Stock market: ఐదు నెలల్లో 2 కోట్ల డీమ్యాట్ ఖాతాలు; స్టాక్ మార్కెట్ వైపు భారతీయుల చూపు
Stock market: గత దశాబ్దంలో భారతీయ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆరు రెట్లు పెరిగింది. అదే సమయంలో భారతీయ కుటుంబాలలో ఐదవ వంతు, అంటే ప్రతీ ఐదు కుటుంబాలలో ఒకటి ఇప్పుడు స్టాక్ మార్కెట్లతో ముడిపడి ఉన్నాయి. ఈ వివరాలను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నివేదిక తెలిపింది.
Stock market: గత దశాబ్దంలో భారతీయ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆరు రెట్లు పెరిగిందని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నివేదిక తెలిపింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులతో లింక్ అయిన ఖాతాల సంఖ్య 21 కోట్లు దాటిందని, 18 కోట్లకు పైగా డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. అందులో రెండు కోట్ల మంది ఇన్వెస్టర్లు కేవలం గత ఐదు నెలల్లోనే చేరడం గమనార్హం. ఒక్క 2024 సంవత్సరంలోనే 2.32 కోట్ల మంది కొత్త ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు.
ఎంక్యాప్ 6 రెట్లు పెరిగింది..
"గత దశాబ్ద కాలంలో భారతీయ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 6 రెట్లు పెరిగింది. భారతీయ కుటుంబాలలో ఐదవ వంతు స్టాక్ మార్కెట్లతో లింక్ అయి ఉంది" అని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నివేదిక తెలిపింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా భారతీయ కుటుంబాలకు గణనీయమైన సంపద సృష్టి కూడా జరిగిందని ఈ నివేదిక హైలైట్ చేసింది. గత ఐదేళ్లలో భారత ఈక్విటీల్లో గృహ సంపద రూ.40 లక్షల కోట్లకు పైగా పెరిగిందని, ఇది గత మూడేళ్లలో రూ.28 లక్షల కోట్లకు పైగా పెరిగిందని పేర్కొంది. ఒక్క 2024లోనే గృహ ఇన్వెస్టర్లు రూ.13.2 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు. డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో వ్యక్తిగత హోల్డింగ్స్ లో వార్షిక మార్పుల ఆధారంగా ఈ అంచనా వేశారు.
ఐదేళ్లలో రూ.40 లక్షల కోట్లు
గత ఐదేళ్లలో భారత ఈక్విటీల్లో గృహ సంపద రూ.40 లక్షల కోట్లకు పైగా పెరిగిందని, గత మూడేళ్లలో రూ.28 లక్షల కోట్లకు పైగా పెరిగిందని ఎన్ఎస్ఈ తెలిపింది. నిర్వహణలోని ఈక్విటీ ఆస్తుల్లో ఎంత నిష్పత్తిలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్స్ ఉంటాయో అదే నిష్పత్తిలో వ్యక్తుల వద్ద ఉంటాయని నివేదిక భావించింది. మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భారత ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లపై విశ్వాసం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 2024 నాటికి, వ్యక్తిగత పెట్టుబడిదారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారత స్టాక్ మార్కెట్లో 17.6 శాతం వాటాను కలిగి ఉన్నారని ఎన్ఎస్ఈ పేర్కొంది. ఇది విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల వాటాకు దాదాపు సమానం.
ఎఫ్పీఐ లకు గట్టి పోటీ
ఎఫ్పీఐలు నిధులను ఉపసంహరించుకుంటున్నప్పటికీ, బలమైన దేశీయ ప్రవాహాలు భారతీయ స్టాక్ మార్కెట్ ను స్థిరంగా ఉంచాయని నివేదిక పేర్కొంది. మార్కెట్లోకి ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ప్రవేశించడం, సంపద సృష్టి కొనసాగుతుండటంతో ఈక్విటీల్లో భారతీయ కుటుంబాల భాగస్వామ్యం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.