Night Time Driving Tips : రాత్రిపూట కారు నడుపుతుంటే గుర్తుంచుకోవాల్సిన సింపుల్ విషయాలు
Night time Driving Tips In Telugu : రాత్రిపూట కారు నడపడం చాలా కష్టమైన పని. చాలా జాగ్రత్తగా నడపాలి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్న కునుకు తీసినట్టుగా చేసినా.. కారు ప్రమాదానికి గురవుతుంది.
పగటిపూట డ్రైవింగ్ చేయడం పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ రాత్రుళ్లు కారు నడపడం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చాలా ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రస్తుతం చలికాలం నడుస్తుంది. ఈ సమయంలో నైట్ డ్రైవింగ్ మీద మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకుంటే.. సురక్షితంగా రాత్రిపూట డ్రైవింగ్ చేయవచ్చు. ఆ 6 టిప్స్ ఏంటో చూద్దాం..
రాత్రిపూట చూపు తక్కువగా ఉంటుంది. వేగాన్ని తక్కువ చేయడం చాలా ముఖ్యం. నిర్ణీత వేగ పరిమితిలో నడపండి. రహదారి పరిస్థితులకు అనుగుణంగా వాహనం వేగాన్ని తక్కువగా ఉంచండి. ఎందుకంటే ఇది ఊహించని అడ్డంకులను ఎదుర్కోవడానికి సాయం చేస్తుంది. మీరు జాగ్రత్తగా ముందు చూస్తూ ఉండాలి.
రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు హెడ్‌లైట్‌లను సరిగ్గా ఉపయోగించడం అవసరం. హైవే లేదా ఖాళీ రోడ్డుపై డ్రైవింగ్ చేసేటప్పుడు.. మీకు మరింత చక్కగా కనిపించేందుకు హెడ్‌లైట్‌లను హై బీమ్‌పై ఉంచండి. అదే సమయంలో మీ హెడ్‌లైట్‌లను వన్-వే లేదా అర్బన్ రోడ్‌లలో తక్కువ బీమ్‌లో ఉంచండి. తద్వారా ముందు నుండి వచ్చే వాహనాలు మీ వల్ల ప్రభావితం కాకుండా ఉంటాయి.
రాత్రి సమయంలో కొన్నిసార్లు రహదారి పరిస్థితులను తెలుసుకోవడం కష్టం. గుంతలు, కాంక్రీటు, జంతువుల అడ్డువచ్చే ప్రదేశాలు ఉంటాయి. అలాంటి రోడ్లపై వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రహదారిపై శ్రద్ధ వహించడం, అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. రోడ్డుపై ఏదైనా వస్తువును చూసినట్లయితే దానిని గుర్తించడానికి, ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సరైన సమయంలో బ్రేక్‌లు వేయండి.
రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్‌పై మాత్రమే దృష్టి పెట్టాలి. ఈ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం లేదా ఇతర విషయాలపై శ్రద్ధ పెట్టడం చాలా ప్రమాదకరం. మీరు ఫోన్ చూస్తూ.. డ్రైవింగ్ చేస్తే కారు డివైడర్ వైపు వెళ్లే అవకాశం ఉంది.
రాత్రి సమయంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ ముందు ఉన్న వాహనం నుండి తగినంత దూరం ఉండాలి. ముందు వాహనం అకస్మాత్తుగా బ్రేక్ చేస్తే.. మీకు సురక్షితమైన దూరం ఉంటుంది. సమయానికి ఆగిపోతుంది. లేదంటే వెనకాల నుంచి ముందు ఉన్న కారును ఢీ కొట్టే అవకాశం ఉంది.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కొందరికి డ్రైవింగ్ చేస్తుంటే నిద్ర వచ్చే అవకాశం ఉంది. అలాంటి సమయంలో మీరు చిన్న కునుకు తీసినా.. పెద్ద ప్రమాదం ఉంటుంది. నిద్ర వచ్చినట్టైతే టీ తాగండి. లేదా ముఖం మీద నీరు చల్లుకోండి. అయినా నిద్ర ఆగడం లేదంటే వాహనాలు రాని ప్రదేశంలో కారు తీసుకెళ్లి కాసేపు పడుకోండి. ఎందుకంటే జీవితం కంటే ఏదీ ముఖ్యమైనది కాదు.
టాపిక్