డబ్బు అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. కానీ అవసరం వస్తే మాత్రం సేవింగ్స్ అన్ని ఖాళీ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత మనం ఆర్థికంగా ఇబ్బంది పడతాము. ఈ పరిస్థితుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడాలంటే అందుకే ఒక ఎమర్జెన్సీ ఫండ్‌ని ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? ఫండ్‌ని ఎలా నిర్మించుకోవాలి? వంటి కొన్ని వివరాలు, టిప్స్‌ని ఇక్కడ తెలుసుకోండి..
ఎమర్జెన్సీ ఫండ్‌కి అర్థం దాని పేరులోనే ఉంది! అత్యవసర పరిస్థితుల్లో మనకు ఆర్థికంగా ఉపయోగపడేందుకు, మన సేవింగ్స్ నుంచి కొంతకొంత ముందు నుంచే దాచి, పోగు చేసిన మొత్తాన్ని ఎమర్జెన్సీ ఫండ్ అంటారు.
ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు పోతాయో తెలియని కాలంలో మనం బతుకుతున్నాము. అందుకే మనల్ని మనం ఆర్థికంగా కాపాడుకునేందుకు ఈ ఎమర్జెన్సీ ఫండ్ పనికొస్తుంది. మూడు నుంచి ఆరు నెలల వరకు అవసరమైన ఖర్చులను పొదుపు చేయాలని ఆర్థిక నిపుణులు, మార్కెట్ అనుభవజ్ఞులు సూచిస్తున్నారు. ఉదాహరణకు నెలకు రూ.50,000 ఖర్చు చేసే కుటుంబం రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఎమర్జెన్సీ కార్పస్ కింద కేటాయించాలి.
ఎమర్జెన్సీ ఫండ్‌తో పాటు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇంకా మంచిది! వైద్య ఖర్చుల కోసం ఎమర్జెన్సీ ఫండ్ నుంచి ఎక్కువగా తీయాల్సిన అవసరం ఉండదు. మీ మీద ఒత్తిడి పడదు.
ఎమర్జెన్సీ ఫండ్ నిర్మించడానికి ఒక సగటు భారతీయుడికి సుమారు 15 నెలలు పడుతుంది. ఈ ఫండ్ సాధారణంగా వారి నెలవారీ ఆదాయానికి మూడు రెట్లు సమానంగా ఉండాలి.
అందువల్ల నేటి అస్థిర ఆర్థిక నేపధ్యంలో, అత్యవసర నిధిని నిర్మించడం, కొనసాగించడం ఇకపై ఆప్షన్ కాదు. కచ్చితంగా చేయాల్సిన పని!
అందుకే ఈ అంచనాలను చేరుకోవడానికి, మీరు క్రమశిక్షణతో కూడిన పొదుపు అలవాటును అవలంబించాలి. చిన్నగా ప్రారంభించడం, స్థిరంగా ఉండటం, మరింత సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తు కోసం ప్రాథమిక ఆర్థిక స్థితిస్థాపకతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సమాచారంతో కూడిన ఆర్థిక ఎంపికలు చేయాలి.
సంబంధిత కథనం