ఆ వెహికిల్స్​కి ఈ రోజు నుంచి పెట్రోల్​, డీజిల్​ బంద్​- కఠినంగా రూల్స్​ అమలు..-delhi fuel ban news no petrol diesel for these vehicles all you need to know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఆ వెహికిల్స్​కి ఈ రోజు నుంచి పెట్రోల్​, డీజిల్​ బంద్​- కఠినంగా రూల్స్​ అమలు..

ఆ వెహికిల్స్​కి ఈ రోజు నుంచి పెట్రోల్​, డీజిల్​ బంద్​- కఠినంగా రూల్స్​ అమలు..

Sharath Chitturi HT Telugu

వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా దిల్లీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది! కాలం చెల్లిన వాహనాలకు ఇకపై పెట్రోల్​, డీజిల్​ లభించదు. దీనిని అమలు చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.

కాలం చెల్లిన వాహనాలకు పెట్రోల్​, డీజిల్​ బంద్​! (Reuters/Representational Image)

వాహన కాలుష్యాన్ని కట్టడి చేసే దిశగా దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1, మంగళవారం నుంచి దిల్లీలోని పెట్రోల్ పంపుల్లో కాలం చెల్లిన (ఎండ్​ ఆఫ్​ లైఫ్​) వాహనాలకు ఇంధనం సరఫరా ఉండదు. వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ ఆదేశాల మేరకు రవాణా శాఖ, దిల్లీ పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ దిల్లీ సిబ్బంది ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నారు.

దిల్లీలో పాత వాహనాలకు నేటి నుంచి ఇంధనం బంద్​..

డీజిల్ వాహనాలకు 10 సంవత్సరాలు, పెట్రోల్ వాహనాలకు 15 సంవత్సరాల కాలపరిమితి దాటిన వెహికిల్స్​కి ఇంధనం నింపరు. ఈ వాహనాలకు ఇంధనం నింపకుండా పర్యవేక్షించడానికి, నిరోధించడానికి గుర్తించిన 350 పెట్రోల్ పంపుల్లో ఒక్కో ట్రాఫిక్ పోలీస్ అధికారిని నియమించారు.

ఎంసీడీ బృందాలు ఇంధన కేంద్రాల వద్ద మోహరించి ఉండగా, దిల్లీ పోలీసులు కూడా అక్కడ ఉంటారు. 1 నుంచి 100 వరకు నంబర్ ఉన్న పెట్రోల్ పంపుల వద్ద దిల్లీ పోలీసు సిబ్బందిని నియమిస్తారు. రవాణా శాఖ 101 నుంచి 159 వరకు నంబర్ ఉన్న ఇంధన కేంద్రాలలో 59 ప్రత్యేక బృందాలను మోహరించింది.

ట్రాఫిక్ సిబ్బందికి గడువు ముగిసిన వాహనాలను స్వాధీనం చేసుకునే లేదా యజమానికి చలాన్ జారీ చేసే అధికారం ఉంటుంది. అదనంగా, ఈ అమలు సమయంలో శాంతిభద్రతలను కాపాడటానికి ప్రతి పెట్రోల్ పంప్ వద్ద ఇద్దరు పోలీసు సిబ్బందిని నియమించారు.

పాత వాహనాలకు ఇంధనం నింపడంపై నిషేధాన్ని అమలు చేయడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్​ని విడుదల చేసింది. ఈ ఎస్​ఓపీ ప్రకారం, అన్ని పెట్రోల్ పంపులు గడువు ముగిసిన వాహనాలకు ఇంధనం నిరాకరించినప్పుడు, దానికి సంబంధించిన వివరాలను మాన్యువల్‌గా లేదా డిజిటల్‌గా నమోదు చేయాలి.

ఎస్​ఓపీ ప్రకారం, ఇంధన కేంద్రాలు "గడువు ముగిసిన వాహనాలకు (అంటే, 15 సంవత్సరాల పాత పెట్రోల్- సీఎన్జీ, 10 సంవత్సరాల పాత డీజిల్ వాహనాలకు) 01.07.2025 నుంచి ఇంధనం అందించరు," అని సూచించే బోర్డులను ప్రదర్శించాలి.

పెట్రోల్ స్టేషన్ సిబ్బందికి నిబంధనలు, గడువు ముగిసిన వాహనాలకు ఇంధనం నిరాకరించే విధానాలపై శిక్షణ ఇవ్వాలని సూచించడం జరిగింది.

తాజా చర్యలతో దిల్లీలోని 62లక్షలకుపైగా వాహనాలకు ఇంధన దొరకదని అంచనా వేస్తున్నారు.

నిఘా- ఉల్లంఘనలపై చర్యలు..

ఇంధన కేంద్రాల వద్ద స్వయంచాలక కెమెరా వ్యవస్థలు పనిచేస్తాయి. ఇవి వాహన రిజిస్ట్రేషన్ వివరాలను రియల్​ టైమ్​లో మానిటర్​ చేసి ప్రదర్శిస్తాయి. ఈ ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత దిల్లీ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్​కు అప్పగించారు.

ఈ నిబంధనలను ఉల్లంఘించిన ఇంధన కేంద్రాలపై వారానికొకసారి సీఏక్యూఎం, పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖకు తదుపరి చర్యల కోసం నివేదిక వెళుతుంది. మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 192 ప్రకారం ఇంధన స్టేషన్ ఆపరేటర్లపై జరిమానాలు విధిస్తారు.

2018లో, సుప్రీంకోర్టు దిల్లీలో 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలను, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలను నిషేధించింది. 2014 నాటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం 15 సంవత్సరాలకు పైబడిన వాహనాలను బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేయడాన్ని కూడా నిషేధించింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం