Edible oil price : భారీగా పెరిగిన వంట నూనెల ధరలు- పండగ వేళ సామాన్యుడిపై మరింత భారం!
Edible oil price hike : సామాన్యుడిపై మరింత భారం! వంట నూనె ధరలు గత నెల రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం దిగుమతి సుంకాలు పెంచడం, అంతర్జాతీయంగా ధరలు పెరగడం ఇందుకు కారణాలు.
పండగ సీజన్లో సామాన్యుడిపై ‘ధరల’ భారం! వంట నూనెల ధరలు గత నెల రోజులుగా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. పామాయిల్ ధర ఏకంగా 37శాతం వృద్ధిచెంది వంటింటి బడ్జెట్‌ని అమాంతం పెంచేసింది! ఇళ్లల్లో వాడే ఆవనూనె ధర సైతం నెల రోజుల్లో ఏకంగా 29శాతం పెరిగింది. ఫలితంగా రెస్టారెంట్లు, హోటల్స్, స్వీట్ షాప్స్లు కూడా తమ మెన్యూలో ధరలను పెంచక తప్పడం లేదు. ఈ విధంగా సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది.
వంట నూనెల ధరలు పెరగడానికి కారణాలు..
సెప్టెంబర్‌లో రీటైల్ ద్రవ్యోల్బణం 9 నెలల గరిష్ఠ (5.5శాతం) స్థాయికి చేరుకోవడంతో వంట నూనె ధరలు కూడా పెరిగిపోతున్నాయి. నిత్యావసర ధరలు, కూరగాయ ధరలు వృద్ధిచెందడం ఇందుకు ఒక కారణం. పైగా గత నెలలో పామ్, సాయ్బీన్, సన్‌ఫ్లవర్ నూనెల దిగుమతి సుంకాలను ప్రభుత్వం పెంచడం కూడా వంట నూనెల ధరలను అమాంతం పెంచేశాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ధరలు వృద్ధిచెందడం మరింత ప్రతికూలంగా మారింది. అంత్జాతీయంగా క్రూడ్ పామ్, సాయ్బీమ్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర సుమారు 10.6శాతం, 16.8శాతం, 12.3శాతం వృద్ధిచెందాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్, క్రూడ్ సాయ్బీన్పై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం ఏకంగా 5.5శాతం నుంచి 27.5శాతానికి పెంచేసింది. రిఫైన్డ్ ఎడిబుల్ ఆయిల్‌పై సుంకాన్ని సైతం 13.7శాతం నుంచి 35.7శాతానికి పెంచేసింది. ఇవన్నీ సెప్టెంబర్ 14న అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి దేశంలో వంట నూనెల ధరలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి.
వంట నూనెల దిగుమతిలో భారత్ ప్రస్తుతం రెండో అతిపెద్ద దేశంగా ఉంది. దేశంలో 58శాతం నూనెల అవసరాలు దిగుమతుల ద్వారానే పూర్తవుతుంది.
ఇక రానున్న కొన్ని నెలల పాటు అధిక ధరలతోనే కస్టమర్లు కాలం గడపాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దిగుమతి సుంకాన్ని ఇప్పట్లో తగ్గించేందుకు ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలు చేయకపోవడం ఇందుకు కారణం అని చెబుతున్నారు.
"దేశీయ ఆయిల్‌సీడ్ రైతులకు ఊతం అందించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. మరీ ముఖ్యంగా సాయ్బీన్, వేరుశనగ పంటలు త్వరలో మార్కెట్లో అందుబాటులోకి వస్తుండటంతో దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం ఇప్పట్లో తగ్గించకపోవచ్చు," అని అధికారులు చెబుతున్నారు.
రైతులకు మంచి జరగలాంటే ప్రస్తుతం ఉన్న అధిక దిగుమతులు సుంకాలు కొనసాగాలని నిపుణులు సైతం చెబుతున్నారు.
అయితే గత కొన్నేళ్లుగా చూసుకుంటే తాజాగా వంట నూనెల ధరలు తక్కువగానే పెరిగాయని ఎస్ఈఏ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ బీ వీ మెహ్తా చెబుతున్నారు.
"వంట నూనెల విషయంలో మనం ఎదగాలంటే, రైతులు ఆయిల్సీడ్స్ని ఎంచుకునే విధంగా ప్రోత్సహించాలి. ఏళ్ల పాటు రైతులకు మంచి ధర దక్కితేనే అది జరుగుతుంది. అప్పుడ దిగుమతులు తగ్గుతాయి," అని మెహ్తా అన్నారు.
కాఫీ, టీ ధరలు కూడా..!
సబ్బులు, వంటనూనెలు, టీ, కాఫీల తయారీదారులు తమ ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో కాఫీ ధరలు ఏడాది ప్రాతిపదికన 60 శాతం, టీ ధరలు 25 శాతం, పామాయిల్ ధరలు 10 శాతం పెరిగాయి.
హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్యూఎల్), అదానీ విల్మార్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (టీసీపీఎల్) వంటి టాప్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు డిసెంబర్ త్రైమాసికంలో తమ ఉత్పత్తుల ధరలను పెంచాలని యోచిస్తున్నాయి, లేదా గత త్రైమాసికంలో ఇప్పటికే కొన్ని పెరుగుదలలను తీసుకువచ్చాయి. అదానీ విల్మర్ ప్రస్తుత త్రైమాసికంలో వంట నూనె ధరలను కనీసం 20 శాతం పెంచే అవకాశం ఉంది.
సంబంధిత కథనం