్సిల్ ఫర్ మెన్ అఫైర్స్ అనే తమ ఖాతాలో వారు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. భర్తలను ‘ఆల్సీ, కంబక్త్, బేవకూఫ్ పతి’ అంటూ సంబోధిస్తూ ఇలాంటి విషపూరిత వీడియోను పోస్ట్ చేయడం వెనుక లాజిక్ ఏంటని ప్రశ్నించింది. దీనిపై ఫ్లిప్ కార్ట్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
స్పందించిన ఫ్లిప్ కార్ట్
దీనిపై స్పందించిన ఫ్లిప్ కార్ట్ (flipkart) ఈ వీడియోను డిలీట్ చేయడమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పింది. పొరపాటున పోస్ట్ చేసిన అభ్యంతరకరమైన వీడియోకు చింతిస్తున్నామని, తమ తప్పును గ్రహించిన వెంటనే దాన్ని తొలగించామని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడుతామని తెలిపింది. ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ మెన్ షేర్ చేసిన వీడియోకు 1.6 లక్షల వ్యూస్ లభించాయి. నెటిజన్లు ఫ్లిప్ కార్ట్ (flipkart) వీడియోను విమర్శిస్తూ పలు కామెంట్లు చేశారు.