టెస్లా భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడంలో ఆసక్తి చూపించడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి చెప్పారు. షోరూమ్‌లను తెరవడంపై మాత్రమే టెస్లాకు ఆసక్తి ఉందని అన్నారు. దేశంలో ఈవీల తయారీని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కంపెనీలకు రూ.4,150 కోట్ల విలువైన భారీ పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. ఇది ప్రపంచ వాహన తయారీదారులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే దీనిపై తాజాగా కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి కుమారస్వామి మాట్లాడారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడంలో టెస్లాకు ఆసక్తి లేదని, షోరూమ్‌లను ఏర్పాటు చేయడంపై మాత్రమే ఆసక్తి చూపుతోందని అన్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే టెస్లా కార్ల ధర ఎక్కువగా ఉంటుంది. తక్కువ ధరకే అధిక నాణ్యత గల ఎలక్ట్రిక్ కారు లభిస్తుందని ఆశించిన వారికి ఇది చేదు వార్త అవుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని టెస్లా కంపెనీ భారత్‌లో తయారీ ప్లాంట్ పెట్టడాన్ని వ్యతిరేకించారు.
మేక్ ఇన్ ఇండియా కింద భారతదేశంలో కార్లను అసెంబుల్ చేయడం లేదా తయారు చేయాలనే ప్రణాళికను విరమించుకోవాలని ట్రంప్ సూచించారు. భారతదేశంలో తయారీ స్థావరాన్ని ఏర్పాటు చేయడం చాలా అన్యాయం అని అన్నారు. టెస్లా ఇప్పటికే భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి షోరూమ్ స్థానాలను సంపాదించింది. 25 కంటే ఎక్కువ మంది ఉద్యోగుల నియామకానికి ప్రకటన చేసింది.
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి రూ.4,150 కోట్ల పెట్టుబడి అవసరమని కేంద్రం చెబుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలను రోడ్లపైకి తీసుకురావడానికి, దేశంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకంలో భాగంగా పెట్టుబడి పెట్టిన కంపెనీలకు దిగుమతి సుంకాల్లో కూడా కోత ఉంటుంది.
ఈ ప్రాజెక్ట్ కోసం అప్లికేషన్ పోర్టల్ త్వరలో తెరుస్తారు. ఇది ప్రారంభ దశలో 120 రోజులు తెరిచి ఉంటుంది. భవిష్యత్తులో అవసరమైనప్పుడు మంత్రిత్వ శాఖ దానిని తిరిగి తెరవవచ్చు. ఈ పథకం కింద దరఖాస్తులు మార్చి 15, 2026 వరకు స్వీకరిస్తారు.