Pig farming: మంచి ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంలోకి.. ఇప్పుడు జీతానికి రెట్టింపు ఆదాయం
Pig farming: విమాన యాన సంస్థలో ఫ్లైట్ అటెండెంట్ గా చేస్తున్న ఒక యువతి తన ఉద్యోగాన్ని వదిలి మరో క్రేజీ కెరీర్ ను ఎంచుకుంది. అయితే, కొత్త కెరీర్ లో ఆమె తన జీతానికి రెట్టింపు ఆదాయం పొందుతూ, బిజినెస్ విస్తరణ కోసం ప్రణాళికలు రచిస్తోంది.
Pig farming: చైనాలో మాజీ ఫ్లైట్ అటెండెంట్ అయిన యాంగ్ యాంగ్ యాంగ్సీ తన ఉద్యోగాన్ని వదిలేసి తన స్వస్థలానికి తిరిగి వచ్చి పందుల పెంపకందారుగా మారాలని నిర్ణయించుకుంది. పందుల పెంపకాన్ని కెరీర్ గా ఎంచుకున్న తరువాత కేవలం రెండు నెలల్లోనే ఆమె 200,000 యువాన్లు (28,000 అమెరికన్ డాలర్లు) సంపాదించింది.

డబ్బుకు ఇబ్బందులు..
27 ఏళ్ల యాంగ్ ఈశాన్య చైనాలోని హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్ లో ఒక గ్రామీణ కుటుంబంలో పెరిగింది. యూనివర్శిటీ చదువు పూర్తయిన తర్వాత షాంఘైకి చెందిన ఓ ఎయిర్ లైన్స్ లో ఐదేళ్ల పాటు ఫ్లైట్ అటెండెంట్ గా పనిచేశారు. విమానయాన సంస్థ కష్టకాలంలో తన నెల జీతం కేవలం 2,800 యువాన్లు (380 అమెరికన్ డాలర్లు) మాత్రమేనని ఆమె తెలిపింది. షాంఘైలో నివసిస్తున్నప్పుడు తల్లిదండ్రులను తరచూ డబ్బు అడిగేదానినని ఆమె తెలిపారు. అయితే, తనను పోషించడానికి, తన తల్లిదండ్రులు తమ సొంత ఖర్చులను తగ్గించుకుంటున్నారని, అంతేకాకుండా, అప్పులు చేస్తున్నారని తరువాత గ్రహించానని తెలిపింది.
తల్లి సర్జరీ తరువాత..
2022 అక్టోబర్లో, లిపోమాస్ ను తొలగించడానికి తన తల్లికి పలు శస్త్రచికిత్సలు జరిగాయని తెలుసుకున్న తరువాత, యాంగ్ ఫ్లైట్ అటెండెంట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన స్వస్థలానికి తిరిగి రావాలని నిర్ణయం తీసుకుంది. ఆమె తీవ్ర అపరాధభావాన్ని వ్యక్తం చేస్తూ, "నా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ నాకు మంచి వార్తలు చెబుతారు, కానీ చెడును దాచారు. ఇప్పుడు నేను వారితో ఉండాలనుకుంటున్నాను’’ అన్నారు.
పందుల పెంపకంలోకి..
2023 ఏప్రిల్లో యాంగ్ బంధువులకు చెందిన ఒక పందుల ఫారం బాధ్యతలు చేపట్టి పందుల పెంపకం ప్రారంభించింది. పందుల పెంపకం, పందులు, ఇతర పశువులను విక్రయించడం, తన సోషల్ మీడియాను నిర్వహించడం ద్వారా గత రెండు నెలల్లో 200,000 యువాన్లు (27,000 అమెరికన్ డాలర్లు) సంపాదించానని యాంగ్ చెప్పారు. తన వ్యవసాయ క్షేత్రాన్ని విస్తరించాలని, ఒక ప్రత్యేక దుకాణాన్ని తెరవాలని, చివరికి ఒక హోటల్ ను ప్రారంభించాలని ఆమె యోచిస్తున్నట్లు తెలిపింది.