ఎన్‌కోర్–ఆల్కమ్ ప్లాంట్ సిద్ధం.. అల్యూమినియం డోర్స్, విండోస్ తయారీలో దేశంలోనే అతి పెద్ద ప్లాంట్
encore-alcom: ఎన్‌కోర్-ఆల్కమ్ సంస్థ అల్యూమినియం డోర్స్, విండోస్ తయారీలో దేశంలోనే అతిపెద్ద ప్లాంట్‌ను సూరత్‌లో ప్రారంభించింది. భారత్‌లో తొలి ఆటో రోబోటిక్ ఫెసిలిటీ సైతం ఇదేనని, దశలవారీగా రూ. 60 కోట్లు వెచ్చించామని ఎన్‌కోర్ ఉడ్‌క్రాఫ్ట్స్ ఫౌండర్ అవుతు శివ కోటి రెడ్డి వెల్లడించారు.
అల్యూమినియం తలుపులు, కిటికీల తయారీ రంగంలో అగ్రశ్రేణిలో ఉన్న హైదరాబాద్ సంస్థ ఎన్‌కోర్-ఆల్కమ్ గుజరాత్‌లోని సూరత్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ప్లాంట్‌ను ప్రారంభించింది. 1,84,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ భారతదేశంలోనే అతిపెద్ద అల్యూమినియం తలుపులు, కిటికీల తయారీ కేంద్రంగా నిలిచింది.

ఎన్‌కోర్ వుడ్‌క్రాఫ్ట్స్ ఫౌండర్, సీఎండీ అవుతు శివ కోటి రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ఇది భారతదేశంలో తొలి ఆటోమేటిక్ రోబోటిక్ ఫెసిలిటీ" అని తెలిపారు. ఈ అత్యాధునిక ప్లాంట్ ఏర్పాటుకు రూ. 60 కోట్లు దశలవారీగా ఖర్చు చేసినట్లు తెలిపారు.
"జర్మనీ సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన ఈ ఫెసిలిటీ రోజుకు 35,000 చదరపు అడుగుల తయారీ సామర్థ్యం కలిగి ఉంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జనవరి 24 నుండి జరిగే ఏస్‌టెక్ ట్రేడ్ ఫెయిర్‌లో మా అత్యాధునిక, వినూత్న ఉత్పత్తులను ప్రదర్శిస్తాం. యూఎస్‌ఏ, యూకే, దుబాయ్, ఐరోపా దేశాలలో విజయవంతంగా ప్రాజెక్టులను పూర్తి చేసిన మా సంస్థ ప్రపంచ దిగ్గజ సంస్థలకు ధీటుగా సొంత పరిశోధన అభివృద్ధి విభాగం ద్వారా, ఇటలీ డిజైనర్ల సహకారంతో ఉత్పత్తులను తయారు చేస్తోంది. మేం ఇప్పటికే 3,500 కంటే ఎక్కువ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసాం" అని వివరించారు.
రికార్డులను సృష్టిస్తున్న ఎన్‌కోర్
ఎన్‌కోర్-ఆల్కమ్ తయారు చేసిన 20 అడుగుల స్లైడింగ్ డోర్ భారతదేశంలోనే అతిపెద్దది అని ఆల్కమ్ డైరెక్టర్ జయంతి భాయ్ పటోలా తెలిపారు. "3.6 టన్నుల బరువున్న ఈ స్లైడింగ్ డోర్‌ను కూడా మేము ఒక ప్రాజెక్టులో అమర్చాం. మూడేళ్ల పిల్లలు కూడా సులభంగా తెరవగలిగే విధంగా రూపొందించడం మా ప్రత్యేకత. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో మాకు వినియోగదారులు ఉన్నారు. కొత్తగా ఏర్పాటు అవుతున్న రెస్టారెంట్లు, కాఫీ షాపులు, ఔట్‌లెట్లలో మా తయారీ తలుపులు, కిటికీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి" అని వివరించారు.
త్వరలోనే కొత్త మార్కెట్లలోకి
అత్యంత నాణ్యమైన రోలర్లను స్లోవేకియా నుండి దిగుమతి చేసుకుంటున్నట్లు శివ కోటి రెడ్డి తెలిపారు. "అల్యూమినియం తలుపులు, కిటికీలు, రైలింగ్స్, గ్లాస్ ఫసాడ్స్‌లను మేం తయారు చేస్తున్నాం. ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాలలో త్వరలోనే మేం మా ఉత్పత్తులను విడుదల చేయనున్నాం. భవిష్యత్తు అంతా మెటల్ డోర్లదే..’ అని వివరించారు.
‘కొత్త ప్లాంట్ ఏర్పాటుతో నేరుగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. సూరత్‌లో ఇప్పటికే 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 10,000 చదరపు అడుగుల తయారీ సామర్థ్యం గల ప్లాంట్ ఉంది. పోటీ సంస్థలతో పోలిస్తే మా ఉత్పత్తులు 300 శాతం మెరుగ్గా ఉంటాయి. వినియోగదారుడి కోరిక మేరకు ఆర్కిటెక్చరల్ ఉత్పత్తులను తయారు చేయడం మా ప్రత్యేకత" అని చెప్పారు.
ఉత్పత్తులే బ్రాండ్ అంబాసిడర్లు
ఎన్‌కోర్ ఇప్పటికే వుడ్ డోర్ల తయారీలో ఉంది. దక్షిణాదిలో ఎన్‌కోర్ బ్రాండ్ పేరుతోనూ, ఉత్తరాదిలో ఆల్కమ్ బ్రాండ్ పేరుతోనూ కార్యకలాపాలు సాగిస్తున్నామని శివ కోటి రెడ్డి తెలిపారు.
"చైనా, తైవాన్, ఇటలీ వంటి దేశాల మార్కెట్లను అధ్యయనం చేసాం. అక్కడి ఉత్పత్తులకు ధీటుగా వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా మేం సేవలు అందిస్తున్నాం. మా ఉత్పత్తులే బ్రాండ్ అంబాసిడర్లు. తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలను వివిధ దేశాల నుండి ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని దిగుమతి చేసుకుంటున్నాం…’ అని వివరించారు.
‘ఆల్కమ్ తొమ్మిది సంవత్సరాల క్రితమే సూరత్‌లో అల్యూమినియం తలుపులు, కిటికీల తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది. 380 మంది సిబ్బంది ఉన్నారు. సూరత్‌లోని కొత్త ప్లాంట్ అందుబాటులోకి రావడంతో ఎన్‌కోర్ బ్రాండ్ అల్యూమినియం తలుపులు, కిటికీలను దక్షిణాదిలో ప్రవేశపెట్టాం. హివిక్ పూజా సేల్స్ హార్డ్ వేర్ భాగస్వామిగా ఉంది" అని తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్