Elon Musk Guinness World Record: తగ్గేదేలే.. ఇందులోనూ మస్క్ దే గిన్నిస్ రికార్డ్
Elon Musk Guinness World Record: ట్విటర్ కొనుగోలు, తదనంతర పరిణామాలతో నిత్యం వార్తల్లో ఉంటున్న టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్.. తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వ్యక్తిగత సంపదను రికార్డు సమయంలో, రికార్డు స్థాయిలో కోల్పోయి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు.
Elon Musk Guinness World Record: ప్రపంచ వ్యాప్తంగా నిత్యం వార్తల్లో ఉండే ప్రముఖుడు టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల చీఫ్ ఎలాన్ మస్క్. తాజాగా, వ్యక్తిగత సంపదను రికార్డు సమయంలో, రికార్డు స్థాయిలో కోల్పోయి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు.
Elon Musk Guinness World Record: 180 బిలియన్లు లాస్
నవంబర్ 2021 నుంచి ఎలాన్ మస్క్ తన వ్యక్తిగత సంపదలో సుమారు 180 బిలియన్ డాలర్ల (18 వేల కోట్ల డాలర్లు) ను కోల్పోయారు. అంటే, మన కరెన్సీలో సుమారు 14, 58,000 కోట్ల రూపాయలు. గతంలో అత్యధికంగా వ్యక్తిగత సంపదను కోల్పోయిన రికార్డు సాఫ్ట్ బ్యాంక్ కు చెందిన మసయోషి పేరుపై ఉండేది. 2000 సంవత్సరంలో ఆయన 58.6 బిలియన్ డాలర్లను కోల్పోయి గిన్నిస్ రికార్డు సృష్టించారు. డాట్ కామ్ సంక్షోభం కారణంగా 2000 సంవత్సరం ఫిబ్రవరిలో 78 బిలియన్ డాలర్లుగా ఉన్న మసయోషి సంపద.. అదే సంవత్సరం జులై నాటికి 19.4 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఆ రికార్డును తాజాగా, ఎలాన్ మస్క్ బద్ధలు కొట్టి, గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. ఇంతవరకు చరిత్రలో ఏ వ్యక్తి కూడా ఈ స్థాయిలో వ్యక్తిగత సంపదను కోల్పోలేదని గిన్నిస్ బుక్ స్పష్టం చేసింది.
Elon Musk Guinness World Record: 320 డాలర్లనుంచి..
నవంబర్ 2021 లో 320 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం జనవరి, 2023లో మస్క్ వ్యక్తిగత సంపద 138 బిలియన్ డాలర్లుగా ఉంది. టెస్లా స్టాక్స్ విలువ క్రమంగా తగ్గుతుండడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి టెస్లా స్టాక్ వాల్యూ తగ్గుతూ వస్తోంది. 2022 సంవత్సరంలో మొత్తంగా టెస్లా స్టాక్ విలువ ఏకంగా 65% తగ్గింది. నిర్వహణ ఖర్చులు పెరగడం, ఎలక్ట్రిక్ వాహన రంగంలో పోటీ భారీగా పెరగడం, అంతర్జాతీయంగా ముంచుకు వస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు.. టెస్లా షేర్ల విలువ కుప్పకూలడానికి కారణాలుగా భావిస్తున్నారు. అదీకాక, ట్విటర్ కొనుగోలు చేసిన తరువాత, ఆ భారీ మొత్తాన్ని చెల్లించడం కోసం మస్క్.. తన టెస్లా షేర్లను భారీగా అమ్మనున్నారన్న వార్తల నేపథ్యంతో కూడా టెస్లా షేర్లు కుప్పకూలాయి.
Elon Musk Guinness World Record: రెండో అత్యంత సంపన్నుడు
వ్యక్తిగత సంపదను కోల్పోవడం ద్వారా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడనే హోదా ను కూడా మస్క్ కోల్పోయారు. ఆ హోదా ను లగ్జరీ గూడ్స్ సంస్థ LVMH (Louis Vuitton Moët Hennessy) వ్యవస్థాపకుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ కు మస్క్ కోల్పోయారు. బెర్నార్డ్ ప్రస్తుత సంపద విలువ 190 బిలియన్ డాలర్లు. విశేషం ఏంటంటే, ఇంత పెద్ద మొత్తంలో సంపదను కోల్పోయిన తరువాత కూడా.. ఎలాన్ మస్క్ ప్రపంచంలో రెండు అత్యంత సంపన్నుడిగా ఉన్నాడు. అలాగే, ఇప్పటికీ టెస్లా ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ కంపెనీగా ఉంది. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ 100 బిలియన్ డాలర్లు.