కేవలం 180 మీటర్ల దూరానికి ఓలా బైక్ బుక్ చేసుకున్న అమ్మాయి.. కారణం తెలిస్తే నవ్వుతారేమో!-delhi girl book ola bike taxi for just 180 meters and charge 19 rupees only know reason behind it ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  కేవలం 180 మీటర్ల దూరానికి ఓలా బైక్ బుక్ చేసుకున్న అమ్మాయి.. కారణం తెలిస్తే నవ్వుతారేమో!

కేవలం 180 మీటర్ల దూరానికి ఓలా బైక్ బుక్ చేసుకున్న అమ్మాయి.. కారణం తెలిస్తే నవ్వుతారేమో!

Anand Sai HT Telugu

ఢిల్లీకి చెందిన ఓ అమ్మాయి కేవలం 180 మీటర్ల మేర ఓలా బైక్ ట్యాక్సీని బుక్ చేసుకుంది. ఈ వార్త ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా ఉంది. దీని వెనుక ఉన్న కారణం ఏంటో చూడండి.

180 మీటర్లకు ఓలా బుక్ చేసుకున్న అమ్మాయి

ఢిల్లీకి చెందిన ఓ అమ్మాయి కేవలం 180 మీటర్ల కోసం ఓలా బైక్ ట్యాక్సీని బుక్ చేసుకుంది. ఈ వార్త సోషల్ సోషల్ మీడియా ప్రపంచంలో వైరల్ అవుతోంది. ఇంత తక్కువ దూరం నడవొచ్చు కదా అని చాలా మంది అనుకుంటారు. కానీ అమ్మాయి ఓలా బుక్ చేయడానికి ఓ కారణం ఉంది. తాజాగా ఆ అమ్మాయి కేవలం 180 మీటర్ల దూరం ప్రయాణించేందుకు ఓలా బైక్ బుక్ చేసుకుంది. ఈ వార్త వింటుంటే ఎవరైనా ఇంత తక్కువ దూరానికి బైక్ ట్యాక్సీ ఎందుకు బుక్ చేసుకుంటారు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. దీనికి సమాధానం కుక్కల భయం.

వీధి కుక్కల భయం

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను 'ఘర్ కే కాలేష్' అనే సోషల్ మీడియా(ఎక్స్) పేజీలో షేర్ చేశారు. వ్లాగ్ కెమెరా ధరించిన ఓలా బైక్ ట్యాక్సీ రైడర్ పికప్ లొకేషన్‌కు చేరుకోవడంతో ఈ వీడియో మొదలవుతుంది. అతని కోసం ఓ అమ్మాయి ఎదురుచూస్తోంది. రైడర్ ఓటీపీ కోరగా అమ్మాయి చెబుతుంది.

రైడర్ యాప్‌లో డ్రాప్ లొకేషన్‌ను చెక్ చేయగా, దూరం కేవలం 180 మీటర్లు మాత్రమే అని తెలుసుకుని మొదట ఆశ్చర్యపోతాడు, కానీ ఆ రోడ్డుపై తరచూ వీధి కుక్కలు ఉన్నాయని, వాటికి భయపడుతున్నానని, అందుకే ట్యాక్సీని బుక్ చేసుకున్నానని ఆ అమ్మాయి సమాధానమిచ్చింది.

రైడ్‌కు రూ.19 మాత్రమే

రైడ్ కేవలం ఒక మలుపు, ఆ తర్వాత మరో మలుపు తర్వాత గమ్యాన్ని చేరుకుంటుంది. ఈ షార్ట్ రైడ్‌కు ఛార్జీ 19 మాత్రమే. అమ్మాయి డబ్బులు చెల్లించి రైడ్ ముగుస్తుంది. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది పూర్తిగా కరెక్టేనని, టెక్నాలజీని ఉత్తమంగా వినియోగించుకోవడమేనని కొందరు అన్నారు. కొందరు ఈ వీడియో స్క్రిప్ట్‌గా ఉందని అంటున్నారు. చాలా తక్కువ మంది రైడర్లు హెల్మెట్ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. కుక్కల బెడద భారతదేశంలో పెద్ద సమస్య అని ఒక యూజర్ కామెంట్ చేశారు.

ఆ వీడియో స్క్రిప్ట్ అయినా కాకపోయినా కుక్కల భయం ఎక్కువే ఉంది. చాలాసార్లు జనాలు వీధి కుక్కల గుంపును చూసి భయపడతారు. ఒంటరిగా నడవడానికి ఇబ్బంది పడతారు. ముఖ్యంగా అమ్మాయిలు, చిన్నారుల్లో ఈ భయం మరింత ఎక్కువగా ఉంటుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.