Electric Vehicle Sales : మార్కెట్‌లో ఈవీలకు క్రేజ్.. 2024లో 19 లక్షలకుపైగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు
Electric Vehicle Sales In 2024 : భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతుంది. 2024లోఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల గణాంకాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
భారత ఆటోమెుబైల్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2024 గణాంకాలు చూస్తే తెలుస్తుంది. అయితే ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా డిమాండ్ ఎక్కువే ఉంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఈ ఏడాది మంచి వృద్ధిని సాధించింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ(MoRTH) విడుదల చేసిన డేటా ప్రకారం 2024లో మొత్తం 19.4 లక్షల ఈవీలు విక్రయించారు. 2023తో పోలిస్తే 26.5 శాతం పెరుగుదల నమోదైంది.
అయితే భారత మార్కెట్‌లో పెట్రోల్ వాహనాలు ఆధిపత్యం చెలాయిస్తూనే ఉన్నాయి. 2024లో భారతదేశంలో మొత్తం 26.04 మిలియన్ వాహనాలు అమ్ముడయ్యాయి. వీటిలో 73.69 శాతం పెట్రోల్ వాహనాలు. అంటే దాదాపు 19.18 మిలియన్ యూనిట్లు. డీజిల్ వాహనాలు 10.05 శాతం లేదా అంటే 2.62 మిలియన్ యూనిట్లు సేల్ అయ్యాయి. హైబ్రిడ్‌లు, సీఎన్జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల అమ్మకాలు 9.87 శాతంగా ఉన్నాయి.
దేశంలో విక్రయించే ప్రతి 12.43 పెట్రోల్, డీజిల్ లేదా హైబ్రిడ్ వాహనాలకు ఒక వ్యక్తి 1 ఈవీని కొనుగోలు చేస్తున్నాడని అంచనాలు చెబుతున్నాయి. 2023లో 15.67 వాహనాలకు ఒక ఈవీ, 2022లో 21.05 వాహనాలకు ఒక ఈవీ కొనుగోలు చేసినట్టుగా లెక్కలు ఉన్నాయి. భారతీయులు గ్రీన్ మొబిలిటీ వైపు క్రమంగా మారడాన్ని చూపిస్తుంది.
ఈవీలు 2024 జనవరి, ఫిబ్రవరిలో ఉత్తమ అమ్మకాలను సాధించాయి. మొదటి రెండు నెలల్లో అమ్మకాలు వరుసగా 145064, 141740 యూనిట్లుగా ఉన్నాయి. మార్చిలో విక్రయాలు 2,13,068కి పెరిగాయి. ఏప్రిల్‌లో అమ్మకాలు కేవలం 1,15,898 యూనిట్లుగా ఉన్నాయి. ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్‌ను ప్రవేశపెట్టడంతో క్రమేణా విక్రయాలు పెరిగాయి. అక్టోబర్‌లో పండుగల సీజన్ కావడంతో ఈ ఏడాది అత్యధిక విక్రయాలు నమోదయ్యాయి. అక్టోబర్‌లో భారతీయులు 2,19,482 ఈవీలను కొనుగోలు చేశారు. నవంబర్, డిసెంబరులో అమ్మకాల గణాంకాలు స్వల్పంగా క్షీణించాయి. అయితే మెుత్తం చూసుకుంటే గత సంవత్సరం కంటే మెరుగుదల ఉంది.
పీఎం ఇ-డ్రైవ్ పథకం కింద కార్గో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల కోసం తక్కువ సబ్సిడీని ప్రవేశపెట్టడం ఈ సంవత్సరం అమ్మకాల వృద్ధికి దోహదపడింది. పెట్రోల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్ల ధర ఎక్కువ అన్నది వాస్తవం. కానీ పెట్రోల్ వాహనాల కంటే ఈవీల నిర్వహణ ఖర్చులు చాలా తక్కువ. అయితే ఈవీలోనూ కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్లు అన్నీ కొత్త టెక్నాలజీతో వస్తున్నందున ఈ పరిస్థితి మారే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈవీలకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.