మొదటి కారు కొనే ముందు ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోతారు!-explainer things to keep in mind before buying your first car ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మొదటి కారు కొనే ముందు ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోతారు!

మొదటి కారు కొనే ముందు ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోతారు!

Sharath Chitturi HT Telugu

చాలా సంవత్సరాలు డబ్బులు కూడబెట్టి, మొదటి కారు కొంటున్నారా? అయితే ఇది మీకోసమే! మొదటి కారు కొనే ముందు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు, టిప్స్​ని ఇక్కడ తెలుసుకోండి. ఇవి మీకు కచ్చితంగా ఉపయోగపడతాయి.

మొదటి కారు కొనే ముందు ఇవి తెలుసుకోండి..

జీవితంలో సొంత కారు అనేది చాలా మంది కల! రూపాయి, రూపాయి కూడబెట్టి కొత్త కారు కొంటుంటారు. అయితే, ఒక్కోసారి కష్టార్జితంతో కొన్న మొదటి కారు తమకు సూట్​ అవ్వడం లేదని, కొనుగోలు చేసిన తర్వాత తెలుస్తుంటుంది. అటు అమ్మలేక, ఇటు ఇంకో కారు కొనలేక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యలు రాకూడదంటే, కారు కొనే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని టిప్స్​ పాటించి, మనకి నచ్చే, మనకి సూట్​ అయ్యే కారును ఎంపిక చేసుకోవాలి. అది ఎలా అంటే..

మొదటి కారు కొనే ముందు ఇవి తెలుసుకోండి..

1. బడ్జెట్​ ఫిక్స్​ చేసుకోండి- మార్కెట్​లో రూ. 3లక్షల నుంచి రూ. కోటి వరకు, అంత కన్నా ఎక్కువ ధరకు కూడా కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఎంపిక చేసుకోవాలంటే, ముందు మనం మన బడ్జెట్​ గురించి తెలుసుకోవాలి. ఎంత వరకు ఖర్చు చేయగలము? మన స్తోమత ఏంటి? అని చూసుకోవాలి. ఒక నెంబర్​ ఫిక్స్​ చేసుకుని, అప్పుడు ఆ ప్రైజ్​ పాయింట్​లో కార్లను చూడాలి. మరీ ముఖ్యంగా మీరు షోరూమ్​కి వెళితే, మీ ప్రైజ్​ పాయింట్​ కన్నా ఇంకాస్త ఎక్కువ ధర కలిగిన వాహనాలు చూపించి, వాటిల్లో ఇంకా ఫీచర్స్​ ఉంటాయని మీకు చెబుతుంటారు. తొందరపాటులో మీరు కొనేస్తారు. ఇలా జరగకూడదంటే, అనుకున్న బడ్జెట్​పైనే మీరు నిలబడాలి.

2. ఎలాంటి కారు కావాలి?- మార్కెట్​లో పెట్రోల్​, డీజిల్​, సీఎన్జీ, హైబ్రీడ్​, ఎలక్ట్రిక్​ వంటి ఆప్షన్స్​ ఉన్నాయి. మొదటి కారు కొనే ముందు అసలు మీ అవసరానికి ఏది సూట్​ అవుతుందో చూసుకోండి. డీజిల్​ ఆప్షన్​ కనుమరుగైపోతున్న కాలం ఇది. పెట్రోల్​ ధరలు ఎక్కువగానే ఉంటున్నాయి. రోజూ ఎక్కువ దూరాలు ప్రయాణిస్తారనిపిస్తే సీఎన్జీ ప్రిఫర్​ చేయొచ్చు అని నిపుణులు అంటున్నారు. పెట్రోల్​ కన్నా దీని మెయిన్​టైనెన్స్​, ఫ్యూయెల్​ ధరలు తక్కువ! ఇక మార్కెట్​లో ఇప్పుడు ఎలక్ట్రిక్​ వాహనాలకు సూపర్​ డిమాండ్​ కనిపిస్తోంది. మొదట్లో కాస్త ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చినా, లాంగ్​ రన్​లో ఈవీలతో ఖర్చులు చాలా తక్కువగా ఉంటుండటం ఇందుకు కారణం. మీ దగ్గర ఛార్జింగ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ మెరుగ్గా ఉంటే ఎలక్ట్రిక్​ కారును ప్రిఫర్​ చేయొచ్చు.

3. బాడీ టైప్​ ఏది ఇష్టం- మార్కెట్​లో హ్యాచ్​బ్యాక్​, సెడాన్​, ఎస్​యూవీ, ఎంపీవీ, క్రాసోవర్​, కూపే ఎస్​యూవీ వంటి అనేక ఆప్షన్స్​ ఉన్నాయి. మీకు, మీ కుటుంబానికి సరిపోయే విధంగా ఉండే ఆప్షన్​ని ఎంచుకోండి. హ్యాచ్​బ్యాక్​, చిన్న ఎస్​యూవీలకు పెద్దగా స్పేస్​ అవసరం లేదు. పెద్ద ఎస్​యూవీలు, సెడాన్​లకు కాస్త స్పేస్​ అవసరం పడుతుంది. సెడాన్​తో లగ్జరీ ఫీల్​ వస్తే, ఎస్​యూవీతో అగ్రెసివ్​, బోల్డ్​ లుక్​ వస్తుంది.

4. ఇంజిన్​- ఇది కారుకు గుండె లాంటిది. పవర్​, టార్క్​ ఎక్కువ ఉన్న ఇంజిన్​ ఎంచుకుంటే, అప్​లో మూమెంట్​ బాగుంటుంది, బండి స్పీడ్​ ఎక్కువ ఉంటుంది. తక్కువ కెపాసిటీ ఇంజిన్​లో మైలేజ్​ ఎక్కువగా ఉంటుంది అన్నది నిజం కాదు. అన్ని సమస్యలను తీర్చేందుకు ఈ మధ్య టర్బోఛార్జ్​డ్​ ఇంజిన్​లు వస్తున్నాయి.

5. ట్రాన్స్​మిషన్​- మొదటి కారు కొనే ముందు కచ్చితంగా చూడాల్సిన విషయాల్లో ట్రాన్స్​మిషన్​ ఒకటి. మీకు మేన్యువల్​ కారు కావాలా? లేక ఆటోమెటిక్​ కావాలా? అన్నది తెలుసుకోండి. నగరాల్లో జీవిస్తుంటే, ట్రాఫిక్​ సమస్యలతో ఇబ్బంది పడకూడదంటే ఆటోమెటిక్​ బెస్ట్​! కానీ డ్రైవింగ్​ ఫీల్​ కోసం చాలా మంది మేన్యువల్​ని ప్రిఫర్​ చేస్తుంటారు.

6 క్యాబిన్​ ఫీచర్స్​- ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే, అంత ఎక్కువ కంఫర్ట్​ లభిస్తుంది. ఇటీవలి కాలంలో కారు క్యాబిన్​లో అనేక కంఫర్ట్​ ఫీచర్స్​ వస్తున్నాయి. అవన్నీ కావాలనుకుంటే టాప్​-ఎండ్​ మోడల్​ ఎంచుకోవాలి. కొన్నింటిని, అవసరం లేని ఫీచర్స్​ని వదులుకోగలిగితే, వాల్యూ ఫర్​ మనీ వేరియంట్లను ప్రిఫర్​ చేయొచ్చు. ఫీచర్స్​ అనేవి మీ ఇష్టాలపై ఆధారపడి ఉంటాయి. కొన్ని కచ్చితంగా ఉండాలి, కొన్ని అవసరం లేదు.

7. సేఫ్టీ ఫీచర్స్​- మొదటి కారు కొనే ముందు ఏం చూసినా, చూడకపోయినా.. సేఫ్టీ ఫీచర్స్​ని కచ్చితంగా చూడాలి. ఇది చాలా చాలా ముఖ్యం. కుంటుబంతో లేదా ఫ్రెండ్స్​తో లేదా సొంతంగా ప్రయాణిస్తున్నా.. మన భద్రత చాలా కీలకం. ఎయిర్​బ్యాగులు,ఏడీఏఎస్​ ఫీచర్స్​ని చెక్​ చేయండి. ఇతర కార్లతో కంపేర్​ చేయండి.

8. ఓనర్​షిప్​ కాస్ట్​- రీసేల్​ వాల్యూ- ఈ రెండూ చాలా ముఖ్యం. కారు కొనడమే కాదు, దాని తర్వాత, దాని మెయిన్​టైనెన్స్​కి ఎంత ఖర్చు అవుతోందో కూడా లెక్కేసుకోవాలి. రెండు కార్లను కంపేర్​ చేసే సమయంలో దీనిని కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాదు, బండి రీసేల్​ వాల్యూ ఎంత ఉంటుంది అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇది కారు మేన్యుఫ్యాక్చరర్​ బట్టీ మారుతుంటుంది.

9. టెస్ట్​ డ్రైవ్​- చివరిగా.. కారు కొనే ముందు షోరూమ్​కి వెళ్లి కచ్చితంగా టెస్ట్​ డ్రైవ్​ చేయాలి. మీరు కంఫర్ట్​గా ఉన్నారా? లేదా? అనేది చూసుకోవాలి. ఆ కారు మీకు సూట్​ అవుతుందా? లేదా? అనేది తెలుసుకోవాలి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం