Elon Musk: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా ఉన్న ట్రంప్ బృందంలో చేరి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఎలన్ మస్క్ తాజాగా టెక్సాస్ లో తన రియల్ ఎస్టేట్ వెంచర్ తో మరోసారి వార్తల్లో నిలిచాడు.11 మంది పిల్లలు, వారి తల్లులు సహా తన పెద్ద కుటుంబం కోసం సుమారు రూ. 300 కోట్లతో 14,400 చదరపు అడుగుల విశాలమైన భవనాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఎస్టేట్ టుస్కాన్ ఇన్ స్పైర్డ్ డిజైన్, మస్క్ పెద్ద కుటుంబానికి తగినంత స్థలాన్ని కలిగి ఉంది. ఇందులో అతని మాజీ పార్ట్ నర్స్, వారి పిల్లలు ఉంటారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది కో-పేరెంటింగ్ లో కొత్త ట్రెండ్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఎలన్ మస్క్ 35 మిలియన్ డాలర్ల కాంపౌండ్ ను కొనుగోలు చేసినట్లు ఎలాన్ మస్క్ సన్నిహిత వర్గాలు న్యూయార్క్ టైమ్స్ కు వెల్లడించాయి. ఈ ప్రాపర్టీ పక్కనే ఆయన కొనుగోలు చేసిన ఆరు పడక గదుల భవనం కూడా ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. మస్క్ తన పిల్లలు, వారి తల్లులను దగ్గరదగ్గరే నివసించాలని కోరుకుంటున్నట్లు సమాచారం. దీనివల్ల తన పిల్లలు అందరూ దాదాపు ఒకే దగ్గర పెరుగుతారని, దాంతో వారి మధ్య అనుబంధం పెరుగుతుందని మస్క్ భావిస్తున్నారట. అలాగే, తనకు కూడా వారితో ఎక్కువ సమయం గడపడానికి వీలు కలుగుతుందని ప్లాన్ చేశారట.
ఇదిలావుండగా, మస్క్ ఆస్టిన్ లోని తన కొత్త ఆస్తికి కేవలం పది నిమిషాల దూరంలో ఉన్న మరో భవనంలో నివసిస్తున్నారు. నివేదికల ప్రకారం, మస్క్ బ్రెయిన్ టెక్నాలజీ కంపెనీ న్యూరాలింక్ లో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న శివోన్ జిలిస్ అనే తల్లి ఇప్పటికే తన పిల్లలతో కలిసి ఒక ఇంటికి వెళ్లిపోయింది. మరోవైపు, మస్క్ ముగ్గురు పిల్లలకు తల్లి అయిన క్లైర్ బౌచర్ కూడా మస్క్ కొత్తగా కొన్న ఇంటిలోకి వెళ్లనున్నారు. అయితే, ఆమె ప్రస్తుతం మస్క్ తో సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్నారు.
టెస్లా స్థాపకుడు ఎలాన్ మస్క్ కు 11 మంది పిల్లలు ఉన్నారని చెబుతారు. అయితే కొందరు మాత్రం 11 కాదు, 12 మంది పిల్లలు అని చెబుతున్నారు. వీరిలో ముగ్గురు వేర్వేరు భాగస్వాముల ద్వారా జన్మించిన వారు ఉన్నారు. ఆ ముగ్గురిలో ఇద్దరితో మస్క్ విడిపోయారు. మరొకరితో కలిసి ఉంటున్నారు. శివోన్ జిలిస్ కు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. వారు స్ట్రైడర్, అజూర్. ఈ సంవత్సరం మొదట్లో జన్మించిన మరో బిడ్డ పేరును ఇంకా వెల్లడించలేదు. మస్క్ తో సింగర్ గ్రిమ్స్ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. వారు ఎక్స్ ఏఈ ఏ-12 అనే 4 ఏళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఎక్సా డార్క్ సిడెరెల్, టెక్నో మెకానిక్స్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నారు. పిల్లల సంరక్షణకు సంబంధించి మస్క్, గ్రిమ్స్ ఇద్దరూ న్యాయపోరాటం చేస్తున్నారు. మస్క్, గ్రిమ్స్ మధ్య 17 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉంది. ఈ జంట 2021 లో విడిపోతున్నట్లు ప్రకటించారు. 2023 ఆగస్టులో గ్రిమ్స్ తమ ఇద్దరు పిల్లలతో కలిసి కాలిఫోర్నియాకు వెళ్లిన తర్వాత మస్క్ (elon musk) పై దావా వేశారు. అంతేకాకుండా, తన ట్రాన్స్జెండర్ కుమార్తె వివియన్ జెన్నా విల్సన్ గురించి మస్క్ చేసిన వ్యాఖ్యలను గ్రిమ్స్ బహిరంగంగా విమర్శించారు.
ఎలన్ మస్క్ మొదటి భార్య జస్టిన్ విల్సన్ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చారు. 2000 నుంచి 2008 వరకు వీరు కలిసి ఉన్నారు. వీరు 2004 లో గ్రిఫిన్, వివియన్ అనే కవలలకు స్వాగతం పలికారు. తరువాత 2006 లో వీరికి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు కై, సాక్సన్, డామియన్ జన్మించారు. దురదృష్టవశాత్తు, వారి మొదటి సంతానం నెవాడా 2002 లో మరణించింది. మస్క్ పెద్ద పిల్లలు అతని కొత్త టెక్సాస్ కాంపౌండ్లో భాగం అవుతారా? కారా? అనేది అస్పష్టంగా ఉంది. అయితే, వారు రావాలని భావిస్తే, వారికి వసతి కల్పించడానికి ఈ ఆస్తి చాలా పెద్దదని సంబంధిత వర్గాలు తెలిపాయి.