Podcast : పాడ్‌కాస్ట్‌లను లైట్ తీసుకోవద్దు.. దీని ద్వారా కూడా పైసల్ వస్తాయ్..
Podcast : ఇటీవలి కాలంలో పాడ్‌కాస్ట్‌లు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా వీటివైపు మెుగ్గుచూపుతున్నారు. జర్నలిస్టులు కూడా పాడ్‌కాస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పాడ్‌కాస్ట్‌తో ఇటు ఫేమ్, అటు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. దీనిపై నిపుణుల అభిప్రాయం ఏంటో చూద్దాం..
బ్లాగ్స్(Blogs), వ్లాగ్స్(vlogs) తర్వాత ఇప్పుడు ఎక్కడ చూసినా పాడ్‌కాస్ట్‌లే దర్శనమిస్తున్నాయి. ఒక విషయంపై ఆడియో లేదా వీడియో ఎపిసోడ్స్‌నే పాడ్‌కాస్ట్ అంటారు. పాడ్‌కాస్ట్‌లో మీరు కావాలంటే ఒక్కరే ఎపిసోడ్స్‌ని రికార్డ్ చేయవచ్చు. లేదా ఆ విషయంలో ప్రావీణ్యం కలిగిన వేరే వాళ్ళతో కూడా మాట్లాడి రికార్డ్ చేసుకోవచ్చు. పాడ్‌కాస్ట్ ఎలా మొదలు పెట్టాలి?పాడ్‌కాస్ట్ టాపిక్ లేదా నీష్‌ని ఏ విధంగా ఎంచుకోవాలి? దాని నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవాలి? అనేది తెలుసుకుందాం.
ముందుగా పాడ్‌కాస్ట్‌ను ఎలా మొదలు పెట్టాలి అంటే ఒక టాపిక్ లేదా నీష్‌ని ఎంచుకోవాలి. నీష్ అంటే ఒక నిర్ధారితమైన టాపిక్. అది ఏదైనా కావచ్చు. సినిమాలు, చదువు, ఆధ్యాత్మికమైన అంశాలు.. ఇలా ఏదైనా కావచ్చు. కానీ ఈ నీష్ ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. జనాలకు నచ్చే వాటికంటే మీకు ప్రావీణ్యం, మక్కువ ఉన్న నీష్‌ని ఎంచుకోవడం మంచిది. అలా అయితేనే మీరు దీర్ఘకాలికంగా పాడ్‌కాస్ట్‌లు చేయగలుగుతారు. ఎక్కువ ఎపిసోడ్స్ చేయగలుగుతారు.
మీరు నీష్‌ను ఎంచుకున్నాక వాటిని అప్లోడ్ చేసి ప్లాట్‌ఫామ్‌ని ఎంచుకోవాలి. ప్రస్తుతం పాడ్‌కాస్ట్‌ను అప్లోడ్ చేయడానికి యూట్యుబ్, ఇన్‌స్టాగ్రామ్, స్పాటిఫైవంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మీ పాడ్‌కాస్ట్‌కి ప్రేక్షకులు, అభిమానులు పెరిగేకొద్దీ దాని నుండి మీరు డబ్బులు సంపాదించే మార్గాలు కూడా పెరుగుతాయి. వాటిలో కొన్ని మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం -
- బ్రాండ్ స్పాన్సర్‌షిప్ : ఇందులో మీరు కంపెనీలు, బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ పాడ్‌కాస్ట్ మధ్యలో ప్రకటన ఇచ్చి డబ్బులు సంపాదించవచ్చు.
- అఫిలియేట్ మార్కెటింగ్ : మీరు అమెజాన్/ఫ్లిప్‌కార్ట్‌లాంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లోని వస్తువులని ప్రచారం చేస్తూ అవి అమ్మితే కమిషన్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.
- మెర్చండైజ్ అమ్మడం : మీరు మీ సొంత టీ షర్ట్స్, కాఫీ కప్స్, బ్యాగ్స్ వంటివి అమ్మి, డబ్బులు సంపాదించవచ్చు.
- కోర్సులని అమ్మడం : ప్రేక్షకులకు అవసరమయ్యే విషయాలపై కోర్సులు తయారు చేసి, వాటి అమ్మకాల ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు.
- పుస్తకాలు రాసి అమ్మడం : మీకు ఉన్న నైపుణ్యాన్ని, అనుభవాలని పంచుకుంటూ పుస్తకాలను రాసి వాటిని అమ్మవచ్చు.
- మెంబర్‌షిప్ : మీరు తరచుగా చేయని కంటెంట్‌ని ఎక్స్‌క్లూజివ్‌గా మెంబర్‌షిప్స్‌గా అందచేయవచ్చు. దానికి ఫీజు వసూలు చేయవచ్చు.
- ప్రకటనలు : కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో మీకు వచ్చే వ్యూయర్షిప్ యాడ్స్ నుంచి కూడా మంచి ఆదాయం సంపాదించవచ్చు.
ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. మీరు పాడ్‌కాస్ట్ చేయడంలో ఎదిగే కొద్దీ, ఇంకా ఎన్నో అవకాశాలు వస్తాయి. ఈ మేరకు వంశీ భవాని అనే పాడ్‌కాస్టర్ తన అభిప్రాయాలను HT Teluguతో పంచుకున్నారు. ఏడున్నర ఏళ్ల నుంచి కోడింగ్, కెరియర్స్ గురించి సమాచారాన్ని ఇస్తూ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. వంశీ భవాని పాడ్ కాస్ట్ యూట్యూబ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
టాపిక్