హైదరాబాద్​లో మరో భారీ కో- వర్కింగ్​ స్పేస్​.. ద్వారక ‘ప్రైడ్​’!-dwaraka infrastructure inaugurated dwaraka pride for startup office space
Telugu News  /  Business  /  Dwaraka Infrastructure Inaugurated Dwaraka Pride For Startup Office Space
ప్రదీప్​ రెడ్డి- దీప్నా రెడ్డి
ప్రదీప్​ రెడ్డి- దీప్నా రెడ్డి

హైదరాబాద్​లో మరో భారీ కో- వర్కింగ్​ స్పేస్​.. ద్వారక ‘ప్రైడ్​’!

05 December 2022, 13:47 ISTChitturi Eswara Karthikeya Sharath
05 December 2022, 13:47 IST

Dwaraka Infrastructure : ద్వారక ఇన్​ఫ్రాస్ట్రక్చర్.. ద్వారక ప్రైడ్​ పేరుతో కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చింది. ప్రాజెక్టులో భాగంగా.. స్టార్టప్స్​ కోసమే ప్రత్యేకంగా ఓ సెంటర్​ను ఏర్పాటు చేసింది.

Dwaraka Infrastructure : ఆఫీస్‌ స్పేస్‌ రంగంలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ ద్వారక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌.. స్టార్టప్స్‌ కోసం సరికొత్త ప్రాజెక్ట్​తో ముందుకొచ్చింది. 'ద్వారక ప్రైడ్‌' అనే పేరుతో ఓ సెంటర్‌ను.. స్టార్టప్స్​ కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. 620 సీట్లతో హైదరాబాద్​లోని మాదాపూర్‌లో దీనిని ప్రారంభించింది. దీంతో సంస్థ ఖాతాలో 13 కేంద్రాలు చేరాయి. మొత్తం మీద 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చింది.

ఈ సందర్భంగా.. ద్వారక ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఎండీ ఆర్​. ఎస్​ ప్రదీప్​ రెడ్డి .. కంపెనీ డైరెక్టర్‌ డాక్టర్ దీప్నా రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. 6,500 సీట్ల కెపాసిటీకి సంస్థ చేరుకుందని పేర్కొన్నారు. స్విగ్గీ, తాన్లా, మెడీకవర్ హాస్పిటల్స్, ష్నైడర్, రామ్‌ ఇన్ఫో వంటి 100కుపైగా కంపెనీల కార్యాలయాలు ద్వారక ప్రాజెక్టుల్లో భాగంగా ఉన్నాయని చెప్పారు.

“మెట్రోకు దగ్గర్లో కార్యాలయాలు ఉండాలని క్లైంట్లు అభిప్రాయపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే మేము కూడా ప్రాజెక్టులు రూపొందిస్తున్నాము. అలాంటి ప్రాంతాలపై ఎక్కువ ఫోకస్​ పెడుతున్నాము,” అని ఆర్​. ఎస్​ ప్రదీప్​ రెడ్డి తెలిపారు.

ఆఫీసు స్పేస్​ రంగంలో దూకుడు పెంచేందుకు ద్వారక ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ సిద్ధమైంది. కొత్తగా 2 లక్షలకుపైగా చదరపు అడుగుల విస్తీర్ణలో.. ఆరు ప్రాజెక్టులను తీసుకొస్తున్నాటు, ఇవి.. 2024 మార్చ్​ నాటికి పూర్తవుతాయని ప్రదీప్​ రెడ్డి వెల్లడించారు. ఇవన్నీ యాడ్​ అయితే.. మరో 4,500 సీట్ల సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

Dwaraka Pride : "ఐఐఎం కోల్​కతా నుంచి 2008లో ఎంబీఏ పూర్తి చేశాను. బిలియన్‌ డాలర్ల రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ ఫండ్‌లో పనిచేసిన అనుభవం ఉంది. 2011లో రియాల్టీ రంగంలో అడుగుపెట్టాను. 2016లో ఆఫీస్‌ స్పేస్‌ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాను. తొలి ఏడాది 250 సీట్ల సామర్థ్యం అందుకున్నాం. 2018కు అదే సామర్థ్యం నాలుగింతలైంది. 2020 మార్చి నాటికి 3,000 సీట్లతో 1.6 లక్షల చదరపు అడుగుల స్థాయికి చేరుకున్నాం. కానీ.. మహమ్మారి కాలంలో హైదరాబాద్‌ ఆఫీస్‌ స్పేస్‌ పరిశ్రమ బలహీన పడింది. ఇదే కాలంలో ద్వారక ఇన్‌ఫ్రా భారీ ప్రాజెక్టులకు తోడు రెండింతల సామర్థ్యాన్ని అందుకుంది. హైబ్రిడ్‌ విధానం మాకు కలిసి వస్తోంది. కార్యాలయాల కోసం అనువుగా ఉండే ఆఫీస్‌ స్పేస్‌ను తీసుకునేందుకే ఐటీ సంస్థ ఆసక్తి చూపిస్తున్నాయ,’ అని ప్రదీప్‌ రెడ్డి వెల్లడించారు.

'ఒప్పందాలు.. అనువైన విధంగానే!'

ఆఫీస్‌ స్పేస్‌ పరిశ్రమలో ప్లగ్‌ అండ్‌ ప్లే, కో–వర్కింగ్, సర్వీసెడ్​ ఆఫీస్‌ స్పేస్‌ విభాగాల్లో పోటీ పడుతున్నామని డాక్టర్ దీప్నా రెడ్డి వెల్లడించారు

"ఐటీ రంగం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఒడిదొడుకులు సహజంగా ఉంటూనే ఉంటాయి. అందుకే కంపెనీలకు దీర్ఘకాలిక ఒప్పందం భారం కాకుండా.. అనువైన విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాము. అంటే.. ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత సీట్లను తగ్గించుకున్నా, వారిపై భారం ఉండదు. మహిళా వ్యాపారవేత్తలకు ఛార్జీల్లో డిస్కౌంట్‌ కూడా ఇస్తున్నాం. ప్రీమియం ఇంటీరియర్స్‌ ఏర్పాటు చేశాం. సాధారణ ఛార్జీలతోనే ఖరీదైన అనుభూతి కల్పిస్తున్నామని చెప్పడానికి సంతోషంగా ఉంది,’ అని వివరించారు.

సంబంధిత కథనం