OpenAI : ఓపెన్ఏఐతో కాపీరైట్ వార్.. న్యాయస్థానానికి డీఎన్‌పీఏ, హెచ్‌టీ, ఎక్స్‌ప్రెస్, ఎన్డీటీవీ
OpenAI : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పని చేస్తున్న ఓపెన్ఏఐపై కాపీరైట్ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు డీఎన్‌పీఏ, హెచ్‌టీ డిజిటల్ స్ట్రీమ్స్, ఎన్డీటీవీ, ఐఈ(ఎక్స్‌ప్రెస్ గ్రూప్) ఆన్‌లైన్ మీడియా.. ఓపెన్ఏఐకి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లాయి.
ఓపెన్ఏఐ ఇబ్బందుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ కింద దీనిపై దిల్లీ హైకోర్టులో దావా నడుస్తోంది. హెచ్‌టీ డిజిటల్ స్ట్రీమ్స్, ఎన్డీటీవీ, డీఎన్‌పీఏ(డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్), ఐఈ(ఎక్స్‌ప్రెస్ గ్రూప్) ఆన్‌లైన్ మీడియాతోపాటు మరికొన్ని సంస్థలు సోమవారం దిల్లీ హైకోర్టులో ఓపెన్ఏఐకి వ్యతిరేకంగా ఏఎన్ఐ కేసులో ఇంప్లీడ్ అయ్యాయి. అంతేకాదు న్యాయశాస్త్రం నిర్ణయించిన తీర్పు వార్తలను సేకరించి ప్రసారం చేసే విధానాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది.. కాబట్టి దీనిపై విచారణ జరపాలని పిటిషన్ దాఖలు చేసిన సంస్థలు కోరాయి.
ఏఎన్ఐ కేసు విచారణకు ముందు
ఏఎన్ఐ కేసులో తదుపరి విచారణకు ఒక రోజు ముందు ఈ ఇంటర్వెన్షన్ పిటిషన్ దాఖలైంది. ఓపెన్ఏఐ వంటి సంస్థలు లైసెన్స్, ఆథరైజేషన్ లేదా అనుమతి లేకుండా తమ వెబ్‌సైట్స్, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్, సమాచారాన్ని ఉపయోగిస్తున్నట్టుగా పిటిషన్ వేసిన సంస్థలు పేర్కొన్నాయి. ఇది మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘిచడం అని చెప్పాయి. ఈ కేసు ఫలితం మొత్తం భారతీయ వార్తా పరిశ్రమలో పనిచేస్తున్న డీఎన్‌పీఏ సభ్యులు, పాత్రికేయుల జీవనోపాధిని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపాయి.
ఇప్పటికే ఒప్పందాలు
అసోసియేటెడ్ ప్రెస్, ది అట్లాంటిక్, న్యూస్ కార్ప్ వంటి అంతర్జాతీయ న్యూస్ పబ్లిషర్లతో ఓపెన్ఏఐ లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌కు శిక్షణ ఇవ్వడానికి, కంటెంట్‌ను ఉపయోగించడానికి ఓపెన్ఏఐకి లైసెన్స్ లేదా అనుమతి అవసరమని చెప్పడానికి ఇది నిదర్శనమని వాదనలు పిటిషనర్లు తెలిపారు.
నష్టపరిహారం చెల్లించకుండా
బిగ్‌టెక్ ప్లాట్‌ఫామ్, ముఖ్యంగా సెర్చ్ ఇంజిన్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి వస్తున్న సవాళ్లను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా డీఎన్‌పీఏ తెలిపింది. ఇలాంటి సంస్థలు పబ్లిషర్లకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా వార్తా సంస్థలకు చెందిన కంటెంట్‌ను వాడుకుని సొమ్ము చేసుకుంటున్నాయని పిటిషన్‌లో చెప్పారు.
కంటెంట్ కాపీ
ఏఐ సేవలకు శిక్షణ ఇచ్చేందుకు సాంకేతిక సంస్థలు తమ కంటెంట్‌ను కాపీ చేస్తున్నాయని సంస్థలు ఆరోపిస్తున్నాయి. చాట్ బాట్ ఈ పద్ధతి మార్చుకోవాలని చెబుతున్నాయి. శిక్షణ ఇచ్చే సమయంలో ఉపయోగించే కంటెంట్ తమదేనని అంటున్నాయి. ఓవైపు ప్రచురణకర్తలు, వార్తా సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి.
ఇప్పటికే దావా
ఇప్పటికే భారతీయ పుస్తక ప్రచురణ కర్త గ్లోబల్ పబ్లిషర్స్ ఓపెన్ఏఐకి వ్యతిరేకంగా దిల్లీలో కాపీరైట్ దావా వేసింది. కంటెంట్‌ను యాక్సెస్ చేయడాన్ని చాట్ జీపీటీ వెంటనే ఆపాలని కోరింది. OpenAIకి వ్యతిరేకంగా కాపీరైట్ ఉల్లంఘన దావా వేసిన కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మరికొన్ని సంస్థలు న్యాయ పోరాటం కోసం కోర్టుకు వెళ్లాయి.