EPFO alert: ఉద్యోగులకు షాక్; గ్రాట్యుటీ పరిమితి పెంపు అమలుపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం
EPFO alert:ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(EPFO) బుధవారం ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. డీఏ, డీఆర్ పెంపుతో పాటు ప్రకటించిన గ్రాట్యుటీ పరిమితి పెంపు అమలును వాయిదా వేస్తున్నామని ఈపీఎఫ్ఓ ప్రకటించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ ను కేంద్ర ప్రభుత్వం 4% పెంచింది.
EPFO gratuity alert: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ, డీఆర్ ను 4% పెంచింది. దాంతో, వారి డీఏ,లేదా డీఆర్ 46% నుంచి 50 శాతానికి పెరిగింది. అయితే, డీఏ తో పాటు గ్రాట్యుటీ కూడా ఆ మేరకు పెరుగుతుంది. తాజాగా, డీఏతో పాటు పెరగిన గ్రాట్యుటీ పరిమితి పెంపు అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రకటించింది. అయితే, ఈ నిలుపుదల తాత్కాలికమేనని ప్రకటించింది. ఈ సర్క్యులర్ పై అదనపు సెంట్రల్ పీఎఫ్ కమిషనర్ ఎస్కే సుమన్ సంతకం చేశారు. ఈపీఎఫ్ఓ మంగళవారం ఈ సర్క్యులర్ ను విడుదల చేసింది.
డీఏతో పాటు..
జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అదనపు కరువు భత్యం (DA), డియర్నెస్ రిలీఫ్ (DR) విడుదలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. డీఏను మూలవేతనం లేదా పెన్షన్లో 46 శాతం నుంచి 50 శాతానికి పెంచారు. డీఏ పెరగడంతో ఇంటి అద్దె అలవెన్స్ (HRA), గ్రాట్యుటీ సీలింగ్, హాస్టల్ సబ్సిడీ వంటి ఇతర అలవెన్సులు కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఈ అలవెన్సులు డీఏతో ముడిపడి ఉంటాయి. డీఏ పెరిగే కొద్దీ అవి కూడా పెరుగుతాయి. డీఏను 50 శాతానికి పెంచిన తర్వాత గ్రాట్యుటీ పరిమితిని కూడా రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు.
ఎన్నికల ముందు..
సార్వత్రిక ఎన్నికలకు ముందు డీఏ, డీఆర్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల దాదాపు 49 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 67.9 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.మొత్తం ఖజానాపై సుమారు రూ.12,868.72 కోట్ల భారం పడనుంది.ఏడో కేంద్ర వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఈ పెంపు జరిగింది.
ఎన్ పీఎస్ కు సంబంధించిన అప్ డేట్
ఎన్ పీఎస్ కు సంబంధించి ఈపీఎఫ్ వో కొత్త ఈమెయిల్ ఐడీని ప్రకటిస్తూ సర్క్యులర్ ను విడుదల చేసింది. కొత్త ఇమెయిల్ ఐడి isepfohq.nps@epfindia.gov.in. ఈ మేరకు 2024 మే 3న విడుదల చేసిన సర్క్యులర్ లో ఈపీఎఫ్ఓ పేర్కొంది. హెడ్ ఆఫీస్ కు సంబంధించిన ఎన్ పీఎస్ కు సంబంధించిన ఏవైనా రిఫరెన్స్ లు ఉంటే ఇకపై సదరు ఇమెయిల్ ఐడీకి పంపాలని సర్క్యులర్ లో పేర్కొన్నారు. గతంలో పంపిన పెండింగ్ రిఫరెన్స్ లను కూడా కొత్త ఈమెయిల్ ఐడీకి పంపాల్సి ఉంటుందని పెన్షన్ ఫండ్ బాడీ పేర్కొంది.