ఎఫ్‌పీఐల ఉపసంహరణ, ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ కారణంగా దేశంలోని సంపన్న పారిశ్రామికవేత్తల సంపద ఈ ఏడాది రూ.2.6 లక్షల కోట్లు తగ్గింది. ట్రంప్ టారిఫ్ ప్లాన్ ప్రకటించిన తర్వాత భారీ క్షీణత కనిపించింది. అమెరికా అధ్యక్షుడు గతంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై సుంకాలు విధించారు. దీంతో భారత్ సహా ఇతర దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.
స్టాక్ మార్కెట్ పతనం కారణంగా ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, శివ్ నాడార్, సావిత్రి జిందాల్, దిలీప్ సంఘ్వీ, అజీమ్ ప్రేమిల నికర విలువ క్షీణించింది. భారత కుబేరుడు ముకేశ్ అంబానీ సంపద ఈ ఏడాది 3.42 బిలియన్ డాలర్లు తగ్గింది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా మినహా ఇతర దేశాలపై సుంకాలను నిలిపివేశారు.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. నికర విలువ భారీగా పడిపోవడంతో ముకేశ్ అంబానీ ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితా నుండి వైదొలిగారు. ఆయన సంపద 87.2 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇప్పుడు 17వ స్థానంలో నిలిచారు. అదే సమయంలో గౌతమ్ అదానీ నికర సంపద ఈ ఏడాది 6.05 బిలియన్ డాలర్లు క్షీణించింది. అదానీ గ్రూప్‌నకు చెందిన ప్రముఖ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 2025లో 9 శాతం పడిపోయాయి.
భారతదేశపు అత్యంత ధనిక మహిళ సావిత్రి జిందాల్ సంపద 2.4 బిలియన్ డాలర్లు క్షీణించింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ 10.5 బిలియన్ డాలర్లు నష్టపోయారు. 2025లో భారత స్టాక్ మార్కెట్లలో భారీ క్షీణత నమోదైంది. సెన్సెక్స్, నిఫ్టీలు ఈ ఏడాది ఇప్పటివరకు 4.5 శాతానికి పైగా క్షీణించాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 17 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 14 శాతం చొప్పున నష్టపోయాయి.
సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ సంపద 3.34 బిలియన్ డాలర్లు క్షీణించింది. ఈ ఏడాది సన్ ఫార్మా షేర్లు 10 శాతం పతనమయ్యాయి.
సంబంధిత కథనం