Delhi Excise policy case: ఈడీ అరెస్టులతో 12 శాతం పతనమైన అరబిందో ఫార్మా-delhi excise policy case aurobindo pharma down 12 percent after ed arrests its director sarat chandra reddy ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Delhi Excise Policy Case Aurobindo Pharma Down 12 Percent After Ed Arrests Its Director Sarat Chandra Reddy

Delhi Excise policy case: ఈడీ అరెస్టులతో 12 శాతం పతనమైన అరబిందో ఫార్మా

HT Telugu Desk HT Telugu
Nov 10, 2022 06:12 PM IST

Delhi Excise policy case: అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో ఆ కంపెనీ 12 శాతం నష్టపోయింది.

అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి
అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరబిందో ఫార్మా కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్, ప్రమోటర్ పి.శరత్ చంద్రా రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడంతో ఆ కంపెనీ షేర్లు సుమారు 12 శాతం పడిపోయాయి. ఆయనతో పాటు లిక్కర్ కంపెనీ పెర్నాడ్ రికార్డ్ జనరల్ మేనేజర్ వినయ్ బాబును కూడా ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో జరిగిన అక్రమాలతో సంబంధం ఉందన్న ఆరోపణలపై వీరిని అరెస్టు చేసింది. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా లిమిటెడ్ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీకి ‘మరిన్ని వివరాలు నిర్ధారించుకునే ప్రక్రియలో ఉన్నాం. తగిన సమయంలో తదుపరి వివరాలు బహిర్గతం చేస్తాం..’ అని తెలిపింది.

తిరిగి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీకి అరబిందో ఫార్మా ఇంకో లేక సమర్పించింది. ‘శరత్ చంద్రా రెడ్డి అరెస్టుకు అరబిందో ఫార్మా కంపెనీ వ్యవహారాలకు గానీ, దాని అనుబంధ సంస్థలకు గానీ ఎలాంటి సంబంధం లేదు..’ అని కంపెనీ యాజమాన్యం తెలిపింది. శరత్ చంద్రారెడ్డి అరెస్టు విషయంలో వెలుగులోకి రాగానే అరబిందో ఫార్మా లిమిటెడ్ కంపెనీ షేర్లు 12 శాతం పతనమయ్యాయి.

వీరిద్దరే కాకుండా ఇప్పటి వరకు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇండోస్పిరట్ లిక్కర్ తయారీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రును కూడా సెప్టెంబరులో అరెస్టు అయ్యారు.

అరెస్టయిన వారు విచారణ సందర్భంలో నోరు విప్పలేదని ఈడీ అధికారులు చెప్పారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో వీరి జోక్యం ఉందని, ప్రభుత్వ అధికారులతో కలిసి వీరు పనిచేశారని, రేట్ ఫిక్స్ చేయడంలో సిండికేట్‌ను పోగేశారని ఈడీ అధికారులు తెలిపారు.

అరెస్టయిన వారి కార్యాలయాలు, ఇళ్లు తనిఖీ చేసినప్పుడు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ముసాయిదా కూడా దొరికిందని ఈడీ అధికారులు తెలిపారు. దాదాపు రూ. 200 కోట్ల విలువైన పెట్టుబడులను రీటైల్ లిక్కర్ బిజినెస్‌లో ఓ కంపెనీ నుంచి పెట్టుబడులుగా పెట్టారని ఈడీ ఆరోపిస్తోంది. ఇది పాలసీ ఉల్లంఘన కిందికి వస్తుందని ఆరోపించింది.

ఇప్పటి వరకు ఈడీ పలుచోట్ల సోదాలు జరిపింది. గత వారంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పర్సనల్ అసిస్టెంట్ నివాసంలో కూడా ఈడీ సోదాలు జరిపి విచారించింది.

మనీష్ సిసోడియా, ఇతరులపై ఆరోపణలతో కూడిన సీబీఐ ఎఫ్ఐఆర్ నుంచి సేకరించిన వివరాలతో ఈడీ కూడా ఇందులోని మనీ లాండరింగ్ వ్యవహారాలపై దర్యాప్తు జరుపుతోంది. సీబీఐ తొలుత కేసు నమోదు చేసి ఉప ముఖ్యమంత్రి, అలాగే కొందరు అధికారుల నివాసాల్లో తనిఖీలు జరిపింది.

ఎక్సైజ్ పాలసీపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదు మేరకు సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. ఎల్జీ ఇప్పటికే 11 మంది ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేశారు.

ఈడీ ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్, మంత్రి సత్యేంద్ర జైన్‌లను కూడా ప్రశ్నించింది. వేరొక మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ ప్రస్తుతం జైలులో ఉన్నారు.

సీబీఐ ఈ కేసులో ఇంకో ఇద్దరిని కూడా అరెస్టు చేసింది. ఓ ఎంటర్‌టైన్మెంట్ బిజినెస్ కంపెనీ సీఈవో విజయ్ నాయర్, లిక్కర్ వ్యాపారి అభిషేక్ రావు బోయినపల్లిని కూడా అరెస్టు చేసింది.

కాగా రాష్ట్రంలోకి సీబీఐకి ప్రవేశం లేకుండా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీచేసింది.

WhatsApp channel