ఇంటర్నెట్ ప్లాన్ సబ్ స్క్రైబ్ చేసేటప్పుడు మనం చాలా రీసెర్చ్ చేస్తుంటాం. తక్కువ ధరలో లభించే ఉత్తమ డీల్స్ కోసం, వేగవంతమైన ఇంటర్నెట్ కోసం చూస్తుంటాం. డౌన్ టైమ్ తక్కువ ఉండాలని, విశ్వసనీయత కలిగిన కంపెనీ అయి ఉండాలని చూస్తాం. కానీ, దురదృష్టవశాత్తు, మనం ఒక కీలకమైన అంశానికి అదే స్థాయి ప్రాధాన్యత ఇవ్వం. అదే ఆ వైఫై నెట్వర్క్ భద్రత.
ఈ రోజుల్లో, మీ వై-ఫై నెట్వర్క్ కు సురక్షితంగా ఉంచడం చాలా అవసరం. ముఖ్యంగా రోజువారీ జీవితంలో వైఫై నెట్వర్క్ ను ఉపయోగించి మన స్మార్ట్ ఫోన్లలో, ల్యాప్ టాప్ ల్లో, స్మార్ట్ హోం అప్లయన్సెస్ లో చాలా యాక్టివిటీస్ చేస్తుంటాం. బ్యాంకింగ్ లావాదేవీలు, క్రెడిట్ కార్డులను ఉపయోగించడం,స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రైవేట్ సంభాషణలు చేయడం వంటివి ఇప్పుడు ఆన్ లైన్ లోనే ఎక్కువగా చేస్తున్నాం. మరి ఆ డేటా ఎంతవరకు సురక్షితంగా ఉంటుందో కూడా చూసుకోవాలి కదా..
ఒకవేళ ఎవరైనా హ్యాకర్ మీ వై-ఫై నెట్వర్క్ ను హ్యాక్ చేసి,మీ వైఫై సిస్టమ్ ను తన ఆధీనంలోకి తీసుకుంటే ఎంత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతాయో ఆలోచించండి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, మీ వై-ఫై నెట్వర్క్ ను సురక్షితంగా ఉంచడానికి, హ్యాకర్లు మీ వైఫై సిస్టమ్ ను హ్యాక్ చేయకుండా ఉండడానికి సహాయపడే ఐదు ఉత్తమ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
మీరు కొత్త వై-ఫై రౌటర్ ను ఉపయోగించడం ప్రారంభించినప్పుడు, అది డిఫాల్ట్ ఎస్ఎస్ఐడి (నెట్వర్క్ పేరు) తో వస్తుంది. మీరు ఈ ఎస్ఎస్ఐడీ పేరును వెంటనే మార్చాలి. ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయని SSIDని ఎంచుకోండి.
ఎస్ఎస్ఐడి మాదిరిగానే, మీ రూటర్ కూడా డిఫాల్ట్ పాస్వర్డ్ తో వస్తుంది. దీనిని సులభంగా ఊహించవచ్చు. అందువల్ల, మీరు వైఫై నెట్ వర్క్ ను ఉపయోగించడం ప్రారంభించగానే ముందుగా ఎవరూ ఊహించలేని ప్రత్యేకమైన పాస్వర్డ్ ను ఎంచుకోవాలి. పాస్వర్డ్ లను సృష్టించడానికి, స్టోర్ చేయడానికి పాస్వర్డ్ మేనేజర్ ను ఉపయోగించవచ్చు. ఇప్పుడు, ఆపిల్ పాస్వర్డ్స్ యాప్ లేదా గూగుల్ వైపు కూడా అనేక ఉచిత ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీ పాస్ వర్డ్ కనీసం 15 అక్షరాలు ఉండేలా చూసుకోండి. ఇది సంఖ్యలు, అక్షరాలు, చిహ్నాల మిశ్రమంగా ఉందని నిర్ధారించుకోండి.
బగ్స్ లేదా భద్రతా లోపాలను పరిష్కరించడానికి మీ స్మార్ట్ ఫోన్ ను అప్ డేట్ చేసినట్లే, రౌటర్ తయారీదారులు కూడా లోపాలను ప్యాచ్ చేయడానికి సాఫ్ట్ వేర్ అప్ డేట్ లను విడుదల చేస్తారు. అయినప్పటికీ, చాలా మంది దీనిని పట్టించుకోరు. ప్రారంభ సెటప్ తర్వాత వారి రౌటర్లను తాకకుండా వదిలేస్తారు. అప్ డేట్స్ కోసం తరచుగా చెక్ చేయండి. అందుబాటులో ఉన్నప్పుడు వాటిని ఇన్స్టాల్ చేయండి. ఎందుకంటే అవి హ్యాకర్లు ఉపయోగించగల టూల్స్ ను నిరుపయోగం చేస్తాయి.
మీ గోప్యతను సంరక్షించడానికి వీపీఎన్ లు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. అవి మీ IP చిరునామాను ఇంటర్నెట్ నుండి దాచడమే కాకుండా, అవి మీ ఇంటర్నెట్ యాక్టివిటీని ఎన్ క్రిప్ట్ చేస్తాయి. ఇది మీ వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్న ఎవరికైనా అడ్డంకిగా నిలుస్తుంది. అంటే మీ ఆన్లైన్ యాక్టివిటీ, వై-ఫైలో కూడా ప్రైవేట్ గా, సురక్షితంగా ఉంటుంది. హ్యాకర్లకు దూరంగా ఉంటుంది.
మీ ఐఎస్పీ అందించే డిఫాల్ట్ రౌటర్ ను ఉపయోగించడానికి బదులుగా మెరుగైన రౌటర్ కు అప్గ్రేడ్ అవండి. దానివల్ల మెరుగైన వేగం, విశ్వసనీయత, అధిక పరిధి, మెరుగైన భద్రత వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. సాధారణంగా, పలు మోడళ్లు ఇన్ బిల్ట్ ఫైర్ వాల్స్ తో వస్తాయి.
సంబంధిత కథనం