Delhivery shares: మరింత పతనమైన డెలివరీ షేర్ ధర.. ఇంకా పడిపోనుందా?
డెలివరీ షేర్ ధర జీవిత కాలపు గరిష్టం నుంచి దాదాపు 55 శాతం పడిపోయింది.
లిస్టింగ్ అయ్యాక బాగానే పెరిగిన డెలివరీ (Delhivery) షేర్లు సరికొత్త దిగువకు పతనమయ్యాయి. 2022 మే నెలలో పబ్లిక్ ఇష్యూకు వచ్చినప్పుడు రూ. 462 నుంచి రూ. 487 వద్ద ప్రైస్ బ్యాండ్ నిర్ణయించిన డెలివరీ ఫ్లాట్‌గా లిస్టయ్యాయి. ఆ తరువాత క్రమంగా పుంజుకుని గరిష్టంగా జూలై నెలలో రూ. 708 వరకు వెళ్లింది. అప్పటి నుంచి ఈ షేర్లు నేల చూపులు చూస్తూ వచ్చాయి. గురువారం సరికొత్త దిగువకు చేరుకుంది. గురువారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో డెలివరీ షేర్ ధర రూ. 299.55గా ఉంది. గరిష్టం నుంచి దాదాపు 55 శాతం కరెక్షన్‌కు లోనైంది.
ఈ లాజిస్టిక్స్ కంపెనీ కార్యాచరణ విషయంలో తక్కువ వృద్ధి కనబరచవచ్చని, స్క్రిప్ ధర మరింత పతనమవ్వొచ్చని స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయపడుతున్నారు. బేర్ పరిస్థితుల్లో రూ. 215 స్థాయి వరకు పతనం చవి చూడవచ్చని, అయితే ప్రస్తుతం రూ. 250 వద్ద మద్దతు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.
స్వస్తిక ఇన్వెస్ట్‌మెంట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేష్ గౌర్ డెలివరీ షేర్ ధరను విశ్లేషిస్తూ ‘డెలివరీ షేర్లు తిరోగమనంలో ఉన్నాయి. అవరోహణ ట్రయాంగిల్ ఫార్మేషన్ ఏర్పడి పతనం చూస్తోంది. ఇది మరింత పతనాన్ని అంటే.. రూ. 250 నుంచి రూ. 225 స్థాయిలకు పడిపోతుందని సూచిస్తుంది. ఇన్వెస్టర్లు ప్రస్తుతానికి దూరంగా ఉంటే మంచిది. ట్రెండ్ రివర్సల్ రావాలంటే రూ. 340 మార్కు తాకాలి..’ అని పేర్కొన్నారు.
ఈ కామర్స్ కంపెనీల్లో తక్కువ వృద్ధి గల పరిస్థితులు, కఠినమైన లిక్విడిటీ పరిస్థితుల కారణంగా బేర్ మార్కెట్‌లో డెలివరీ షేర్ ధర రూ. 215కు పతనమవ్వొచ్చని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మాక్వైర్ విశ్వసిస్తోంది.
‘ఈ కామర్స్ కంపెనీలకు నిధుల సమస్య కారణంగా రానున్న మరికొన్ని క్వార్టర్లలో తక్కువ వృద్ధి కనిపించే అవకాశం ఉంది…’ అని మాక్వైర్ ఒక ఇన్వెస్టర్ నోట్‌లో తెలిపింది. అయితే టైర్-2, టైర్-3 నగరాల్లో ఈ కామర్స్ విస్తరణ వల్ల డెలివరీ షేర్స్ లాభపడతాయని, రానున్న మూడేళ్లలో షేర్ ధర టార్గెట్ రూ. 440గా ఉందని చెప్పింది.
(గమనిక: ఇక్కడ తెలియపరిచిన సిఫారసులు, అభిప్రాయాలు హెచ్‌టీకి చెందినవి కావు. వ్యక్తిగత అనలిస్టులు, బ్రోకరేజీ కంపెనీలవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు ఇన్వెస్టర్లు అధీకృత నిపుణుల నుంచి సలహాలు తీసుకోవాలని కోరుతున్నాం..)