Refund Money : గూగుల్ పే, ఫోన్ పేతో తప్పుడు నెంబర్‌కు డబ్బులు పంపితే తిరిగి పొందడం ఎలా?-easy ways to get refund money if sent to wrong google pay phonepe account follow these steps ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Refund Money : గూగుల్ పే, ఫోన్ పేతో తప్పుడు నెంబర్‌కు డబ్బులు పంపితే తిరిగి పొందడం ఎలా?

Refund Money : గూగుల్ పే, ఫోన్ పేతో తప్పుడు నెంబర్‌కు డబ్బులు పంపితే తిరిగి పొందడం ఎలా?

Anand Sai HT Telugu
Dec 11, 2024 09:30 AM IST

Refund Money In UPI : కొన్నిసార్లు అనుకోకుండా వేరే నెంబర్‌కు గూగుల్ పే లేదా ఫోన్ పే నుంచి డబ్బులు పంపిస్తుంటాం. అలాంటి సమయంలో మళ్లీ డబ్బులు ఎలా తిరిగి పొందాలో చాలా మందికి తెలియదు. ఆ విషయంలో ఈ ఆర్టికల్ చదివితే మీకే ఓ క్లారిటీ వచ్చేస్తుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Bloomberg)

ఇప్పుడు ఎటు చూసినా డిజిటల్ చెల్లింపులే. డబ్బులు చేతిలో ఉంచుకోవడం కంటే ఫోన్‌లోనే మెయింటెన్ చేయడం ఎక్కువైపోయింది. పది రూపాయలకు కూడా యూపీఐని వాడటం అలవాటు అయింది. అయితే చెల్లింపులు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు తప్పుడు నెంబర్లకు కూడా చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు డబ్బును తిరిగి ఎలా పొందడం అనే ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి.

అలాంటి పరిస్థితులను చూస్తే.. ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పుడు యూపీఐ ఖాతాకు డబ్బును బదిలీ చేస్తే.. మీరు మీ డబ్బును ఎలా తిరిగి పొందవచ్చో తెలుసుకోండి. ఆర్పీఐ రూల్స్ ప్రకారం డిజిటల్ సేవల ద్వారా తప్పు వ్యక్తికి డబ్బు పంపినట్లయితే చెల్లింపు పత్రాలను ఉపయోగించి ఫిర్యాదు చేయాలి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, ఇతర యూపీఐ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపితే ఎన్‌పీసీఐ(నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

అనుకోని యూపీఐ లావాదేవీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఈ విషయంలో అది ఫండ్ బదిలీ అయినా లేదా వ్యాపార లావాదేవీ అయినా కూడా ఫిర్యాదు చేయవచ్చు. npci.org.in వెబ్‌సైట్‌కి వెళ్లి వివాద పరిష్కార మెకానిజం ట్యాబ్ కింద ఫిర్యాదు చేయాలి. కంప్లైంట్ ఎంపికపై క్లిక్ చేసి యూపీఐ ఐడీ, వర్చువల్ చెల్లింపు చిరునామా, బదిలీ చేసిన మొత్తం, లావాదేవీ తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వంటి సమాచారంతో ఆన్‌లైన్ ఫారమ్‌ను నింపాలి. అలాగే మీ ఖాతాలో కట్ అయిన మొత్తం వివరాలను అప్‌లోడ్ చేయవచ్చు.

ఫారమ్ నింపేటప్పుడు మీ ఫిర్యాదుకు కారణాన్ని రాయాలి. మరొక ఖాతాకు తప్పుగా బదిలీ చేసిన ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఫిర్యాదును ఫైల్ చేయాలి. ఎన్‌పీసీఐ వెబ్‌సైట్ ప్రకారం టీపీఏపీ(థర్డ్ పార్టీ ప్రొవైడర్ అప్లికేషన్) ద్వారా యూపీఐ లావాదేవీని చేస్తే ముందుగా సంబంధిత యాప్‌లకు ఫిర్యాదు చేయాలి. ముందుగా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, లేదా టీపీఏపీ ద్వారా యూపీఐకి సంబంధించిన అన్ని ఫిర్యాదులను సమర్పించాలి.

యాప్ మీ సమస్యను పరిష్కరించకపోతే బ్యాంక్, ఎన్‌పీసీఐ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అదే పద్ధతిలో డిజిటల్ ఫిర్యాదుల కోసం అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. డిజిటల్ లావాదేవీల కోసం ఆర్బీఐ అంబుడ్స్‌మన్ అనేది ఫిర్యాదులను పరిష్కరించడానికి, డిజిటల్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసింది. వినియోగదారులు యాప్‌లకు ఫిర్యాదు చేసిన నెల వ్యవధిలో ప్రత్యుత్తరం ఇవ్వకపోతే లేదా ఫిర్యాదును తిరస్కరించినట్లయితే మాత్రమే డిజిటల్ లావాదేవీల కోసం అంబుడ్స్‌మన్‌ను సంప్రదించాలి.

విఫలమైన లావాదేవీలు, అనధికార డెబిట్‌లు, మోసాలు, మొబైల్ బ్యాంకింగ్‌లో సమస్యలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ చెల్లింపులు వంటి సమస్యలతో కూడిన ఫిర్యాదులను అంబుడ్స్‌మన్ నిర్వహిస్తారు. తమ డిజిటల్ బ్యాంకింగ్ సేవలతో సమస్యలను ఎదుర్కొంటున్న కస్టమర్లు సంబంధిత బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థతో నేరుగా తమ సమస్యలను పరిష్కరించుకోలేకపోతే ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు.

Whats_app_banner