Electric Cars : జనవరిలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు.. మళ్లీ టాటా మోటార్స్ టాప్.. దగ్గరలో ఎంజీ!
Electric Cars : రోజురోజుకు ఎలక్ట్రిక్ కార్లు వినియోగం పెరుగుతోంది. చాలా మంది వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జనవరి 2025లో టాప్ కంపెనీలు ఎన్ని ఈవీ అమ్మకాలు చేసేయో చూద్దాం..

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు భారీ పెరుగుదలను చూస్తున్నాయి. ప్రస్తుతం జనవరి 2025లో ఈవీ అమ్మకాల లిస్టులో టాటా, మహీంద్రా, ఎంజీ మోటార్ ముందున్నాయి. ప్రారంభం నుండి టాటా ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అగ్రగామిగా కొనసాగుతోంది. కానీ ఇప్పుడు ఎంజీ మోటార్ అమ్మకాల గణాంకాలు చాలా దగ్గరగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇది టాటాను అధిగమించే అవకాశం ఉంది. జనవరిలో ప్రతి బ్రాండ్ ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు చేసిందో చూద్దాం..
టాటా మోటార్స్
టాటా మోటార్స్ జనవరిలో 5,037 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. గత ఏడాది జనవరిలో అమ్ముడైన 5,790 ఈవీలతో పోలిస్తే ఈసారి టాటా మోటార్స్ అమ్మకాలు 13 శాతం తగ్గాయి. ఇది 2024 పూర్తి సంవత్సరంలో 61,435 కార్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది అంతకుముందుతో పోలిస్తే.. 2 శాతం పెరుగుదల.
ఎంజీ మోటార్
ఎంజీ మోటార్ జనవరిలో 4,225 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. గత ఏడాది జనవరిలో అమ్ముడైన 1,203 యూనిట్లతో పోలిస్తే ఇది 251 శాతం పెరుగుదల. ఇది 2024లో బలమైన అమ్మకాలను నమోదు చేసింది. మొత్తం 21,464 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి.
మహీంద్రా
మహీంద్రా జనవరి 2025లో కేవలం 686.. XUV400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను మాత్రమే విక్రయించింది. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో 5,698 యూనిట్లు అమ్మకాలు చేసింది. భారతదేశ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో కంపెనీ 7 శాతం వాటాను కైవసం చేసుకుంది.
హ్యుందాయ్ మోటార్
జనవరి 2025లో 321 యూనిట్ల కార్లను విక్రయించింది హ్యుందాయ్. జనవరి 17న జరిగిన ఆటో ఎక్స్‌పోలో క్రెటా ఎలక్ట్రిక్ ప్రారంభించింది. రాబోయే నెలల్లో మరిన్ని అమ్మకాలు చేసేందుకు వీలు ఉంది.
బీవైడీ
బీవైడీ ఇండియా జనవరిలో మొత్తం 312 యూనిట్ల కార్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది జనవరిలో 163 కార్లు అమ్ముడయ్యాయి. మరోవైపు బీవైడీ తన కొత్త సీలియన్ 7 బుకింగ్‌లను ఫిబ్రవరి 17న ప్రకటిస్తుంది. డెలివరీలు మార్చిలో ప్రారంభమవుతాయి.
సిట్రోయెన్
జనవరి 2025లో సిట్రోయెన్ 269 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో కార్ల అమ్మకాలు 5 శాతం పెరిగి 1,851 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీని వలన కంపెనీ నెలవారీ, 10 నెలల మార్కెట్ వాటా 2 శాతానికి పెరిగింది.
కియా
కియా ఈ జనవరిలో 47 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. 2024 జనవరిలో కేవలం 38 కార్లను విక్రయించింది. గత ఏడాది జనవరితో పోలిస్తే ఇది 24 శాతం పెరుగుదల.