వన్ అండ్ ఓన్లీ ఎలాన్ మస్క్.. 500 బిలియన్ డాలర్ల నికర విలువను కలిగిన మెుదటి వ్యక్తిగా రికార్డు!-elon musk becomes first person to hit 500 billion dollars net worth forbes list shows check top 10 list ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  వన్ అండ్ ఓన్లీ ఎలాన్ మస్క్.. 500 బిలియన్ డాలర్ల నికర విలువను కలిగిన మెుదటి వ్యక్తిగా రికార్డు!

వన్ అండ్ ఓన్లీ ఎలాన్ మస్క్.. 500 బిలియన్ డాలర్ల నికర విలువను కలిగిన మెుదటి వ్యక్తిగా రికార్డు!

Anand Sai HT Telugu

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ మరో చరిత్ర సృష్టించారు. 500 బిలియన్ డాలర్ల నికర విలువను కలిగి ఉన్న ప్రపంచంలో మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఎలాన్ మస్క్ సంపద బుధవారం, అక్టోబర్ 1, 2025న 500 బిలియన్ డాలర్లు మార్కును తాకింది.

ఎలాన్ మస్క్ (AFP)

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ రికార్డ్ సృష్టించారు. 500 బిలియన్ డాలర్ల నికర విలువను ఉన్న ప్రపంచంలో మొదటి వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు. ఎలాన్ మస్క్ సంపద బుధవారం, అక్టోబర్ 1, 2025న 500 బిలియన్ డాలర్లు మార్కును తాకింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం ఈ రోజున ఆయన సంపద 500.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే ఆ తర్వాత అది 499.1 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

ఎలాన్ మస్క్ సంపదలో ఈ పెరుగుదల ప్రధానంగా మూడు కంపెనీలలో అతని వాటా కారణంగా వచ్చింది. టెస్లా: టెస్లా కంపెనీ షేర్లు ఈ సంవత్సరం 14 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. బుధవారం మాత్రమే 3.3 శాతం పెరుగుదల మస్క్ సంపదకు సుమారు 6 బిలియన్ డాలర్లను జోడించింది. టెస్లాలో మస్క్ కు 12.4 శాతం వాటా ఉంది.

స్పేస్ ఎక్స్: స్పేస్ ఎక్స్ ఆగస్టు 2025 నాటికి 400 బిలియన్ డాలర్లు. ఇందులో 42 శాతం మస్క్ కలిగి ఉన్నారు. XAI (xAI): మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ విలువ 113 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. మస్క్ కు 53 శాతం వాటా ఉంది.

టెస్లా బోర్డు ఇటీవల కంపెనీ భవిష్యత్తుకు మస్క్ ఎంత ముఖ్యమో స్పష్టం చేసింది. అందుకే అతనికి 1 ట్రిలియన్ డాలర్ల పే ప్యాకేజీని ప్రకటించింది. టెస్లా ఇకపై కేవలం ఎలక్ట్రిక్ కార్ల కంపెనీగా మాత్రమే ఉండాలని కోరుకోవడం లేదు. ఏఐ, రోబోటిక్స్‌లో ప్రధాన శక్తిగా స్థిరపడాలని కోరుకుంటోంది. రాబోయే 10 సంవత్సరాలలో కంపెనీ మార్కెట్ విలువను 8.5 ట్రిలియన్ డాలర్లకు పెంచడంలో విజయం సాధిస్తే మస్క్‌కు మరింత కలిసి రానుంది.

టెస్లా బోర్డు ఛైర్మన్ మాట్లాడుతూ.. 'ఎలాన్ లాంటి నాయకుడు మరొకరు లేరు. భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవడానికి అతన్ని ప్రేరేపించడమే మా ప్రణాళిక.' అని చెప్పారు.

ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ 350.7 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. మార్క్ జుకర్ బర్గ్ మూడో స్థానంలో ఉన్నారు. అతని నికర విలువ 245.8 బిలియన్ డాలర్లు. 233.5 బిలియన్ డాలర్ల సంపదతో జెఫ్ బెజోస్ నాలుగో స్థానంలో ఉన్నారు. లారీ పేజ్ 203.7 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో నిలిచారు.

సెర్గీ బ్రిన్ 189 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఆరో ధనవంతుడు. జెన్సెన్ హువాంగ్ 162.6 బిలియన్ డాలర్లతో ఏడో ధనవంతుడుగా, బెర్నార్డ్ ఆర్నాల్ట్ 160.6 బిలియన్ డాలర్లతో ఎనిమిదో ధనవంతుడిగా నిలిచారు. స్టీవ్ బాల్మర్ 156.4 డాలర్లు, వారెన్ బఫెట్ 148.5 బిలియన్ డాలర్లతో వరుసగా 9, 10వ స్థానాల్లో ఉన్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.