Ducati Streetfighter: భారత్ లో డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4, వీ4 ఎస్ లాంచ్; ధర ఎంతంటే..?
Ducati Streetfighter: స్పోర్ట్స్ బైక్ లకు పేరుగాంచిన డుకాటీ లేటెస్ట్ గా స్ట్రీట్ ఫైటర్ వీ 4, స్ట్రీట్ ఫైటర్ వీ 4 ఎస్ బైక్స్ ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. డుకాటి స్ట్రీట్ ఫైటర్ వి4 సిరీస్ బైక్స్ డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజిన్ ను ఉపయోగిస్తుంది.
Ducati Streetfighter: డుకాటీ ఇండియా భారత మార్కెట్లో డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4 (Ducati Streetfighter V4), డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4 ఎస్ (Ducati Streetfighter V4 S) లను విడుదల చేసింది. స్ట్రీట్ ఫైటర్ వీ4 ధర రూ.24.62 లక్షలుగా, వీ4 ఎస్ డుకాటీ రెడ్ కలర్ ధర రూ.27.80 లక్షలుగా, వీ4 ఎస్ గ్రే నీరో కలర్ ధర రూ.28 లక్షలుగా నిర్ణయించారు. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. డుకాటీ నుంచి వచ్చిన ఈ కొత్త స్ట్రీట్ ఫైటర్ సిరీస్ మోటార్ సైకిళ్లు మార్కెట్లో బిఎమ్ డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ ఆర్ (BMW S 1000 RR), కవాసాకి జెడ్ హెచ్ 2 (Kawasaki Z H2) లకు పోటీగా ఉంటాయి.
1000 సీసీ కన్నా ఎక్కువ..
డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4 (Streetfighter V4), డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4 ఎస్ (Streetfighter V4 S) మోటార్ సైకిళ్లలో 1,103 సీసీ డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 13,000 ఆర్ పిఎమ్ వద్ద 205 బిహెచ్ పి పవర్ ను, 9,500 ఆర్ పిఎమ్ వద్ద 123 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండు బైక్స్ లో 6-స్పీడ్ గేర్ బాక్స్ తో బై-డైరెక్షన్ క్విక్ షిఫ్టర్ ఉంటుంది.
‘వెట్’ రైడింగ్ మోడ్
ఈ డుకాటీ స్ట్రీట్ ఫైటర్ (Ducati Streetfighter) బైక్స్ లో ఫ్యూయల్ ట్యాంక్ ను 2022 పానిగేల్ వి స్ఫూర్తిగా రూపొందించారు. అందువల్ల, ఈ బైక్స్ లో ఇప్పుడు 16.5 లీటర్ల వరకు ఇంధనాన్ని ఫిల్ చేసుకోవచ్చు. అంతేకాక, ఈ బైక్స్ లో రెండు వైపులా కొత్త సైడ్ కవర్లు ఉన్నాయి. డుకాటీ కొత్తగా, తడి రోడ్లపై సురక్షిత ప్రయాణానికి వీలు కల్పించే 'వెట్' రైడింగ్ మోడ్ ను కూడా అందిస్తోంది. వి 4 ఎస్ (Ducati Streetfighter V4 S) మోడళ్లలో 1.7 కిలోల తేలికైన లిథియం-అయాన్ బ్యాటరీ లభిస్తుంది. ఈ బైక్స్ లోని ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ లోని గ్రాఫిక్స్ లో స్వల్ప మార్పులు చేశారు. కూలింగ్ ఫ్యాన్ ను కూడా మరింత మెరుగైన పనితీరు చూపేలా అప్ గ్రేడ్ చేశారు.
సస్పెన్షన్స్
డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4 ఎస్ (Ducati Streetfighter V4 S) స్మార్ట్ ఈసీ 2.0 ఇంటర్ ఫేస్ తో సెమీ-యాక్టివ్ ఓహ్లిన్స్ సస్పెన్షన్ (NIX30 అప్ సైడ్ డౌన్ 43 mm ఫోర్క్ మరియు టిటిఎక్స్ 36 షాక్ అబ్జార్బర్) ను కలిగి ఉంది. ఈ రిమ్ లను అల్యూమినియం మిశ్రమం నుండి రూపొందించారు. మెరుగైన యాంటీ స్క్వాట్ యాక్టివిటీ కోసం స్వింగ్ ఆర్మ్ ను ఈ బైక్స్ లో 4 మిమీ ఎత్తులో ఉంచారు.