జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీ ఇండియాలో అడుగుపెట్టబోతోంది. దీని పేరు ఎంజీ ఎం9. ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ కారు ఈ ఏడాది జూన్‌లో లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇండియా స్పెక్ వర్షెన్ కోసం అందుబాటులో ఉండనున్న కలర్ ఆప్షన్లను సంస్థ తాజాగా ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఎంజీ ఎం9 అనేది ఒక 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీ. ఈ ఈవీ మిస్టిక్ గ్రే, ల్యూమినస్ వైట్, కార్డిఫ్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.
వాస్తవానికి ఈ ఎంపీవీ అంతర్జాతీయ మార్కెట్లలో విస్తృతమైన కలర్ ప్యాలెట్‌లో లభిస్తుంది. ఎంపిక చేసిన కొన్ని షేడ్స్ మాత్రమే భారతదేశానికి వస్తాయి. ఆటో ఎక్స్పో 2025లో ప్రదర్శన అనంతరం ఈ ఎం9 బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇది ఎంజీ హై-ఎండ్ ఎంజీ సెలెక్ట్ షోరూమ్‌ల ద్వారా సేల్స్‌లోకి వెళుతుంది.
క్లీన్ అండ్ మినిమలిస్టిక్ డిజైన్ లాంగ్వేజ్ ఉన్నప్పటికీ, ఎంజీ ఎం9 ఐదు మీటర్ల కంటే ఎక్కువ పొడవుతో రహదారిపై అగ్రెసివ్ ముద్ర వేస్తుంది. 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు బాక్సీ సిల్హౌట్, బాడీ కలర్ ఎలిమెంట్స్ - ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఓఆర్వీఎం వంటివి హైలైట్‌గా నిలుస్తాయి. ఎలక్ట్రిక్ ఎంపీవీ 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది.
ఇంటీరియర్ విషయానికొస్తే, ఎం9 విలాసవంతమైన, మినిమలిస్ట్ క్యాబిన్ని అందిస్తుంది. డ్యాష్ బోర్డ్ డ్యూయెల్ స్క్రీన్ సెటప్‌ను కలిగి ఉంది. సాఫ్ట్-టచ్ లెథర్ సర్ఫేస్ చాలా ఇంటీరియర్ టచ్ పాయింట్లను కవర్ చేస్తాయి. రెండొవ వరుస ప్రయాణీకుల కోసం, ఎంపీవీ వ్యక్తిగత ఎంటర్టైన్మెంట్ స్క్రీన్లు, టచ్-సెన్సిటివ్ ఆటో క్లైమేట్ కంట్రోల్స్ జోడిస్తుంది.
ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ కారు టెక్నాలజీతో నిండిన, కంఫర్ట్ రిచ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. డ్యూయెల్ సన్‌రూఫ్స్ (సింగిల్-ప్యాన్ యూనిట్, పానోరమిక్ సన్‌రూఫ్), వైర్లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ట్రిపుల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం 12-స్పీకర్ ఆడియో సిస్టెమ్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముందు, రెండొవ వరుస సీట్లు రెండూ పవర్ ఎడ్జెస్టెడ్, వెంటిలేషన్- మసాజ్ డ్యూటీలను కూడా అందిస్తాయి.
ఏడు ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా, హిల్-హోల్డ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీప్ అసిస్ట్, ఇతర డ్రైవర్ ఎయిడ్స్‌ను తీసుకువచ్చే లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టెమ్స్ (ఏడీఏఎస్)తో భద్రతా ఫీచర్లు కూడా సమగ్రంగా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఎంజీ ఎం9లో 90 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 240.6 బీహెచ్పీ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. దీని రేంజ్ 430 కి.మీ. ఎంపీవీ ఫ్రంట్ వీల్‌తో నడుస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 120 కిలోవాట్ల డిసి ఛార్జర్ ఉపయోగించి, బ్యాటరీని 30 నిమిషాల్లో 30 నుంచి 80 శాతం వరకు పెంచవచ్చు.
ఈ ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ ఎంపీవీ సుమారు రూ.70 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. ఇది లాంచ్ అయిన తరువాత, టయోటా వెల్ఫైర్, కియా కార్నివాల్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. లగ్జరీ ఎంపీవీ సెగ్మెంట్లో ఎంజీ ఎం9 పూర్తిగా ఎలక్ట్రిక్ ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.
సంబంధిత కథనం