Ferrato Defy 22 : లక్ష ధరతో మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ.. ఫీచర్లలోనూ అస్సలు తగ్గేదేలే!
Ferrato Defy 22 Electric Scooter : ఎలక్ట్రిక్ స్కూటర్ ఫెర్రాటో డీఫై 22 భారత మార్కెట్లో లాంచ్ అయింది. దీని ధర రూ .1 లక్ష (ఎక్స్-షోరూమ్). ఈ ఇవి 3 రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. గంటకు 70 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ ఈవీ గురించి మరిన్ని వివరాలు చూద్దాం..
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమలోకి మరో ఈవీ స్కూటీ ఎంట్రీ ఇచ్చింది. అదే ఫెర్రాటో డీఫై 22. భారతదేశంలో రూ .1 లక్ష (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేశారు. ఈ స్కూటర్ జనవరి 17, 2025న ప్రవేశపెట్టారు. ఫెర్రాటో బ్రాండ్ హైఎండ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. దీనికి సొంతంగా ప్రత్యేక డీలర్ షిప్ నెట్ వర్క్ ఉంటుంది. ఫెర్రాటో డీఫై 22లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయో చూద్దాం..

స్టైలిష్ డిజైన్ అండ్ లుక్స్
ఫెర్రాటో డీఫై 22 మంచి ఆధునిక డిజైన్‌తో వస్తుంది. ఈ స్కూటర్లో 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇది స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది. ఫ్రంట్ ఆప్రాన్ పొడవుగా, ఆకర్షణీయంగా ఉంటుంది. హెక్సాగాన్ ఆకారంలో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి.
షార్ప్ సైడ్ ప్యానెల్స్, భారీ గ్రాబ్ రైల్స్, ప్రత్యేకమైన టెయిల్ ల్యాంప్ డిజైన్ ఇతర డిజైన్‌తో వస్తుంది. షాంపైన్ క్రీమ్, బ్లాక్ ఫైర్, యూనిటీ వైట్, కోస్టల్ ఐవరీ, రెసిస్టెన్స్ బ్లాక్, డోవ్ గ్రే, మ్యాట్ గ్రీన్ అనే మొత్తం 7 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో ఈ స్కూటర్ లభిస్తుంది.
ఫీచర్లు
ఫెర్రాటో డీఫై 22 స్టైలిష్‌గా ఉండటమే కాకుండా ఫీచర్ల పరంగా తగ్గేదేలే అన్నట్టుగా ఉంటుంది. ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ స్పీడోమీటర్ ఉంది. ఇందులో మ్యూజిక్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఈవీ ఎకో, సిటీ, స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్‌లతో ఉంటుంది. ఇందులో సౌకర్యవంతమైన రైడింగ్ కోసం డ్యూయల్ లెవల్ ఫుట్ బోర్డ్, 25 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ లభిస్తుంది.
ఫెర్రాటో డీఫై 22 బలమైన హార్డ్ వేర్ సెటప్‌ను కలిగి ఉంది. దాని సేఫ్టీ, పనితీరు రెండింటినీ మెరుగుపరుస్తుంది. ఇందులో 12 అంగుళాల అల్లాయ్ వీల్స్, కాంబి డిస్క్ బ్రేక్ సిస్టమ్, 220 ఎంఎం ఫ్రంట్ డిస్క్, 180 ఎంఎం రియర్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ ఉన్నాయి. సస్పెన్షన్ విషయానికొస్తే ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ కలిగి ఉంది.
బ్యాటరీ, రేంజ్ వివరాలు
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 1200 వాట్ల మోటారును కలిగి ఉంది. దీని గరిష్ట శక్తి 2500 వాట్ వరకు ఉంటుంది. గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లు. దీని బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే ఇది 72వి 30ఎహెచ్(2.2 కిలోవాట్) ఎల్ఎఫ్పీ బ్యాటరీని పొందుతుంది. ఈ స్కూటర్ 80 కి.మీ రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.